logo

‘ఆయుష్‌’ కోర్సుల్లో వెయ్యి సీట్లు ఖాళీ

ఆయుష్‌ వైద్య కోర్సుల్లో దాదాపు వెయ్యి వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో 61 సీట్లతో పాటు సిద్ధ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి కోర్సుల్లో సీట్లు భర్తీ కాలేదు.

Published : 27 Jan 2023 00:44 IST

వడపళని, ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఆయుష్‌ వైద్య కోర్సుల్లో దాదాపు వెయ్యి వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో 61 సీట్లతో పాటు సిద్ధ, ఆయుర్వేద, యునాని, హోమియోపతి కోర్సుల్లో సీట్లు భర్తీ కాలేదు. ర్యాంకుల జాబితా మేరకు అర్హులైన వారికి సీట్లు కేటాయించారు. కోర్సుల్లో చేరిన వారు వేరే కోర్సుల్లో చేరేందుకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నాలుగు యూజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటాలో 490, మేనేజ్‌మెంట్‌ కోటాలో 503 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇండియన్‌ మెడిసిన్‌ రాష్ట్ర సెలక్షన్‌ కమిటీ పేర్కొంది. గత ఏడాది 6000 మంది దరఖాస్తులు సమర్పించుకోగా ఈ ఏడాది 4,200 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని సెలక్షన్‌ కమిటీ కార్యదర్శి డాక్టర్‌ మలర్‌విళి అన్నారు. ప్రభుత్వ సిద్ధ కళాశాలలో బీఎస్‌ఎంఎస్‌ కోర్సులో 136 సీట్లకుగాను 24, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో 51 బీఏఎంఎస్‌ సీట్లలో 3, ప్రభుత్వ యునాని కళాశాలలో బీయూఎంఎస్‌లో 42కు గాను 27, ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో 51 బీహెచ్‌ఎంఎస్‌కు గాను ఏడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. 61 సీట్లలో హోమియోపతి నాలుగు, యునానికి మూడు సీట్లను 7.5 శాతం కోటా కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేటాయించారు. బీఏఎంఎస్‌లో 75, బీహెచ్‌ఎంఎస్‌లో 289 సీట్లను ప్రభుత్వానికి సమర్పించగా, సెల్‌్్ఫ ఫైనాన్సింగ్‌ కళాశాలల్లో ఖాళీగానే ఉన్నాయి. ఖాళీల భర్తీ కోసం కమిటీ వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలను నిర్వహించాలని ఆలోచిస్తోంది. అయితే ఆయుష్‌ కోర్సుల్లో చేరిన వారిలో పలువురు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కళాశాలల్లో బీడీఎస్‌ (దంత వైద్య కోర్సు)కి మళ్లారని మలర్‌విళి అన్నారు. బీడీఎస్‌ కోర్సులలో ఈ నెల 14తో ప్రవేశాలు ముగిశాయి. ఈ ఏడాది యూజీ కోర్సులు ప్రారంభించడంలో అనేక మంది ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిద్ధ’ (ఎన్‌ఐఎస్‌)లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చెన్నైలోని ఎన్‌ఐఎస్‌లో 33 ఖాళీలున్నాయి. ఇందులో చేరేందుకు ఫిబ్రవరి రెండో వారం వరకు సమయముందని ఆమె చెప్పారు. నీట్‌ పరీక్ష ఎప్పుడైనా రాయొచ్చనే అవకాశం ఉండటంతో కోర్సు చదువుతున్న సమయంలో కూడా చాలా మంది ఆ పరీక్ష రాసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, కొందరయితే యూజీ పూర్తి చేసిన తర్వాత కూడా  నీట్‌ పరీక్ష రాస్తున్నారని ఓ సీనియర్‌ ఆచార్యులు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని