logo

చిట్టి తాబేళ్లనుసంరక్షించాలని...

ఏటా జనవరి నుంచి జూన్‌ వరకు ఆలివ్‌రిడ్లేలు సముద్రంలో నుంచి వచ్చి తీరంలో గుడ్లు పెట్టేసి వెళ్లిపోతుంటాయి. అవి వాటిని పొదగలేవు. ప్రకృతి సిద్ధంగానే గుడ్ల నుంచి పిల్లలు బయటకువస్తాయి. ఇందుకు 45 నుంచి 60 రోజులు పడుతుంది.

Published : 18 Jan 2022 06:20 IST


కాశీబుగ్గ తీర ప్రాంతంలో గుడ్లు సేకరించి భద్రపరుస్తున్న సిబ్బంది

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఏటా జనవరి నుంచి జూన్‌ వరకు ఆలివ్‌రిడ్లేలు సముద్రంలో నుంచి వచ్చి తీరంలో గుడ్లు పెట్టేసి వెళ్లిపోతుంటాయి. అవి వాటిని పొదగలేవు. ప్రకృతి సిద్ధంగానే గుడ్ల నుంచి పిల్లలు బయటకువస్తాయి. ఇందుకు 45 నుంచి 60 రోజులు పడుతుంది. ఈ లోపు రక్షణలేక తాబేళ్ల సంతతి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఆలీవ్‌రిడ్లేల సంరక్షణకు జిల్లా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తీర ప్రాంతాల్లో హేచరీలను నెలకొల్పుతున్నారు. ఇందుకు ట్రీ ఫౌండేషన్‌ సంస్థ ప్రత్యేక సాంకేతిక తోడ్పాటునందిస్తోంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి...

తాబేళ్లు అర్ధరాత్రి దాటిన తరువాత సముద్రంలో నుంచి తీరానికి వచ్చి గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. అవి వచ్చినట్లు వాటి అడుగుల ఆధారంగా సిబ్బంది గుర్తిస్తారు. ఈలోపు గద్దలు వంటి పక్షిజాతులు ఆ గుడ్లను తినేస్తుండటం... సందర్శకులు పగులకొట్టేస్తుండటంతో పిల్లలు పుట్టడం లేదు. దీన్ని నివారించేందుకు జిల్లాలో తాబేళ్ల గుడ్లు సంరక్షించి, పొదిగే కేంద్రాలు(హేచరీలు) ఏర్పాటు చేయనున్నారు. ట్రీ ఫౌండేషన్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రేంజ్‌ పరిధిలో 2, టెక్కలిలో 4, కాశీబుగ్గలో 10 చొప్పున హేచరీలు ఏర్పాటు చేసి తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సుమారు 80 వేల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందుకు 30 మందిని కేటాయించారు. 5 నెలలపాటు గుడ్ల సేకరించి, సంరక్షిస్తారు. వారికి అటవీశాఖ ద్వారా వేతనాలిస్తారు. ఇప్పటికే గుడ్లు సేకరణ ప్రారంభించారు.

లక్ష్యం... రెండు లక్షలు..

ఒక్కో తాబేలు ఒకసారి 50 నుంచి 150 గుడ్లు పెడుతుంది. సంరక్షించే బృందం వేకువజామునే తీరానికి వెళ్లి గుడ్లను సేకరిస్తారు. వాటిని అక్కడే ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద అడుగు నుంచి రెండడుగులు లోతు గొయ్యి తవ్వి వాటిని అందులో వేసి మూసివేస్తారు. అవి 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలుగా మారుతాయి. వాటిని జాగ్రత్తగా వెదురుబుట్టల్లో వేసి సముద్రంలోకి విడిచిపెడతారు. ఈసారి జిల్లాలో రెండు లక్షల గుడ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అటవీశాఖ రేంజీలు: శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ

వాటి పరిధిలో ఏర్పాటు చేయనున్న హేచరీలు: 16

అందరిపైనా బాధ్యత...

అంతరించిపోతున్న తాబేళ్ల సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. తీర ప్రాంతాలకు వచ్చే సందర్శకులు తాబేళ్ల గుడ్లు కనిపిస్తే, వాటిని పగులగొట్టకుండా వదిలేయాలి. వాటి సంరక్షణకు 16 హేచరీలు ఏర్పాటు చేయనున్నాం. ఈసారి 2 లక్షలకుపైగా గుడ్లను సేకరించాలని నిర్ణయించాం.

- పి.వి.శాస్త్రి, టెక్కలి రేంజ్‌ అటవీశాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని