logo

పొట్టకూటికి వచ్చి... హత్యకు గురయ్యారు

పొట్టకూటి కోసం వలస వచ్చి బతుకుతున్న దంపతులు హత్యకు గురయ్యారు. కర్ర, ఇనుప వస్తువుతో భార్యాభర్తల ముఖం, తలపై తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ సప్తగిరినగర్‌లో చోటు చేసుకున్న

Updated : 09 Aug 2022 06:45 IST

చినముషిడివాడలో కాపలాదారు దంపతులు దారుణ హత్య

చిన ముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం వలస వచ్చి బతుకుతున్న దంపతులు హత్యకు గురయ్యారు. కర్ర, ఇనుప వస్తువుతో భార్యాభర్తల ముఖం, తలపై తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ సప్తగిరినగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇవి. ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి దరి అజ్జాడ గ్రామానికి చెందిన సుతారి అప్పారావు(60), లక్ష్మి(55) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడు సత్యనారాయణ నగరంలోని బర్మాక్యాంపు ప్రాంతంలో  ఉంటూ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మరో కొడుకు, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. అప్పారావు దంపతులు తొలుత సుజాతనగర్‌లోని ఓ బిల్డర్‌ వద్ద కాపలాదారుగా పని చేశారు. అదే బిల్డర్‌కు చెందిన చినముషిడివాడ సప్తగిరినగర్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం వద్దకు 20 రోజుల క్రితం కాపలాదారుగా వచ్చారు. సోమవారం మధ్యాహ్నం సుమారు అప్పారావు దంపతులు ఉన్న ప్రాంతాన్ని భవనం సూపర్‌వైజర్‌ నీల్‌కాంత్‌ పరిశీలించగా..వారిద్దరూ అచేతనంగా పడి ఉన్న విషయం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీసీపీ సుమిత్‌ సునీల్‌, ఏసీపీ పెంటారావు, సీఐ అశోక్‌కుమార్‌, క్లూస్‌ బృందం, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌ కుక్కలు భవనం చుట్టు పక్కనే సంచరించాయి.  సమీప భవనంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఆస్తి తగాదాలు కాని, ఎలాంటి శత్రువులూ లేరని మృతుల కుమారుడు సత్యనారాయణ పేర్కొన్నారు.  మృతదేహాలను శవపరీక్షకు పంపే విషయంపై సీపీఐ నాయకులు ఆర్‌.శ్రీనివాసరావు, వై.రాంబాబు అభ్యంతరం తెలిపారు. మృతులకు బిల్డర్‌ పరిహారం ప్రకటించాలని కుటుంబ సభ్యులతో కలిసి పట్టుబట్టారు. పోలీసుల సమక్షంలో బిల్డర్‌, భాగస్వాములతో చర్చించారు.

అక్కసుతోనే హత్య..?: అప్పారావు దంపతుల హత్యపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల ముఖం, తలపై సరుగుడు కర్రతో దాడి చేసినట్లు గుర్తించారు. అక్కడున్న కర్రను స్వాధీనం చేసుకున్నారు. కర్రతో పాటు ఇంకేదైనా లోహపు వస్తువును దాడికి ఉపయోగించి ఉంటారన్న అనుమానాలు క్లూస్‌ బృందం వ్యక్తం చేసింది. మరోవైపు ఎవరు హత్యకు పాల్పడి ఉంటారన్న విషయంపై స్పష్టత రాలేదు. సప్తగిరినగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అప్పారావు దంపతులు చేరక ముందు పని చేసిన వారిలో ఓ కాపలాదారుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన భవనానికి సమీపంలోనే నివాసం ఉంటున్న అతడిపై నిఘా ఉంచారు. చరవాణిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను పని చేయాల్సిన చోట అప్పారావు దంపతులు చేరారన్న అక్కసుతో హత్యకు పాల్పడి ఉండవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని