logo

ఉచిత ప్రయాణానికి ఆదరణ

మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద మహిళలు 258.06 కోట్ల ప్రయాణాలు చేసినట్లు మంత్రి శివశంకర్‌ తెలిపారు.

Published : 29 Mar 2023 00:25 IST

మంత్రి శివశంకర్‌

అధికారులతో సమావేశమైన మంత్రి శివశంకర్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద మహిళలు 258.06 కోట్ల ప్రయాణాలు చేసినట్లు మంత్రి శివశంకర్‌ తెలిపారు. రవాణాశాఖ మంత్రి శివశంకర్‌ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ పనితీరుపై సమీక్షా సమావేశం సోమవారం జరిగినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం నగర బస్సుల్లో 7,164 సాధారణ బస్సులను మహిళల ఉచిత ప్రయాణం కోసం నడుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మహిళలు ఉచితంగా 258.06 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి మహిళ నెలకు రూ.888 పొదుపు చేస్తున్నట్లు తాజాగా చేపట్టిన అధ్యయనంలో తెలిసిందన్నారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ట్రాన్స్‌జెండర్లకు విస్తరించినట్లు చెప్పారు. 2021 ముందు 409 మార్గాల్లో నిలిపేసిన 510 బస్సులను మళ్లీ నడుపుతున్నట్లు తెలిపారు. ముఖ్యమైన మార్గాల్లో 352 మంది కండక్టర్లు లేకుండా బస్సులను నడపడంతో ఆదాయం పెరిగినట్లు తెలిపారు. చెన్నై సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రవాణాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గోపాల్‌, అన్ని రవాణా సంస్థల మేనేజింగ్‌ డైరక్టర్లు మొదలైన వారు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని