logo

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు చురుకుగా పని చేయాలి

సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్‌ ఎ.రవిశంకర్‌ ఆర్వోలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు

Published : 29 Mar 2024 04:04 IST

మాట్లాడుతున్న సీపీ రవిశంకర్‌, చిత్రంలో కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, జేసీ మయూర్‌ అశోక్‌ తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా నియమించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్‌ ఎ.రవిశంకర్‌ ఆర్వోలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. సీజర్స్‌లో(సీజ్‌ చేయడం) రాష్ట్ర స్థాయిలో మన జిల్లా ముందువరుసలో ఉండాలన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం ఎలక్షన్‌ సీజర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఈఎస్‌ఎంఎస్‌) పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఎస్‌ఎంఎస్‌ ద్వారా కేసుల నమోదు చేయడంలో మరింత పురోగతి కనిపించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.53.49 లక్షలు మాత్రమే నగదును పట్టుకున్నారని, కొన్ని శాఖల నుంచి ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ, పోర్టు ట్రస్ట్‌, ఆదాయ పన్ను, కస్టమ్స్‌, రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌, జీఎస్‌టీ అధికారులు నిఘాను మరింతగా పెంచాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు ముందుగానే పరిశీలించుకోవాలన్నారు. నామపత్రాల దాఖలు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మరింత క్రియాశీలం కావాలన్నారు. రాజకీయ పక్షాల సమావేశాలు, ర్యాలీల అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్న 48 గంటల్లో అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ 24 గంటల్లో ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ప్రతీశాఖలో ఒక నోడల్‌ అధికారిని నియమిస్తామన్నారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, జేసీ కె.మయూర్‌ అశోక్‌, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని