logo

YSRCP: డాక్టరమ్మకు వైకాపా షాక్‌!

అనకాపల్లి ఎంపీ డాక్టరు భీశెట్టి వెంకటసత్యవతికి వైకాపా షాక్‌ ఇచ్చింది. రెండోసారి ఎంపీ బరిలో పోటీచేయాలన్న సత్యవతి ఆశలపై అధికార పార్టీ నీళ్లు చల్లేసింది.

Updated : 27 Mar 2024 10:09 IST

ఎంపీ బరిలోకి మంత్రి ముత్యాలనాయుడు
మాడుగుల అసెంబ్లీ టికెట్‌ కుమార్తె అనురాధకు..

ముత్యాల నాయుడు, అనురాధ

ఈనాడు అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి: అనకాపల్లి ఎంపీ డాక్టరు భీశెట్టి వెంకటసత్యవతికి వైకాపా షాక్‌ ఇచ్చింది. రెండోసారి ఎంపీ బరిలో పోటీచేయాలన్న సత్యవతి ఆశలపై అధికార పార్టీ నీళ్లు చల్లేసింది. ఆమె స్థానంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడ్ని బరిలోకి దించుతున్నారు. ఇదివరకు మాడుగుల నుంచి మంత్రి మూడోసారి పోటీచేస్తారని ప్రకటించింది. అయితే సామాజిక సమీకరణాలతో అనకాపల్లి ఎంపీ స్థానానికి బదిలీ చేసింది. మాడుగులలో బూడి కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధకు వైకాపా అవకాశం ఇచ్చింది.

గత ఎన్నికల ముందు వరకు డాక్టరు భీశెట్టి వెంకటసత్యవతి తెదేపాలో ఉన్నారు. అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆమెకు ఆఖరి నిమిషంలో వైకాపా ఎంపీ టికెట్‌ ప్రకటించింది. 2019లో పార్లమెంటు పరిధిలోని అన్ని సెగ్మెంటెలలోను ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఈమె సులభంగానే గెలుపొందారు. అనకాపల్లి నుంచి తొలి మహిళా ఎంపీగా రికార్డులకు ఎక్కారు. గడిచిన అయిదేళ్లలో ఆమె పార్టీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిచారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో, ప్రజాప్రతినిధిగా మెరుగైన పనితీరు కనబరిచారు. ఈ ఎన్నికల్లో ఆఖరి నిమిషం వరకు సీటు కొనసాగింపు విషయమై ఊరించి పక్కన పెట్టేసింది. సీటు విషయంలో పార్టీ మొండిచేయి చూపించడాన్ని ఆమె వర్గీయులు తప్పుబడుతున్నారు.

సత్యవతి

గవర సామాజిక వర్గానికి మొండిచేయి: అనకాపల్లి జిల్లాలో కాపుల తర్వాత బలమైన సామాజిక వర్గం గవర్లు. జిల్లాలోని ఏ ఒక్క అసెంబ్లీ టిక్కెట్‌ను వైకాపా గవర్లకు కేటాయించలేదు. అనకాపల్లిలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణను బరిలో దించారు. వైకాపా తరఫున కాపు సామాజిక వర్గం నుంచి మలసాల భరత్‌ పోటీలో ఉన్నారు. వైకాపా నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన సత్యవతికి ఎంపీ టికెట్‌ మరోమారు ఇస్తారని ఆమె వర్గీయులు భావించారు. తెదేపా కూటమి అభ్యర్థిగా వెలమదొర సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్‌ను రంగంలోకి దించారు. దీంతో వైకాపా కూడా వెలమ సామాజిక వర్గం నేత బూడి ముత్యాలనాయుడ్ని పోటీలో దింపడం గమనార్హం. అయితే జిల్లాలో అదే సామాజికవర్గానికి రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించి, అధికంగా ఉన్న గవర సామాజిక వర్గానికి ఒక సీటు కూడా కేటాయించలేదు. దీంతో ఆ సామాజిక వర్గంలో నేతలు గుర్రుగా ఉన్నారు. టికెట్ల విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని