logo

ప్రజల నమ్మకం నిలబెట్టుకునేలా నిజాయతీ పాలన

తమను నమ్మి ఓటు వేసిన ప్రజలకు మరింత అండగా నిలిచేలా నిజాయతీగా పాలన అందిస్తున్నట్లు తెన్‌కాశిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు.

Published : 09 Dec 2022 00:58 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌

ప్రదర్శనలో స్టాళ్లను పరిశీలిస్తున్న స్టాలిన్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తమను నమ్మి ఓటు వేసిన ప్రజలకు మరింత అండగా నిలిచేలా నిజాయతీగా పాలన అందిస్తున్నట్లు తెన్‌కాశిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఆయన సంక్షేమ సాయం అందించేందుకు తెన్‌కాశికి వెళ్లారు. గురువారం ఉదయం రైలు మార్గంలో వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టరు, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంట మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పెరియస్వామి, రామచంద్రన్‌ ఉన్నారు. ముందుగా పలు శాఖల తరఫున ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ఆయన సందర్శించారు. అక్కడి తిరువళ్ళువర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ. 22.20 కోట్లతో పూర్తయిన 57 పథకాలను ప్రారంభించారు. సుమారు రూ.34.14 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. రూ.182.56 కోట్ల సంక్షేమ సాయాన్ని 1,03,508 మంది లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం మాట్లాడుతూ.... వనరులు కలిగిన  జిల్లా తెన్‌కాశి అని, సమరయోధుడు పులిదేవర్‌ పుట్టిన నేల అన్నారు. అధికారం చేపట్టాక ప్రజలకు చేసిన సంక్షేమ పథకాల గురించి గర్వంగా చెబుతున్నానని తెలిపారు. తెన్‌కాశి వినైతీర్థ నాడార్పట్టి పంచాయతీ యూనియన్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఆరాధన తనకి ఓ ఉత్తరం రాసిందన్నారు. పాఠశాలకు అదనపు భవనం కావాలని కోరిందని, ఆ మేరకు నిధి కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ప్రతిపక్ష నేత అంటున్నారని, పిల్లి కళ్లు మూసుకుని ప్రపంచం చీకటిగా ఉందని అనుకున్నట్లు ఆయన వ్యవహారం ఉందని విమర్శించారు. నమ్మి ఓటు వేసిన ప్రజలకు నిజాయతీగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఉత్తమ రాష్ట్రంగా తమిళనాడును మార్చడమే తమ లక్ష్యం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలను చూసినా రాష్ట్ర అభివృద్ధి గురించి తెలుస్తుందని పేర్కొన్నారు.

సంక్షేమ సాయం అందిస్తున్న దృశ్యం


సీఎంగా తొలిసారి రైలెక్కిన స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్‌ తొలిసారి రైలు ప్రయాణం చేశారు. తెన్కాశి జిల్లా ఇలత్తూర్‌లో గురువారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం రాత్రి ఎగ్మూరు స్టేషన్‌ నుంచి పొదిగై ఎక్స్‌ప్రెస్‌లో ఆయన వెళ్లారు. దీని కోసం రైలుకు ప్రత్యేక బోగీని అనుసంధానం చేశారు. ఇందులో అన్నిరకాల సదుపాయాలు ఉంటాయి.


విగ్రహావిష్కరణకు ఆహ్వానం

చెన్నై, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆయన క్యాంపు కార్యాలయంలో వీసీకే అధ్యక్షుడైన ఎంపీ తిరుమావళవన్‌ అందించారు. మదురైలో శుక్రవారం వీసీకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు