logo

మది నిండుగా... మువ్వన్నెల పండుగ!

నగరంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అలంకరణ శకటాల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

Published : 27 Jan 2023 00:44 IST

ఘనంగా గణతంత్ర దిన వేడుకలు
ఆకట్టుకున్న అలంకరణ శకటాలు

జాతీయ పతాకానికి వందనం చేస్తున్న గవర్నర్‌ రవి, సీఎం స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: నగరంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అలంకరణ శకటాల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ దళాల కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. తొలుత గణతంత్ర దిన వేడుకలను చెన్నై బీచ్‌ రోడ్డులోని శ్రామిక విగ్రహం వద్ద గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి దంపతులను ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, త్రిదళాల అధికారులు, డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనరు శంకర్‌ జివాల్‌ తదితరులు స్వాగతించారు. జాతీయ జెండాను గవర్నర్‌ ఎగరవేసి గౌరవ వందనం చేశారు. ఆ సమయంలో హెలికాప్టర్‌ ద్వారా పువ్వులను కురిపించారు. వేదికపైకి చేరుకున్న గవర్నర్‌కు త్రిదళాలు, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, రాష్ట్ర స్పెషల్‌ కమాండో, రాష్ట్ర విపత్తు నియంత్రణ దళం, తీర భద్రతా దళం, హోంగార్డు తదితర 30కుపైగా దళాలు కవాతుతో గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ అందించాయి. తర్వాత పలువురికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ పతకాలు ప్రదానం చేశారు. కోట్టై అమీర్‌ మత సామరస్య పతకాన్ని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఇనయదుల్లాకు, ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అన్నా పతకాలను ప్రభుత్వ ఉద్యోగుల విభాగంలో చెన్నై అమైందరైకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ శరవణన్‌, వేలూరుకు చెందిన నర్సు జయకుమార్‌ పొన్నరసు, ప్రజా విభాగంలో తూత్తుకుడికి చెందిన అంతోనిస్వామి, కన్యాకుమారికి చెందిన శ్రీకృష్ణన్‌, తంజావూరుకు చెందిన సెల్వం అందుకున్నారు. వ్యవసాయ విభాగంలో ప్రత్యేక పురస్కారాన్ని సవరించిన వరి సాగు సాంకేతికతతో అధిక దిగుబడి సాధించిన పుదుకోట్టై జిల్లాకు చెందిన వసంతకు, గాంధీ పోలీస్‌ పతకాన్ని చెన్నై సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రియదర్శిని, తంజావూరు జిల్లా పట్టుకోట్టై ప్రొహిబిషన్‌ విభాగం ఇన్‌స్పెక్టర్‌ జయమోహన్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్సైలు సహాదేవన్‌ (సేలం జోన్‌), ఇనాయత్‌ బాషా (విళుపురం జోన్‌), చెంగల్పట్టు జిల్లాకు చెందిన కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం హెడ్‌ కానిస్టేబుల్‌ శివనేసన్‌లకు ప్రదానం చేశారు. ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లుగా తిరుప్పూరు నార్త్‌, తిరుచ్చి ఫోర్ట్‌, దిండుగల్‌ తొలి మూడు బహుమతులు అందుకున్నాయి. తర్వాత పాఠశాల, కళాశాల విద్యార్థుల సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు

‘తమిళనాడు వాళ్గ’

కార్యక్రమంలో భాగంగా త్రిదళాలు, తీర భద్రతా దళం, పోలీసు, జైళ్లు, అటవీ, అగ్నిమాపక, కోస్ట్‌ గార్డు, వైమానిక తదితర శాఖల అలంకరణ శకటాల ప్రదర్శన జరిగింది. వాటిలో ముందుగా రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాలశాఖ తరఫున ఏర్పాటు చేసిన అలంకరణ శకటం ప్రదర్శనకు వచ్చింది. అందులో ‘తమిళనాడు వాళ్గ’ అనే నినాదం ఉంచారు. తమిళనాడు పదంపై గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ శకటం పలువురిని ఆకట్టుకుంది.

చిరునవ్వులు...

శాసనసభ సమావేశంలో వాకౌట్‌ తర్వాత ప్రస్తుత కార్యక్రమంలో గవర్నర్‌ రవి నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఎదురయ్యారు. సుమారు గంటపాటు పక్కపక్కనే కూర్చుని చిరునవ్వులతో కార్యక్రమాలు తిలకించారు. తర్వాత గవర్నర్‌ను స్టాలిన్‌ సాగనంపారు. సభాపతి అప్పావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, విదేశాల దౌత్యాధికారులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఈ వేడుకను కామరాజర్‌ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం అక్కడ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్నందున మార్చారు.

వైమానికదళం, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల శకటాలు

మహిళల కృషిని కీర్తించేలా శకటం

చెన్నై, న్యూస్‌టుడే: దిల్లీకి రాష్ట్ర శకటం మహిళల కృషిని కీర్తించేలా వెళ్లిందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. తన ట్వీట్‌లో... దీంతోపాటు ద్రావిడ నిర్మాణ కళ, చోళ రాజుల ఔన్నత్యం తెలిపేలా శకటం రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనకు గౌరవాన్ని కల్పించిన ఆదర్శాలను కాపాడుదామంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

పోలీసు విభాగం కవాతు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని