logo

ఓ పాలకా.. హామీలు కొట్టుకుపోయినట్లేనా!

జిల్లాకు మణిహారంగా సాగరతీరం నిలుస్తోంది.. ఇక్కడ ఇసుక తిన్నెలతో ఆకర్షించే బీచ్‌ల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులకు నిరాశే మిగులుతోంది.

Published : 28 Mar 2024 04:50 IST

అభివృద్ధికి నోచుకోని తీర గ్రామాలు
న్యూస్‌టుడే, భోగాపురం/పూసపాటిరేగ

చింతపల్లి తీరంలో పర్యాటక కేంద్రం దుస్థితి

జిల్లాకు మణిహారంగా సాగరతీరం నిలుస్తోంది.. ఇక్కడ ఇసుక తిన్నెలతో ఆకర్షించే బీచ్‌ల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులకు నిరాశే మిగులుతోంది.

భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో 29 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. పాలకులు మారుతున్నా... పర్యాటకావృద్ధికి నోచుకోవడం లేదు. వైకాపా హయాంలోనూ ప్రజాప్రతినిధులు హామీలు గుప్పించినా.. నెరవేర్చే దిశగా చొరవ కరవైంది. జీవనోపాధి మెరుగుకు ఆస్కారం లేకుండా పోయిందని మత్స్యకారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

చింతపల్లి తీరం సందర్శకులను ఆకర్షిస్తోంది. తెదేపా హయాంలో పూసపాటిరేగ మండలంలోని ఈ బీచ్‌లో రూ.కోటి వెచ్చించి పర్యాటక కేంద్రం భవనాలను నిర్మించారు. రెండు, మూడేళ్లు వీటి నిర్వహణ బాగానే ఉన్నా.. వైకాపా అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు. నిరుపయోగంగా ఉన్న భవన సముదాయం దెబ్బతింటున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఇక్కడ వసతి సదుపాయం ఉన్నా నిర్వహణ లేక అధ్వానంగా మారడంతో పర్యాటకులకు ఉపయోగ పడకుండా పోతోంది.

జెట్టీ హామీ గల్లంతు

గత ఏడాది మే 3న చింతపల్లి తీరానికి ఆనుకుని ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రూ.27 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. తీరంలో పడవలు దెబ్బతినకుండా నిలిపేందుకు జెట్టీ ఉపయోగపడుతుందని, వలస పోకుండా స్థానికంగా చేపల వేట సాగించొచ్చని మత్స్యకారులు భావించారు. ఇంత వరకు అంగుళం కూడా పని జరగకపోవడంపై వారి ఆశలు అడియాసలయ్యాయి. జెట్టీ హామీ అలల్లో కొట్టుకుపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇది అందుబాటులోకి వస్తే 16 తీర గ్రామాలకు చెందిన నాలుగు వేల మత్స్యకార కుటుంబాల్లో కనీసం 20 వేల మందికి ప్రయోజనం చేకూరేది.

ముక్కాంలో రక్షణగోడ లేక అలల ధాటికి దెబ్బతిన్న రోడ్డు, ఇళ్లు

ఏదీ రక్షణ?

భోగాపురం మండలంలో ముక్కాం తీరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. జాతీయ రహదారికి దగ్గరగా, అనుసంధానంగా ఉన్న ప్రాంతమిది. ఉన్నతాధికారులు, నాయకులు సందర్శనీయ ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేసినా కార్యరూపం దాల్చలేదు. ఇందుకు పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నా.. అడుగులు ముందుకు పడలేదు.  ఈ ప్రతిపాదనలను పాలకులు గాలికొదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అలల తాకిడితో తీరం ఛిద్రమైంది. తుపాను సమయంలో సముద్రం ముందుకు రావడంతో ఒడ్డు కోతకు గురవుతోంది. తీరంలో ఉన్న రహదారి దెబ్బతినడమే కాకుండా చేపలు ఆరబోసే ప్లాట్‌ఫాం కూడా ధ్వంసమైంది. ఇక పడవలతో పాటు నివాసాలు కొట్టుకుపోతున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి కొంత మొత్తం కేటాయించినా పనుల ఊసే లేదు. ఇదే మండలంలో చేపలకంచేరు, తిప్పలవలస, బర్రిపేట తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని