logo

ప్రలోభాల ‘పోస్టల్‌ బ్యాలట్‌’...!

పోస్టల్‌ బ్యాలట్‌లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలో ఆదివారం ఉదయం పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ ప్రారంభమైంది.

Published : 06 May 2024 03:34 IST

ఉద్యోగులతో జోరుగా బేరసారాలు
ఏయూ వద్ద మోహరించిన వైకాపా నాయకులు
తొలిరోజు 23 శాతం వినియోగం

మండుటెండను లెక్క చేయకుండా వస్తున్న ఉద్యోగినులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలో ఆదివారం ఉదయం పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉద్యోగులు ఓపిగ్గా నిరీక్షించి ఓటు వేశారు. వారిని ప్రలోభాలకు గురిచేసేందుకు కొందరు వైకాపా నాయకులు ఏయూ అవుట్‌గేట్‌ ఎదురుగా మోహరించి బేరసారాలు సాగించారు. ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులపై దృష్టి పెట్టారు. ఓటు వేస్తే రూ.2వేలు ఇస్తామని చెప్పారు. ముందుకొచ్చిన వారి పేర్లు, ఫోను నెంబర్లు సేకరించారు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు సైతం అక్కడికి చేరుకుని ఉద్యోగులతో సంప్రదింపులు జరిపారు. ప్రలోభాలకు గురికాకుండా ఓటేయాలని కోరారు. కొందరు నేరుగా పోలింగ్‌  కేంద్రం వద్దకు చేరుకుని ఓటు వేయడం కనిపించింది.

  • ఓటు లేదని కొంత మంది ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సోమవారం రావాలని చెప్పగా వచ్చామని, ఇప్పుడు ఓటు లేదని చెబుతున్నారంటూ కలెక్టర్‌ మల్లికార్జునను కలిసి ఫిర్యాదు చేశారు. ఈనెల 8 వరకు గడువు ఉందని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.
  • ఆర్టీసీ ఉద్యోగులు గాజువాక, కూర్మన్నపాలెం, మద్దిలపాలెం తదితర డిపోలకు చెందిన బస్సుల్లో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో తొలిరోజు దాదాపు 23 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.కలెక్టర్‌  ఎ.మల్లికార్జున, పోస్టల్‌ బ్యాలట్‌ నోడల్‌ అధికారి, జీవీఎంసీ ఏడీసీ కేఎస్‌ విశ్వనాథన్‌, జేసీ కె.మయూర్‌ అశోక్‌, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని