logo

విషాదయాత్ర..!

వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.. పిల్లలకు సెలవులు కావడంతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు సందర్శనకు సొంత కారులో బయలుదేరారు.. రెండురోజుల పాటు పలు ప్రాంతాల్లో ఆనందంగా గడిపారు... చివరిగా జిల్లాకొచ్చిన వీరు దైవ దర్శనం చేసుకుని తిరుగుపయనం అయ్యారు..

Published : 26 May 2022 06:22 IST

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను ితీస్తున్న స్థానికులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.. పిల్లలకు సెలవులు కావడంతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు సందర్శనకు సొంత కారులో బయలుదేరారు.. రెండురోజుల పాటు పలు ప్రాంతాల్లో ఆనందంగా గడిపారు... చివరిగా జిల్లాకొచ్చిన వీరు దైవ దర్శనం చేసుకుని తిరుగుపయనం అయ్యారు.. మార్గమధ్యలో దారికాచిన మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వీరి జీవితాలను కకావికలం చేసింది. ఇద్దరిని కబళించగా, మరో నలుగురిని తీవ్ర గాయాలపాల్జేసింది. ఈ ఘటన జిల్లా ఎచ్చెర్ల మండలం లింగాలపేట వద్ద జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇందులో కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వాసులైన కట్టా నరసింహమూర్తి(43), కట్టా ఆదిలక్ష్మి (37) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టా నరసింహమూర్తి, భార్య విజయదుర్గాభవానీ, పిల్లలు రాఘవసాయి మౌనిక, ఈశ్వర్‌షణ్ముఖ, కట్ట ఆదిలక్ష్మి, ఆమె కుమార్తె భవ్యశృతితో కలిసి ఈనెల 23న విహార యాత్రకు కారులో బయలుదేరారు. ఆ రోజు విశాఖలోని పర్యాటక ప్రాంతాలు సందర్శించి రాత్రికి అక్కడే బసచేశారు. 24 ఉదయం జంతు ప్రదర్శనశాలను సందర్శించారు.

దైవదర్శనానికి వచ్ఛి.

దైవదర్శనంలో భాగంగా బుధవారం అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాలను దర్శించుకొని స్వగ్రామానికి తిరుగుముఖం పట్టారు. మధ్యాహ్నం శ్రీకాకుళంలో భోజనాలు చేసి విశాఖ వైపు వెళ్తుండగా లింగాలపేట వద్దకు చేరేసరికి ముందున్న కారును ఓవర్‌ టేక్‌ చేసి ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జయింది. డ్రైవింగ్‌ చేస్తున్న నరసింహమూర్తి, ముందు సీట్లో కూర్చున్న ఆయన వదిన అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక కూర్చున్న భార్య, ముగ్గురు పిల్లలు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. విజయదుర్గాభవానీ పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మృతుడు నరసింహమూర్తి పొక్లెయిన్‌ ఆపరేటరుగా పనిచేస్తున్నారు. ప్రమాదం విషయం తెలియడం ముక్తేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బోరును విలపించటం స్థానికులను కలిచివేసింది. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలక్ష్మి(పాతచిత్రాలు)

నరసింహమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని