logo

సూర్యనారాయణ.. వేద పారాయణ..

సూర్యనారాయణ.. వేద పారాయణ.. లోక రక్షామణి.. దైవ చూడామణి.. అంటూ భక్తజనం సూర్య భగవానుడిని భక్తితో కొలిచారు.

Updated : 29 Jan 2023 05:32 IST

కృష్ణాపురం గోశాలలో సూర్య భగవానుడు, పూజలు చేస్తున్న భక్తులు

సింహాచలం, న్యూస్‌టుడే: సూర్యనారాయణ.. వేద పారాయణ.. లోక రక్షామణి.. దైవ చూడామణి.. అంటూ భక్తజనం సూర్య భగవానుడిని భక్తితో కొలిచారు. రథసప్తమిని పురస్కరించుకుని కృష్ణాపురంలోని సింహాచలం దేవస్ధానం గోశాలలో కొలువైన సూర్య భగవానుడి సన్నిధిలో శనివారం విశేష పూజలు జరిగాయి. దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిత్యుడు కొలువైన ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. వేలాది మంది భక్తులు స్వయంగా ప్రత్యక్ష నారాయణుడి సన్నిధిలో పూజలు చేశారు. ఏఈవోలు వై.శ్రీనివాసరావు, జంగా శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో ట్రస్టుబోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.  

* సమన్వయ లోపం: అధికారుల మధ్య సమన్వయ లోపంతో గోశాలలో జరగాల్సిన వైదిక కార్యక్రమాలకు విఘాతం కలిగింది. రథ సప్తమిని పురస్కరించుకుని గోశాల వద్ద ఉదయం 8గంటల నుంచి సూర్య భగవానుడికి పంచామృతాభిషేకం, అరుణ పారాయణం, అరుణ హోమం, సూర్య నమస్కారాలు జరుగుతాయని అధికారులు ముందుగా ప్రకటించారు. శనివారం ఉదయం 9.30గంటలైనా ఒక్క అర్చక స్వామి కూడా గోశాల వద్దకు రాలేదు. అప్పటికే అక్కడికి వచ్చిన నాదస్వర బృందం, ఒక వేద పండితుడు, ఇద్దరు ఏఈవోలు అర్చకుల కోసం ఎదురు చూశారు. ఏఈవో వై.శ్రీనివాసరావు ఆలయ ఏఈవో నరసింహరాజుకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించి అర్చకులను పంపాలని కోరారు. వేద పాఠశాల అధ్యాపకులకు పూజలు అప్పగించామని చెప్పడంతో వారికి ఫోన్‌ చేశారు. వారంతా శారదా పీఠానికి వెళ్లినట్లు చెప్పారు. చివరికి ఉన్న ఒక్క వేదపండితుడితోనే పూజలు మాత్రమే జరిపించి కార్యక్రమాన్ని ముగించారు. దీనిపై పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని