logo

ఆకలి తీర్చే బ్యాంకు

నిత్యం వివిధ పనులపై దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది టెక్కలి పట్టణానికొస్తుంటారు.. కొందరు తమ పనులు త్వరగా ముగించుకోగా మరికొందరు పొద్దుపోయేవరకూ ఉండాల్సి వస్తుంది.. ఇటువంటి సమయంలో ఆకలి ఆగదు కదా.. ఎక్కడో ఒకచోట హోటల్‌కు వెళ్లి భోజనం చేయాలి.

Published : 05 Oct 2022 05:31 IST

అక్కడికి వెళితే కడుపునిండా భోజనం
ఆదర్శంగా నిలుస్తున్న అభయం ఆలోచన
న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

నిత్యం వివిధ పనులపై దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది టెక్కలి పట్టణానికొస్తుంటారు.. కొందరు తమ పనులు త్వరగా ముగించుకోగా మరికొందరు పొద్దుపోయేవరకూ ఉండాల్సి వస్తుంది.. ఇటువంటి సమయంలో ఆకలి ఆగదు కదా.. ఎక్కడో ఒకచోట హోటల్‌కు వెళ్లి భోజనం చేయాలి. డబ్బులుంటే ఫర్వాలేదు. లేకపోతే కడుపు మాడ్చుకోవాల్సిందే కదా.. ఇంకొందరు గుప్పెడు మెతుకుల కోసమూ ఆరాటపడుతుంటారు.. ఈ కష్టాలను గుర్తించింది ఓ సేవా సంస్థ.. అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అని భావించింది.. ఆకలి తీర్చేందుకు ‘ఫుడ్‌ బ్యాంక్‌’ అనే పేరుతో ముందుకొచ్చింది.. అందరికీ ‘అభయం’ ఇస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది..


టెక్కలి పట్టణంలో సేవే లక్ష్యంగా 2017లో అభయం యువజన సేవాసంఘం ఏర్పాటైంది. ఐదేళ్లుగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. అనారోగ్య కారణాలతో మంచం పట్టిన వారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఆర్థిక, వైద్యసాయం అందించింది. అత్యవసర వేళల్లో రోగులు ఉండే ఆసుపత్రికే నేరుగా వెళ్లి రక్తదానం చేసిన సందర్భాలూ ఉన్నాయి. చిన్నారులకు పుస్తకాలు, నిరుపేదలకు దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఇంతవరకూ రూ.13 లక్షలకు పైగా విరాళాలను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసింది. భవిష్యత్తు అవసరాలకు మరికొంత నిధిని సైతం సమకూర్చుకోగలిగింది. ఇంతటితో ఆగిపోలేదు.. ఇంకా ఏదో చేయాలని ఆలోచన చేసింది.. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఫుడ్‌బ్యాంక్‌..


ఏం చేస్తున్నారు..


ఫుడ్‌ బ్యాంక్‌ వద్ద భోజనం కోసం వరుస.. 

గత ఆగస్టు 15వ తేదీన టెక్కలి అంబేడ్కర్‌ కూడలిలోని మైత్రి పోలీస్‌స్టేషన్‌ వద్ద ‘ఫుడ్‌బ్యాంక్‌’ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇందులో ఆకలితో వచ్చేవారి కోసం ఆహార పొట్లాలు ఉంచుతారు. అవసరం అనుకునేవారు వచ్చి తీసుకోవచ్చు. ఇందులో నిత్యం 40 మందికి ఆహారం సమకూర్చుతున్నారు. ఇవి పూర్తయిన తర్వాత కావాలి అని వచ్చిన అందరికీ భోజనం పెడుతున్నారు. వీరి ఆలోచనకు మెచ్చిన పట్టణ ప్రజలు సహకారం అందిస్తున్నారు. పుట్టినరోజులు, పర్వదినాల పేరుతో దాతలు ముందుకొచ్చి భోజనం అందిస్తున్నారు.  దీంతో రాత్రి వేళల్లోనూ ప్రజల ఆకలి తీర్చుతున్నారు. నిజంగా ఇది ఆదర్శమే కదూ.. పట్టణాలు, నగరాలకు నిత్యం ఎంతోమంది ఏదో పనిపై వస్తుంటారు. ఇందులో అధికశాతం మంది అర్ధాకలితో అలమటిస్తారు. ఇలాంటి ఆలోచనలను మిగిలిన చోట్లా యువతా అందిపుచ్చుకోవాలి.  


ఆకలి బాధతీరుతోంది

ఎలాంటి ఆసరా లేని నిరుపేద కుటుంబం మాది. ఆకలితో ఇబ్బందులు పడిన సందర్భాలెన్నో. ఇక్కడ ఆహారం పంపిణీ ప్రారంభించాక మాలాంటివారి ఆకలి తీరుతోంది. ఈ యువకుల సంకల్పం ఎంతో గొప్పది.

- గయా మురళి, టెక్కలి


సేవా కార్యక్రమాలు విస్తరిస్తాం

మధ్నాహ్నం వేళల్లో ఎంతోమంది ఆకలితో బాధపడుతూ ఇబ్బందిపడుతున్న ఘటనలు మా దృష్టికొచ్చాయి. వారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఫుడ్‌బ్యాంకు ఏర్పాటుచేశాం. ఇప్పటికే ఏడాదికి సంబంధించిన దాతలు దొరికారు. మరింతమంది దాతలు ముందుకొస్తే మరొకటి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం సేవాసంఘం కార్యకలాపాల కోసం స్థలాన్ని కేటాయిస్తే అక్కడ విద్యార్థులకు ఉచితంగా పోటీపరీక్షల శిక్షణ కేంద్రాన్ని నడపాలన్న ఆలోచన ఉంది.

- దేవాది శ్రీనివాసరావు, అధ్యక్షుడు, అభయం యువజన సేవాసంఘం, టెక్కలి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని