logo

అనుక్షణం అదే పనిఘా

సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది.

Published : 28 Mar 2024 05:29 IST

తనిఖీ కేంద్రాల వద్ద 24 గంటలు పర్యవేక్షణ

బూర్జ మండలం మదనాపురం వద్ద తనిఖీ చేస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. అధికారులు సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాంకేతికతను వినియోగిస్తూ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో తనిఖీ కేంద్రాల(చెక్‌ పోస్టుల) వద్ద ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా అనుక్షణం అన్ని అంశాలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.

జిల్లాలో అంతర్రాష్ట్ర, అంతర జిల్లా తనిఖీ కేంద్రాలు 11 ఉన్నాయి. వాటి మీదుగా అటు ఒడిశా రాష్ట్రంతో పాటు ఇటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మద్యం, డబ్బు, ఇతర తాయిలాల రవాణాకు ఎక్కువగా ఈ దారులనే వినియోగించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా కేంద్రాలపై ప్రధానంగా దృష్టి సారించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సైతం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చెక్‌ పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీసు అధికారులను నియమించి ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జరుగుతున్న తనిఖీలను ఎన్నికల అధికారులు సైతం పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడా ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా ఉండేందుకు తనిఖీలను ముమ్మరం చేశారు.


ఎక్కడెక్కడంటే..

  • అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు: పురుషోత్తపురం, రేఖదేవిపురం (ఇచ్ఛాపురం), సిద్దిగాం (పలాస), వసుంధర, మాతల, అచ్యుతాపురం, గొప్పిలి (పాతపట్నం)
  • అంతర జిల్లా: కందివలస గెడ్డ, ఉల్లివలస గ్రామ కూడలి (ఎచ్చెర్ల), కర్లెమ్మ గ్రామ కూడలి (పాతపట్నం), మదనాపురం కూడలి(ఆమదాలవలస)

ఆ మూడు చోట్ల అధికం..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తరువాత జిల్లావ్యాప్తంగా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆరోజు నుంచి తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా మద్యం, నగదు అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకుంటున్నారు. సరైన ఆధారాలు చూపించని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని తనిఖీ కేంద్రాల వద్ద పరిమితికి మించి తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా గుర్తించారు. ఆ మూడు చోట్ల ఇప్పటి వరకు రూ.8 లక్షలకు పైగా నగదు, 15 వేల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.


ఇదీ పరిస్థితి

ఇప్పటివరకు పట్టుకున్న నగదు: రూ.11.8 లక్షలు
స్వాధీనం చేసుకున్న మద్యం: 11,986 లీటర్లు  (విలువ: రూ.11.28 లక్షలు)
సీజ్‌ చేసిన మాదక ద్రవ్యాలు: 53,110 గ్రాములు   (విలువ: రూ.1.83 లక్షలు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని