logo

సాఫ్ట్‌‘వేరుకు వైకాపా వైరస్‌’

విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఎంతో నైపుణ్యమున్న యువత బయటకు వస్తున్నారు.

Updated : 06 May 2024 05:16 IST

విశాఖలో ‘ఐటీ’ వెలుగులు ఆర్పేసిన జగన్‌
యువతను చీకట్లోకి నెట్టిన సీఎం
ఐదేళ్లలో నగరాన్ని వదిలి వెళ్లిన ప్రముఖ కంపెనీలు
ఉపాధికి ఇతర రాష్ట్రాలకు వలసవెళుతున్న యువత


విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఎంతో నైపుణ్యమున్న యువత బయటకు వస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎందరో విశాఖలో ఐటీ రంగంపై ఆశలు పెట్టుకున్నారు.

చంద్రబాబు హయాంలో వెలుగులీనిన ఐటీ రంగం వల్ల.. తమ పిల్లలు... ముఖ్యంగా యువతులకు స్థానికంగానే చక్కటి ఉద్యోగాలు దక్కుతాయని నమ్మకం పెట్టుకున్నారు.
జగన్‌ ప్రభుత్వంలో ఆ ఆశలన్నీ అడియాశలే అయ్యాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో తమ బిడ్డలను ఇతర ప్రాంతాలకు పంపించాల్సి వస్తోంది. కొందరైతే ఆ ఇబ్బందులు ఎందుకని... విశాఖలోనే చిన్నచిన్న ఉద్యోగాల్లోకి పంపిస్తున్నారు. జగన్‌ పాలనపై మండిపడుతున్నారు.

ఈనాడు-విశాఖపట్నం


1

జగన్‌ అధికారంలోకి రాగానే ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ విశాఖను వదిలి వెళ్లింది. 3,500 మందికి స్థానికంగా ఉద్యోగాలిచ్చిన కాల్‌ సెంటర్‌ హెచ్‌ఎస్‌బీసీ అదేబాట పట్టింది. ఐటీ హిల్‌-3లో ఎస్‌ఈజడ్‌(సెజ్‌) కింద ఉన్న భూముల్లో 25 ఎకరాలు కనెక్సా అనే కంపెనీకి గతంలో కేటాయించారు. ఆ తర్వాత అదే భూమి ఐబీఎం కంపెనీకి  బదలాయించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ విలువైన స్థలం కోసం ఒత్తిళ్లు పెట్టడంతో ఐబీఎం విశాఖను వదిలి వెళ్లిపోయింది. ఈ కంపెనీలో 382 మంది ఉద్యోగులు పనిచేసేవారు.


2

హెచ్‌ఎస్‌బీసీ వెళ్లినా డబ్ల్యూఎన్‌ఎస్‌ తెచ్చామంటూ జగన్‌ సర్కార్‌ చెప్పుకొస్తోంది. వాస్తవానికి డబ్ల్యూఎన్‌ఎస్‌ ముందునుంచే    ప్రైవేటు భవనాల్లో ఉంది. హెచ్‌ఎస్‌బీసీ వెళ్లిపోవడంతో ఆ ఖాళీ అయిన భవనంలోకి డబ్ల్యూఎన్‌ఎస్‌ లీజుకు మారిందంతే.


3

హిల్‌-3లో స్టార్టప్‌ విలేజ్‌ భవనంలో వంద స్టార్టప్స్‌ పని చేసేవి. ఒక్కోదానిలో ముగ్గురు, నలుగురు యువత ఉపాధి పొందారు. అలాంటివి వంద స్టార్టప్‌లు జగన్‌ అధికారంలోకి వచ్చాక మూతపడ్డాయి. దీంతో స్థానికంగా యువత నష్టపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన యువత చాలా మంది భువనేశ్వర్‌, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు ఉద్యోగాలకు వలస వెళ్లారు. కాల్‌ సెంటర్లు,     స్టార్టప్స్‌లో పని కోల్పోయిన చాలా మంది క్యాబ్‌ డ్రైవర్లుగా, పిజ్జా, స్విగ్గీ డెలివరీ బాయ్స్‌గా మారారు. తాజాగా నేషనల్‌ రీసెర్చ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఆర్‌డీసీ) రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేక భువనేశ్వర్‌కు పయనమైంది.


4

కొవిడ్‌ తర్వాత వర్క్‌ ఫ్రంహోం చేస్తున్న ఉద్యోగులను  కార్యాలయాలకు తీసుకొచ్చే క్రమంలో టైర్‌-2 నగరాల్లో ఇన్ఫోసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే విశాఖలో ఒక ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని కేంద్రం పెట్టుకుంటే అదేదో జగన్‌ తెచ్చినట్లు హడావుడి చేసి యువత కళ్లకు గంతలు కట్టే ప్రయత్నాలు తప్ప మరేం చేయలేదు. విశాఖకు ఎలాంటి కంపెనీలు తేలేదు.


5

చంద్రబాబు హయాంలో డీటీపీ (డిజిగ్నెటేడ్‌ టెక్నాలజీ పార్కు) పాలసీ ఉండేది. ఈ పార్కులో ఏ కంపెనీ దరఖాస్తు చేసుకున్నా, సగం అద్దెకే ఇవ్వడంతోపాటు, ఇంటర్నెట్‌, నిరంతర విద్యుత్‌ సౌకర్యం కల్పించేవారు. వైకాపా అధికారంలోకి రాగానే ఈ పాలసీ ఎత్తేశారు. దీంతో సుమారు 60 వరకు చిన్న, మధ్యతరహా కంపెనీలు మూతపడ్డాయి. గత నాలుగేళ్లుగా ఐటీ ప్రోత్సాహకాలు, రాయితీలు రూ.100కోట్ల మేర నిలిచిపోయాయి.


6

ఐటీ కంపెనీలకు తొలి విడతగా ఇస్తామన్న రాయితీలు రూ.22కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో కంపెనీలకు విద్యుత్‌ ఎండీ ఛార్జీ(హెచ్‌పీకి రూ.450), ప్రాపర్టీ ఛార్జీలు రద్దు చేస్తామని స్వయానా జగన్‌ ప్రకటించిన హామీ ఇంత వరకు అమలు కాలేదు. చంద్రబాబు హయాంలోనే అదానీ డేటా సెంటర్‌కు శంకు స్థానపన జరిగింది. జగన్‌ మళ్లీ ఇదే డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ ఒక ఇటుక పేర్చలేదు.


‘ఐటీకి సాగరతీరం అనుకూలం. కంపెనీల స్థాపనకు కావాల్సినంత ఖాళీ స్థలాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం’

ఇవీ.. విశాఖలో గతేడాది పెట్టుబడిదారుల సదస్సుకు ముందు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు బెంగళూరు వంటి నగరాల్లో  రోడ్‌షోల సందర్భంగా పలికిన ప్రగల్భాలు.

సీఎం జగన్‌ అయితే... ఏకంగా విశాఖలో ఐటీ వెలుగులు నింపుతామంటూ పాదయాత్రలో ఊదరగొట్టారు. ఆయన అధికారంలోకి రాగానే  ప్రముఖ కంపెనీలు విశాఖ వదిలి వెళ్లేలా చేశారు. అప్పటి వరకు ఐటీ రంగంలో ఉన్న వెలుగులు ఆర్పేశారు. యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టేశారు.


ఖాళీగానే...: హిల్‌-3లో మిలీనియం టవర్‌-1ను తెదేపా హయాంలో ప్రారంభించారు. ఇందులో కాండ్యుయెంట్‌ అనే అంతర్జాతీయ కంపెనీ ఉంది. ఆ టవర్‌లో ఖాళీగా ఉన్న మిగిలిన అంతస్తులు ఇస్తే విస్తరిస్తామని కాండ్యుయెంట్‌ కొన్నేళ్ల క్రితం కోరినా వైకాపా ప్రభుత్వం కేటాయించలేదు.  వైకాపా హయాంలో మిలీనియం టవర్‌ ఫేజ్‌-2 కింద 1.50లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇలా ప్రభుత్వం వద్ద  3లక్షల చదరపు అడుగులు ఉన్నా.. కంపెనీలు ముందుకొచ్చి కోరినా కేటాయించలేదు. ఇక్కడ చదరపు అడుగుకు ఎంత లేదన్నా రూ.70 అద్దె వస్తుంది. కొన్నేళ్లుగా ఖాళీగా ఉంచి..ఆఖరిలో పరిపాలన రాజధానికి కార్యాలయాలంటూ హడావుడి చేశారు. కనీసం ఖాళీగా ఉన్న భవనాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడేవి, ఆ మాత్రం తెలియదా అని నగర వాసులు మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని