logo

అడ్డుపడినా.. అప్పగించేశారు!

‘అక్కడ క్వారీకి అనుమతులు ఇవ్వొద్దు. చుట్టూ ఉన్న పంట భూములు పాడైపోతాయి. జీవనోపాధి దెబ్బతింటుంది. పైగా గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి అక్కడే భూములిచ్చారు.

Published : 29 Mar 2023 03:15 IST

ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకించినా క్వారీకి అనుమతులు
అధికారపార్టీ అండతో చకచకా కదిలిన దస్త్రాలు?
గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం భూముల సమీపాన తవ్వకాలకు సిద్ధం

ఆనందపురం మండలం జగన్నాథపురం వద్ద గ్రేహౌండ్స్‌కు కేటాయించిన ఈ స్థలానికి సమీపంలోనే క్వారీకి అనుమతులిచ్చారు...

ఈనాడు డిజిటల్‌ విశాఖపట్నం: ‘అక్కడ క్వారీకి అనుమతులు ఇవ్వొద్దు. చుట్టూ ఉన్న పంట భూములు పాడైపోతాయి. జీవనోపాధి దెబ్బతింటుంది. పైగా గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి అక్కడే భూములిచ్చారు. ఇప్పుడదేచోట గ్రావెల్‌ తవ్వేస్తాం..రాళ్లు పట్టుకుపోతామంటే కుదరదు’ అని ఈ ఏడాది జనవరి 10న ఆనందపురం మండలం జగన్నాథపురంలో జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే పెద్దలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందన్నట్లు ఈ క్వారీకి అనుమతులు మంజూరయ్యాయి.


అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో దరఖాస్తుదారునికి అనుకూలంగా సంబంధిత శాఖల నుంచి దస్త్రాలు చకా..చకా కదిలినట్లు తెలుస్తోంది.


18 ఏళ్ల పాటు గ్రావెల్‌, మెటల్‌ తవ్వుకోవడానికి గతనెల 27నే పర్యావరణ అనుమతులు ఇచ్చేశారు. పని మొదలుపెట్టడానికి అవసరమైన కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఈ) ఉత్తర్వులను కాలుష్యనియంత్రణ మండలి ఈ మధ్యనే జారీచేసింది. ఇక గనులశాఖకు డబ్బులు కట్టి పర్మిట్లు తీసుకుని తవ్వుకోవడమే మిగిలింది.


సమస్యలొస్తాయంటున్నా...

నందపురం మండలం జగన్నాథపురం సర్వే నెంబర్‌ 1లో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి నాలుగేళ్ల క్రితం 385 ఎకరాలు కేటాయించారు.రెండేళ్ల క్రితం ఆ భూముల్లో కొంతమేర సంబంధితశాఖ తరఫున భూ సేకరణ పూర్తిచేశారు. ఇప్పుడు అదే సర్వే నెంబర్‌లో 50 ఎకరాల్లో గ్రావెల్‌, మెటల్‌ క్వారీ తవ్వకాలు చేపట్టబోతున్నారు. రెండూ ఒకే సర్వే నెంబర్‌లో ఉన్నా గ్రేహౌండ్స్‌కు, క్వారీకి సంబంధం లేదని అధికారులు సమర్థించుకుంటున్నా పోలీసు బలగాల్లో కీలకమైన విభాగం శిక్షణ కేంద్రానికి సమీపంలో తవ్వకాలు చేపట్టడం వల్ల సమస్యలు వస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పైగా ప్రతిపాదిత క్వారీ స్థలానికి సమీపంలోనే ఇటీవల జగనన్న కాలనీలకు స్థలాలు కూడా ఇచ్చారు. మంత్రి ఒకరు సీఎంవో కార్యాలయం నుంచి ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా అనుమతులు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


వాయువేగంతో..

మ్మడి విశాఖ జిల్లాలో మెటల్‌, గ్రానైట్‌, గ్రావెల్‌ క్వారీలకు సంబంధించి ప్రజాభిప్రాయసేకరణలు పూర్తయి ఆరు నెలలు నుంచి ఏడాది గడిచినా పలు చోట్ల ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. జగన్నాథపురం క్వారీ విషయంలో మాత్రం అనుమతులన్నీ ఆగమేఘాలపై వచ్చేస్తున్నాయి. 2017లో ఇక్కడ క్వారీకి రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీ ఇచ్చారు. ఆ తర్వాత 2018లో గ్రేహౌండ్స్‌కు భూములు కేటాయించారు. అప్పుడిచ్చిన ఎన్‌వోసీ పట్టుకుని ఈ ఏడాది జనవరి 10న ప్రజాభిప్రాయసేకరణ జరిపారు. జనవరి 30న పర్యావరణ అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఫిబ్రవరి 2న స్టేట్‌ లెవల్‌ ఎక్స్‌పర్ట్‌ ఎప్రయిజల్‌ కమిటీ (ఎస్‌ఈఏసీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. 18 ఏళ్ల పాటు ఏడాదికి 1.45 లక్షల క్యూబిక్‌ మీటర్ల రఫ్‌ మెటల్‌,   3.40 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ తవ్వుకోవడానికి  ఫిబ్రవరి 27న పర్యావరణ అనుమతులు ఇచ్చేశారు. ప్రజాభిప్రాయసేకరణ తర్వాత అధికారులు ఇలాంటిదేదో చేస్తారని ఊహించే స్థానికులు కొందరు కోర్టులో రిట్‌ పిటీషన్‌ వేశారు. ఆ తరువాత ఆగమేఘాలపై మిగతా అనుమతులన్నీ వచ్చేశాయి. ఈ విషయమై గనులశాఖ, కాలుష్యనియంత్రణ మండలి అధికారులు నోరువిప్పడం లేదు. ఆనందపురం తహసీల్దారు రామారావు వద్ద ప్రస్తావించగా ఎన్వోసీ గురించి తనకు తెలియదని రైతులు కొందరు కోర్టులో పిటీషన్‌ వేస్తే ప్రజాభిప్రాయసేకరణ సమయంలో స్థానికులంతా ఈ క్వారీకి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని కౌంటర్‌ రూపంలో కోర్టు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు తమకు రాలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు