logo

మహబూబాబాద్‌కు పూర్తిస్థాయి జిల్లా కోర్టు

రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను జ్యుడిషియల్‌ జిల్లాలుగా విభజన ప్రక్రియ చేపట్టింది. ఈమేరకు మహబూబాబాద్‌కు పూర్తి స్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరైంది.

Published : 22 May 2022 03:10 IST

మహబూబాబాద్, నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను జ్యుడిషియల్‌ జిల్లాలుగా విభజన ప్రక్రియ చేపట్టింది. ఈమేరకు మహబూబాబాద్‌కు పూర్తి స్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2వ తేదీన జిల్లా న్యాయస్థానాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సూచనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అనుమతితో నూతన జిల్లాలో జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలతో 2016లో మహబూబాబాద్‌ నూతన జిల్లాగా ఏర్పడింది. జిల్లా ఏర్పాటుకు పూర్వం మహబూబాబాద్‌ కోర్టులో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జ్జి కోర్టు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, ఆరో అదనపు జిల్లా కోర్టులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మహబూబాబాద్‌ కోర్టు ప్రాంగణంలో ఫాస్ట్‌ ట్రాక్‌ (ప్రత్యేక పోక్సో కోర్టు) ప్రారంభించారు. కాగా, తాజా ప్రకటనతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోర్టులో ఉన్న జ్యుడిషియల్‌ కేసులను ఈ నెల చివరినాటికి మహబూబాబాద్‌కు బదిలీ చేయనున్నారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి పూర్తిస్థాయి జిల్లా కోర్టు తన కార్యకలాపాలు కొనసాగించనుందని ప్రభుత్వం పేర్కొంది. 

కక్షిదారులకు ఊరట..

ఉమ్మడి జిల్లా వరంగల్‌లో జిల్లా కోర్టు ఉండటం వల్ల కేసుల విచారణ కోసం అక్కడికి వెళ్లేందుకు జిల్లా కోర్టు దూరంగా ఉండటంతో ఈ ప్రాంతానికి చెందిన కక్షిదారులు ఇబ్బందులకు గురయ్యేవారు. అధిక వ్యయ, ప్రయాసలు ఎదుర్కొంటూ పలు కేసుల విచారణకు అక్కడికి వెళ్లే కక్షిదారులకు ఇకపై ఊరట లభించనుంది. మహబూబాబాద్‌లో  ప్రస్తుతం కోర్టు సముదాయంలో ఉన్న భవనంలోనే పూర్తిస్థాయి జిల్లా కోర్టుకు ఓ భవనాన్ని కేటాయిస్తారు. కాగా, మహబూబాబాద్‌లో నూతన శాశ్వత కోర్టు భవనం నిర్మించేందుకు నూతన కలెక్టర్‌ భవన సముదాయం సమీపంలో స్థలం కేటాయించినట్లు తెలుస్తుంది. 

 ఆ మండలాలు కూడా.. దీని పరిధిలోకే..

ప్రస్తుతం వరంగల్‌ జిల్లా నర్సంపేట కోర్టు పరిధిలో ఉన్న గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలను మహబూబాబాద్‌ జిల్లా కోర్టు పరిధిలోకి చేర్చారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు కోర్టు పరిధిలో ఉన్న బయ్యారం, గార్ల మండలాలను కూడా ఈ జిల్లా పరిధిలోకి బదిలీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని సివిల్, క్రిమినల్‌ వ్యాజ్యాలు నూతనంగా ఏర్పడనున్న జిల్లా కోర్టు పరిధిలోకి వస్తాయి.

 హర్షణీయం: తుంపిళ్ల శ్రీనివాస్‌, లీగల్‌ ఏయిడ్‌ కౌన్సిల్‌ 

మహబూబాబాద్‌కు పూర్తి స్థాయి జిల్లా కోర్టు మంజూరుకావడం హర్షణీయం. ఇక నుంచి కక్షిదారులు వరంగల్‌ ఉమ్మడి జిల్లా కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండదు, దీంతో పాటు వ్యయ ప్రయాసలు తప్పనున్నాయి. పూర్తిస్థాయి జిల్లా కోర్టు ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ, కుటుంబ తగాదాలతో పాటు ఇతర క్రిమినల్‌ కేసులు ఇక్కడే విచారించనున్నారు. మహబూబాబాద్‌లో జిల్లా కోర్టు ఏర్పడటం న్యాయసేవలో పురోగతిగానే చెప్పవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని