logo

అన్నాడీఎంకేలో మళ్లీ ఆధిపత్యపోరు

అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు విషయాల్లో కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు అది అంతర్గత ‘రాజకీయ’ ఎత్తుగడలతో మరిన్ని మలుపులు తీసుకుంటోంది. పార్టీ సలహాదారుగా బన్రుట్టి రామచంద్రన్‌ను నియమిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం

Updated : 30 Sep 2022 13:02 IST

 ‘బన్రుట్టి’ చుట్టూ రాజకీయాలు
సైదాపేట, న్యూస్‌టుడే

ఎంజీఆర్‌తో బన్రుట్టి రామచంద్రన్‌

అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు విషయాల్లో కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు అది అంతర్గత ‘రాజకీయ’ ఎత్తుగడలతో మరిన్ని మలుపులు తీసుకుంటోంది. పార్టీ సలహాదారుగా బన్రుట్టి రామచంద్రన్‌ను నియమిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇది విడుదలైన కొంతసేపటికే అన్నాడీఎంకే నుంచి ఆయన్ను తొలగిస్తున్నట్లు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు.
సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన బన్రుట్టి రామచంద్రన్‌ డీఎంకే, పీఎంకే, డీఎండీకే తదితర పార్టీలు మారారు. ఇప్పుడు అన్నాడీఎంకేలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా కీలక నేతగా గుర్తింపు పొందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీఆర్‌ హయాంలో మంత్రిగా పని చేశారు. పీఎంకే మొట్టమొదటి అసెంబ్లీ సభ్యుడు ఆయనే కావడం గమనార్హం. విజయకాంత్‌ డీఎండీకే ప్రారంభించినప్పుడు పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా, ముఖ్యనేతగా ఉండేవారు. 2014లో అన్నాడీఎంకేలో మళ్లీ చేరారు. 2016లో ఆలందూరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత అన్నాడీఎంకే సంస్థాగత కార్యదర్శుల్లో ఒకరిగా ఉన్నారు. మునుపటిలా రాజకీయాల్లో చురుగ్గా లేరు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో ఏక నాయకత్వం సమస్య తారస్థాయికి చేరిన తర్వాత ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. బన్రుట్టి రామచంద్రన్‌ను శశికళ ఆయన నివాసంలో కలిసిన తర్వాత ఎడప్పాడిపై తీవ్ర విమర్శలు చేశారాయన. దానికి జవాబుగా ఒక ప్రాంతీయ కార్యదర్శికి ఉండే అర్హత కూడా బన్రుట్టి రామచంద్రన్‌కు లేదని పళనిస్వామి అన్నారు.

కొత్త పదవి..
అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం తర్వాత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న పన్నీర్‌ 27న ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే రాజకీయ సలహాదారుగా బన్రుట్టి రామచంద్రన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కొన్ని నిమిషాల్లోనే బన్రుట్టిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఎడప్పాడి తెలిపారు. పార్టీ రాజకీయ సలహాదారు అనే పదవే లేదని, ఎంజీఆర్‌ కాలం వ్యక్తులు తనవైపు ఉన్నారని చూపించేందుకు కావాలనే ఓపీఎస్‌ ఈ ప్రకటన చేసుండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత కోర్టు తీర్పుల ప్రకారం అన్నాడీఎంకే ఎడప్పాడి చేతిలో ఉందని, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే పార్టీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అన్నాడీఎంకే వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్‌కే వదిలేస్తుందని తెలుస్తోందన్నారు. అప్పుడే మెజారిటీయే ముఖ్యమని, ఆ ప్రకారం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, సర్వసభ్య సభ్యుల మద్దతు కలిగిన పళనిస్వామే పైచేయి సాధించే అవకాశం ఉందని తెలిపారు.

 పన్నీర్‌, ఎడప్పాడి

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts