logo

‘జాగ’మే మాయ!

‘వరంగల్‌ నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. డివిజన్‌కో పట్టణ ప్రకృతి వనం, నర్సరీ, ఆట స్థలం ఏర్పాటుకు స్థానికంగా స్థలాలు గుర్తించాలని వరంగల్‌, హనుకొండ జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు.

Updated : 23 May 2022 06:40 IST

పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీ, ఆట స్థలాల ఏర్పాటుకు అన్వేషణ

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌


వరంగల్‌ క్రిస్టియన్‌ కాలనీలో పట్టణ ప్రకృతి వనం కోసం గుర్తించిన స్థలం

‘వరంగల్‌ నగరంలో 66 డివిజన్లు ఉన్నాయి. డివిజన్‌కో పట్టణ ప్రకృతి వనం, నర్సరీ, ఆట స్థలం ఏర్పాటుకు స్థానికంగా స్థలాలు గుర్తించాలని వరంగల్‌, హనుకొండ జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. జూన్‌ 3- 15 తేదీల్లో నిర్వహించనున్న నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమానికి డివిజన్ల వారీగా స్థలాలు ఖరారు చేయాలన్నారు. కలెక్టర్ల ఆదేశాలతో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం లేఅవుటు ఖాళీ స్థలాల కోసం అన్వేషిస్తున్నారు. ఏ స్థలం చూసినా స్థానికంగా వివాదంగా ఉంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్‌ ఓపెన్‌ స్పేస్‌లు, పార్కు స్థలాన్ని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఎక్కడికెళ్లినా ఏదో ఒక సాకు చెబుతున్నారు. డివిజన్లలో ఖాళీ స్థలాలు ఎలా? అని అధికారులు పరేషానవుతున్నారు.’

245 స్థలాలు: * నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం రికార్డుల ప్రకారం చూస్తే ఇటీవలి దస్త్రాల ప్రకారం 245 లేఅవుట్‌ ఖాళీ స్థలాలు, పార్కులు ఉన్నాయి. పూర్వపు రికార్డుల ప్రకారం మరో 100-120 కనిపించాలి. ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయనిపిస్తోంది. రికార్డుల ప్రకారం డివిజన్లలో పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు.

* కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ త్రినగరాల్లో 40- 50 ఖాళీ స్థలాలపై ప్రైవేటు వ్యక్తులు కన్నేశారని తెలిసింది. రికార్డుల్లో ఓపెన్‌ స్పేస్‌(ఖాళీ స్థలం) ఉండగా, కాలనీల్లో పరిశీలిస్తే స్థలం వివాదమంటున్నారు. ఆక్రమణదారులకు ప్రజాప్రతినిధులు, కొందరు కార్పొరేటర్లు వత్తాసు పలుకుతుండటంతో అధికారులు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.’

* 66 డివిజన్లలో అత్యవసరంగా 188 ఖాళీ స్థలాలు కావాలి. 66 ఆట స్థలాలు, 66 పట్టణ ప్రకృతి వనాలు, 66 నర్సరీలు ఏర్పాటు చేయాలి. దాదాపు 345 ఉన్నా.. ప్రతి చోటా వివాదాస్పదంగా ఉండటంతో వీటిని ఎలా స్వాధీనం చేసుకొని నిర్మిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

స్వాధీనం చేసుకుంటాం: గుండు సుధారాణి, మేయర్‌, గ్రేటర్‌ వరంగల్‌

66 డివిజన్లలో ఆట స్థలాలు, పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు ఏర్పాటు చేయాల్సిందే. 188 స్థలాలు అవసరం ఉంటాయి. టౌన్‌ప్లానింగ్‌ లెక్కల ప్రకారం చూస్తే స్థలాల కొరత లేదు. కాకపోతే కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయి. లేఅవుట్‌ ఖాళీ స్థలాలన్నీ స్వాధీనం చేసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని