logo

వీధి వ్యాపారులపై పిడుగు

జీవీఎంసీ, పోలీసుల ఆంక్షలు నగరంలోని వీధి వ్యాపారుల జీవితాల్లో కలవరం రేపుతున్నాయి. రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై ఉంటున్న వేలాది మందిని అక్కడి నుంచి తొలగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated : 04 Feb 2023 05:50 IST

 ఇతర ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు

 పోలీసులు, జీవీఎంసీ సిబ్బంది హడావుడి

 తెడ్డు వెంకటేశ్వరరావు, ఏపీ వీధి విక్రయదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జీవీఎంసీ, పోలీసుల ఆంక్షలు నగరంలోని వీధి వ్యాపారుల జీవితాల్లో కలవరం రేపుతున్నాయి. రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై ఉంటున్న వేలాది మందిని అక్కడి నుంచి తొలగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జీ-20 సన్నాహక సదస్సులకు దేశవిదేశాల ప్రతినిధులు వస్తున్నారని, వారి వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా రద్దీ కూడళ్లు, ప్రధాన రహదారుల్లో వ్యాపారాలు చేయకుండా  అడ్డుకుంటున్నారు. వీఐపీలు తిరిగే ప్రాంతాల్లో కాకుండా నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఇతర ప్రాంతాలకు వెళుతుండగా, కొంత మంది వ్యాపారాలకు దూరమవుతున్నారు. సదస్సుకు ఇంకా నెలరోజులకుపైగా సమయం ఉండగా, ఇప్పుడే వీధి వ్యాపారులను ఖాళీ చేయిస్తుండడం గమనార్హం. గుర్తించిన ప్రాంతాల్లోనూ శాశ్వతంగా వ్యాపారాలు చేయనీయకుండా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

*   విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించడంతో అధికారుల హడావుడి మొదలైంది. సీఎం కాన్వాయ్‌ తరచూ సంచరించే ప్రాంతాలుగా కొన్ని గుర్తించి, అక్కడున్న వ్యాపారులను పూర్తిగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నారని తోపుడుబళ్ల కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు.
20వేల మందిపై ప్రభావం:  అనకాపల్లి నుంచి భీమిలి వరకు దాదాపు 20వేల మంది వీధి వ్యాపారులు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గతంలో అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలు, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వచ్చే మార్గాల్లో రెండు, మూడు రోజులపాటు వ్యాపారం చేయవద్దన్నారు. ఇప్పుడు గుర్తించిన 22 ప్రాంతాల నుంచి తరలించడానికి అధికారులు ప్రణాళికలు రచించారు. విమానాశ్రయం నుంచి తాటిచెట్లపాలెం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా, ప్రధాన కూడళ్లలో వ్యాపారాలకు అనుమతించడంలేదు. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో ఉన్న వారికి ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు రహదారి పక్కన వ్యాపారాలను పూర్తిగా నియంత్రించనున్నారు.

* జీవీఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం వీధి వ్యాపారులు ప్రధాన జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కమిషనర్‌ రాజాబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ వ్యాపారాలు నష్టపోయేలా సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీఐటీయూ నాయకులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ సదస్సుల పేరిట వ్యాపారులను వెళ్లగొట్టడం సరికాదన్నారు.


హక్కులను హరిస్తున్నారు..

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీధి వ్యాపారులకు స్థానిక సంస్థలు స్థలాలను చూపాలి. వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి. విశాఖలో దానికి విరుద్ధంగా వీధి వ్యాపారులు, తోపుడుబళ్ల కార్మికులను అధికారులు శత్రువుల్లా చూస్తున్నారు. వారి హక్కులను కాలరాస్తున్నారు. సదస్సు జరిగే రెండు రోజులు సహకరిస్తాం తప్ప, రెండు నెలలపాటు వ్యాపారాలు మానేయాలని కోరడం సరికాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు