logo

తవ్వుకోనిస్తే తాయిలాలు.. అడ్డుకుంటే ఆగడాలు

ఎత్తయిన కొండలు.. ఎటు చూసినా ఆకుపచ్చని ప్రకృతి సౌందర్యం.. మధ్యలో సుందరకోట ఊరు. పేరుకు తగ్గట్టుగానే అదో అందమైన గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలు జీడితోటలు, జాఫ్రా, వరి పండించుకుని జీవిస్తున్నారు.

Updated : 02 Feb 2023 06:27 IST

లేటరైట్‌ క్వారీ యజమానుల తీరిది
గిరిజనుల మొర ఆలకించేదెవరు?
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, నర్సీపట్నం గ్రామీణం, నాతవరం, న్యూస్‌టుడే

కొండపై జీడి తోటల మధ్య  చదును చేస్తున్న బ్లేడ్‌ ట్రాక్టర్‌  

త్తయిన కొండలు.. ఎటు చూసినా ఆకుపచ్చని ప్రకృతి సౌందర్యం.. మధ్యలో సుందరకోట ఊరు. పేరుకు తగ్గట్టుగానే అదో అందమైన గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలు జీడితోటలు, జాఫ్రా, వరి పండించుకుని జీవిస్తున్నారు. పంటల్లేనప్పుడు సమీపంలోని అడవుల్లోకి వెళ్లి అటవీ ఉత్పత్తులు సేకరించి అమ్ముకుంటారు. నాలుగైదు రోజులుగా వారందరిలో ఆందోళన నెలకొంది. కొన్నేళ్ల క్రితం ఆపేసిన లేటరైట్‌ తవ్వకాలను మళ్లీ మొదలెడతామంటూ ఇతర జిల్లాలకు చెందిన కొందరు రావడం, రోడ్డును సరిచేయించే పనులు చేపట్టడంతో వీరిలో ఆందోళన మొదలైంది.

* సుందరకోటకు ఆనుకుని ముల్లుకొండపై 2013 నుంచి మూడేళ్ల పాటు లేటరైట్‌ తవ్వకాలు జరిగేవి. ఆ తరవాత ఆగిపోయాయి. దాదాపు పన్నెండు ఎకరాల్లో లీజు కాలపరిమితి మరికొన్నేళ్లు ఉండడంతో మళ్లీ తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. క్వారీ నుంచి ఊళ్లోని తారురోడ్డు వరకు దాదాపు కిలోమీటరు వరకు గతంలో మట్టిరోడ్డు ఉండేది. కొన్నేళ్లుగా రాకపోకలు లేకపోవడంతో దీనిపై తుప్పలు పెరిగిపోయాయి. క్వారీ ప్రతినిధులు ఇప్పుడు పొక్లెయిన్‌, బ్లేడ్‌ ట్రాక్టర్లతో రోడ్డు బాగు చేయించుకుంటున్నారు.

* కొండపై జీడి, జఫ్రా సాగుచేసుకుంటున్న కొందరు వెళ్లి తవ్వకాలు జరిగితే పంటలు పాడవుతాయి. క్వారీ లీజు ప్రదేశంలోనే జీడితోటలు ఉన్నాయి. తవ్వకాలు చేపట్టొద్దని లీజుదారుల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ‘తవ్వకాలు ఆగవు.. కూర్చుని మాట్లాడుకుందాం.. అందరం కలిసి ఓ అంగీకారానికి వద్దాం’ అంటూ ఆ ప్రతినిధులు నచ్చజెప్పారు. ఆ ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు క్వారీ ప్రతినిధులకు తమ డిమాండ్లు తెలియజేశారు. రేషన్‌కార్డు ప్రాతిపదికన ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున నగదు, ఊళ్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల ఖర్చు కింద రూ.5 వేలు, ఊళ్లో ఎవరికైనా వివాహమైనా, చిన్నపాటి వేడుకలున్నా రూ. 5 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు. దీనిపై ఆదివారం కూర్చోని తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.


* దశాబ్దం క్రితం సరుగుడు పంచాయతీలో కొన్ని లేటరైట్‌ లీజులు ఖరారైనప్పుడు అప్పటి లీజుదారులు క్వారీల నుంచి గ్రామాల మీదుగా మట్టి రోడ్లు వేసుకున్నారు. ఏదోలా రోడ్డు వస్తుందని అప్పట్లో గిరిజనులు అడ్డుపెట్టలేదు. వీటిని ప్రభుత్వం తారురోడ్లుగా మార్పు చేసింది. కోర్టు కేసులు, గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదుల కారణంగా ఈ ప్రాంతంలోని ఇతర లేటరైట్‌ క్వారీల్లో కొన్నేళ్లుగా తవ్వకాలు ఆగిపోయాయి. తారురోడ్లు గిరిజనులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడు కాలినడకే శరణ్యం. ఇప్పుడు నేరుగా ఊళ్లోకి ఆటోలు వస్తున్నాయి. బైకులు, స్కూటర్ల వినియోగం పెరిగింది. భారీ వాహనాలు తిరిగితే చక్కని తారురోడ్లు గోతులు పడతాయని భయపడుతున్న గిరిజనులు రోడ్లు పాడయితే ఎవరిది బాధ్యత అని క్వారీ ప్రతినిధులను నిలదీశారు. గోతులు ఆరునెలలకోసారి సొంత ఖర్చుతో పూడ్పిస్తాం.. లీజు పూర్తయ్యాక రోడ్లు పునరుద్ధరించుకోవడానికి రూ.5 లక్షలు ముందుగానే ఉమ్మడి ఖాతాలో జమచేస్తామని క్వారీ ప్రతినిధులు గ్రామపెద్దలకు నచ్చజెబుతున్నారు.

హద్దులు పరిశీలిస్తున్న అటవీ రేంజ్‌ అధికారి లక్ష్మీనర్సు


పర్యావరణానికి నష్టం

తవ్వకాలు, జనం రాకపోకలు తదితర కారణాల వల్ల విలువైన వృక్షాలు క్రమేపీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడి అడవుల్లో సింధుగ, సిరిమాను, నేరేడు తదితర వృక్షాలు ఉన్నాయి. యంత్రాల శబ్దం, వాహనాల రోద వల్ల వన్యప్రాణుల సంచారం తగ్గిపోతుంది. కొండగొర్రె, కణుజు, దుప్పి, కారుకోళ్లు, నెమళ్లు, అలుగుపంది తదితరాలు ఇక్కడి అడవుల్లో ఉన్నాయి. లేటరైట్‌ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు నర్సీపట్నం అటవీరేంజ్‌ అధికారి లక్ష్మీనర్సు సిబ్బందితో కలిసి బుధవారం సుందరకోట వెళ్లి పరిశీలించారు. క్వారీ ప్రదేశానికి రిజర్వు అడవి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉందని రేంజ్‌ అధికారి తెలిపారు. అటవీ పరిధిలో కాకపోవడంతో వారంతా గిరిజనులతో మాట్లాడి వచ్చేశారు.


తవ్వనిచ్చేది లేదు
- పట్టెం లోవరాజు, సుందరకోట

క్వారీని ఆనుకుని కొండపై జీడితోట పెంచుకుంటున్నాం. గతంలో తవ్వకాలు సాగినప్పుడు 70 సెంట్ల విస్తీర్ణంలో తోటని మట్టితో కప్పేశారు. గట్టిగా అడిగితే రూ. రెండు లక్షలు పరిహారంగా ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు తవ్వుతామని చెబుతున్నారు. జీడితోటలు పూత పూస్తున్నాయి. తవ్వకాల వల్ల ధూళి ఎగిసి పూత దెబ్బతింటోంది. తవ్వకాలను అడ్డుకుంటా.


తోటలు ఎర్రబడుతున్నాయి
- జనుమూరి గంగరాజు, సుందరకోట

ముల్లుకొండపై నాలుగెకరాల వరకు జీడితోట ఉంది. గతంలో లేటరైట్‌ తవ్వినప్పుడు ఎర్రమట్టి ధూళికి జీడితోటంతా ఎర్రగా మారిపోయింది. రాళ్లొచ్చి తోటలో పడిపోయేవి. దిగుబడి తగ్గేది. తవ్వకాల కోసం ఆరాటమే గానీ సాగుదార్ల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. మొన్న పొక్లయిన్‌ వచ్చినప్పుడు అడ్డుకున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని