logo

క్లిష్టమైనా ఉచితమే..

ప్రభుత్వ ఆసుపత్రి అంటే వెనకడుగు వేయాల్సిన పన్లేలేదని... అక్కడ కూడా అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యసేవలందిస్తామని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు. ఎముకల విభాగం ఆధ్వర్యంలో అతి క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఉచితంగా, విజయవంతంగా చేస్తున్నారు. ప్రయివేట్‌ ఆసుపత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసే బదులు ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.

Published : 10 Aug 2022 04:08 IST

సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు

- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)

శస్త్ర చికిత్స చేయడంలో నిమగ్నమైన వైద్య బృందం

ప్రభుత్వ ఆసుపత్రి అంటే వెనకడుగు వేయాల్సిన పన్లేలేదని... అక్కడ కూడా అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యసేవలందిస్తామని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు. ఎముకల విభాగం ఆధ్వర్యంలో అతి క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఉచితంగా, విజయవంతంగా చేస్తున్నారు. ప్రయివేట్‌ ఆసుపత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసే బదులు ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.

ఆసుపత్రిలో ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ కింద వెన్నుముక, డిస్క్‌ శస్త్రచికిత్స, మోకాలిచిప్ప మార్పిడి వంటివి చేసి రోగుల కళ్లల్లో ఆనందం నింపారు. క్రీడాకారులు ఎక్కువగా బాధపడే లిగ్‌మెంట్‌ ఇంజ్యూరీస్‌, మోకాలి నొప్పులు సరిచేసి తిరిగి ఆడుకునేలా చేస్తున్నారు. ఎముకల విభాగాధిపతి డాక్టర్‌ ధర్మారావు, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లుకలాపు ప్రసన్నకుమార్‌ నేతృత్వంలోని బృందం, సిబ్బంది కలసికట్టుగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. త్వరలో అత్యంత క్లిష్టమైన భుజం, మోచేతుల ఆపరేషన్లు సైతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

* పలాస మండలం గారబంద గ్రామానికి చెందిన బి.కాంతారావు(32) కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించగా హిప్‌జాయింట్‌ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. కానీ దానికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో పరికరాలు కొనుగోలు చేసుకుంటే ఉచితంగా ఆపరేషన్‌ చేస్తామని సూచించారు. బాధితులు ఆ మేరకు ఒప్పుకోవడంతో జులై 21న విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.

‘ఆరోగ్యశ్రీ’లో లేకున్నా...

క్లిష్టమైన శస్త్రచికిత్సలో కొన్ని ‘ఆరోగ్యశ్రీ’ జాబితాలో లేకపోయినప్పటికీ చేసేందుకు చొరవ చూపుతున్నారు. ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స థియేటర్లు, వైద్యపరికరాలు, ఎంఆర్‌ఐ స్కాన్‌, సి.టి.స్కాన్‌, ఆల్ట్రాసౌండ్‌, మొబైల్‌ ఎక్స్‌రే యూనిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని కొన్ని ఆపరేషన్లు చేసేందుకు అవసరమయ్యే ప్లేట్లు, రాడ్లు, స్క్రూలు వంటి సామగ్రి ఉండవు. వాటిని రోగి బంధువులు కొనుగోలు చేసుకుంటే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రూ.లక్షల వ్యయంతో చేసే శస్త్రచికిత్స ఇక్కడ పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇటీవల ఆరోగ్యశ్రీ జాబితాలో లేని హిప్‌జాయింట్‌ మార్పిడి ఒకరికి ఉచితంగా చేసి సురక్షితంగా ఇంటికి పంపారు.


అధునాతన సేవలు..

సర్వజన ఆసుపత్రిలోని ఎముకల విభాగంలో నిపుణులైన వైద్యులున్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేయగల సామర్థ్యం ఉంది. దానికి తోడుగా ఆసుపత్రిలో అధునాతమైన వైద్య పరికరాలు ఉన్నాయి. బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే సంబంధిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ జాబితాలో ఉందా లేదా పరిశీలించి, ఉన్నట్లయితే పూర్తి ఉచితంగా చేస్తాం. లేనిపక్షంలో సంబంధిత పరికరాలు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటే ఉచితంగా పంపిస్తాం.

- డాక్టర్‌ ధర్మారావు, ఎముకల విభాగాధిపతి, సర్వజన ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని