logo

విద్యుత్తు అవసరాలు తీరేలా టాన్‌జెడ్కో జాగ్రత్తలు

ఈ ఏడాది వేసవిలో విద్యుత్తు వినియోగం పెరిగి 2,000 మెగావాట్ల వరకు అవసరమయ్యే అవకాశాలున్నాయని ‘టాన్‌జెడ్కో’ భావిస్తోంది. ఈ మేరకు  ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Updated : 09 Feb 2023 06:11 IST

వడపళని, న్యూస్‌టుడే: ఈ ఏడాది వేసవిలో విద్యుత్తు వినియోగం పెరిగి 2,000 మెగావాట్ల వరకు అవసరమయ్యే అవకాశాలున్నాయని ‘టాన్‌జెడ్కో’ భావిస్తోంది. ఈ మేరకు  ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. వేసవి డిమాండును తట్టుకునేందుకు ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. శీతాకాలం తగ్గక పోయినప్పటికీ  విద్యుత్తు డిమాండు మాత్రం వెయ్యి మెగావాట్లు ఎక్కువైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఎక్కువేనని టాన్‌జెడ్కో పేర్కొంది. 2022 జనవరిలో గరిష్ఠంగా 13వేల మెగావాట్లు ఉండగా .. ఈ ఏడాది జనవరికి 14వేలు  దాటింది. మరి కొద్ది రోజుల్లో వేసవి ప్రవేశించనుండటంతో టాన్‌జెడ్కో ముందు జాగ్రత్తలపై దృష్టి సారించింది. మార్చి నుంచి 2,000 మెగావాట్ల కన్నా ఎక్కువే అవసరం కావచ్చని భావిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ 388.08 మిలియన్ల యూనిట్లు వినియోగమై, అత్యధికంగా 17,563 మెగావాట్లుగా రికార్డు సృష్టించింది. ప్రతి ఏడాది గరిష్ఠంగా డిమాండు 1,500 మెగావాట్లకు చేరుకుంటోందని, 19వేల వరకు చేరుకునే ఆస్కారం లేకపోలేదనేది టాన్‌జెడ్కో అభిప్రాయంగా ఉంది. వేసవి సమయంలో డిమాండును అధిగమించేందుకోసం ప్రయివేటు సంస్థలతో 2,000 మెగావాట్ల మేరకు కొనుగోలు చేసేందుకు టాన్‌జెడ్కో ఒప్పందాలు కుదుర్చుకుంది. డిమాండును తట్టుకునేందుకు 16వేల మెగావాట్ల మేరకు థర్మల్‌ స్టేషన్ల ద్వారా ఉత్పత్తి చేసేందుకు టాన్‌జెడ్కో ప్రయత్నాలు చేస్తోంది. కాకుండా సౌర, హైడ్రో ద్వారా 15 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును సీజన్‌ సమయాల్లో వినియోగించుకుంటోంది. బొగ్గు నిల్వతో ఏడేళ్లుగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. గత సెప్టెంబరులో వేసవి ఎద్దడిని తట్టుకునేందుకు టాన్‌జెడ్కో దిగుమతి చేసుకునేందుకు టెండర్లను ఆహ్వానించినట్టు ప్రకటించింది. వాడకం బాగా ఎక్కువవడంతో నిల్వ తగ్గింది. సరఫరాలో ఆటంకం లేకుండా ఉంటే సమస్యలు అంతగా ఉండవని అధికారి ఒకరన్నారు. బయటి మార్కెట్టు నుంచి విద్యుత్తు కొనుగోలు లాభదాయకమేనని, ముందుగానే కావలసినంత కొనుగోలు చేస్తే యూనిట్‌కి అయ్యే ఖర్చు కూడా  పరిమితంగానే ఉంటుందని తమిళనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (టీఎన్‌ఈఆర్సీ) మాజీ  అధ్యక్షుడు ముత్తుస్వామి అన్నారు. ఉత్తర చెన్నైలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన థర్మల్‌ పవర్‌ స్టేషను ప్రారంభమై, అనుకున్న మాదిరిగా గ్రిడ్‌కు అనుసంధానమైతే వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలు తగ్గే వీలుంటుందని టాన్‌జెడ్కో అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ ప్రయోగాత్మక పరీక్షలు జరగాల్సి ఉందని, వేసవి అనంతరం ప్లాంటు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.


వాహన చోదకులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు

వడపళని, న్యూస్‌టుడే: నగరంలో పూనమల్లి నుంచి లైట్‌ హౌజ్‌ వరకు మెట్రో రెండో దశ నిర్మాణం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌లో ఆంక్షలు విధించడంతో నిత్యం వాహన చోదకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్తంభాల నిర్మాణం ఏడాది కల్లా పూర్తవుతుందని, అన్ని ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించి ట్రాఫిక్‌ సమస్యను తీర్చగలమని చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎంఏ సిద్ధిక్‌ అన్నారు. రద్దీ ప్రాంతాలైన పోరూరు, అయ్యప్పన్‌ తాంగల్‌, కరయన్‌చావడి, పూనమల్లిలో ముందుగా స్తంభాల నిర్మాణం జరుగుతుందన్నారు.  రద్దీ వేళల్లో వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఈ ప్రాంతాల్లో బ్లూ బారికేడ్లను సిమెంటు స్తంభాలకు దగ్గరగా అమరుస్తామని ఆయన అన్నారు. ఏడాది కల్లా స్తంభాల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. స్తంభాల నిర్మాణం పూర్తి కాగానే బారికేడ్లు తొలగిస్తామని ట్రాఫిక్‌కు అంతగా  ఆటంకాలు ఉండవన్నారు. 2025 మధ్య కాలంలో పోరూరు నుంచి పూనమల్లి వరకున్న పది కిలోమీటర్ల దూరంతోపాటు పూనమల్లి బైపాస్‌ రోడ్డులో ఉన్న నిర్వహణ డిపోవరకు మార్గాన్ని పూర్తిగా అనుమతించేందుకు సీఎంఆర్‌ఎల్‌ ఆలోచిస్తోంది. సీఎంఆర్‌ఎల్‌ ఉన్నత ప్రతినిధి ఎల్‌.గిరిరాజన్‌ మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా పోరూరు నుంచి పూనమల్లి వరకు పది కిలోమీటర్ల వరకు బ్లూ బారికేడ్లు ఉన్న ప్రాంతాల్లో దారి సుగమం చేసి, స్టేషను నిర్మాణం ప్రారంభించాలని భావిస్తున్నామని చెప్పారు. స్టేషను నిర్మాణ సమయంలో ఎక్కువ స్థలం అవసరం ఉండదని సీఎంఆర్‌ఎల్‌ అధికారులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని