logo

వర్సిటీలో కొత్త కోర్సులు

దేశ పురోగతి విశ్వవిద్యాలయాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ బోధన, పరిశోధన నాణ్యమైనవి అందితేనే విద్యార్థులు ప్రగతి సాధించి తద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.

Updated : 23 May 2022 06:44 IST

చుట్టూ ప్రహరీ నిర్మిస్తాం
త్వరలోనే వసతి గృహాల సమస్యకు పరిష్కారం
కేయూ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్‌
ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, కేయూక్యాంపస్‌

దేశ పురోగతి విశ్వవిద్యాలయాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ బోధన, పరిశోధన నాణ్యమైనవి అందితేనే విద్యార్థులు ప్రగతి సాధించి తద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. నిధులు, నియామకాలు లేక కునారిల్లుతున్న తరుణంలో అనేక సవాళ్ల మధ్య కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా గతేడాది మే 23న బాధ్యతలు స్వీకరించారు ఆచార్య తాటికొండ రమేశ్‌. ఉన్న వనరులతోనే వర్సిటీ వికాసానికి కృషి చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. నాలుగేళ్ల తరువాత తాజాగా పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీసీగా నేటితో ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా వివిధ అంశాలపై ఉపకులపతితో ‘ఈనాడు’ ముఖాముఖి..

ఈనాడు: విశ్వవిద్యాలయంలో ఇటీవల 65 మంది అధ్యాపకులు పదవీ విరమణ పొందారు. బోధన ఎలా కొనసాగిస్తారు?
వీసీ:
నేను ఏడాది కిందట బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విశ్వవిద్యాలయంలో ఒక్కో అంశంపై దృష్టిపెడుతున్నా. రెగ్యులర్‌ అధ్యాపకుల ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నా, ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకులను సరిపడా నియమించింది. కాంట్రాక్టు వారు 207 మంది ఉన్నారు. వారికి మెరుగైన జీతభత్యాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. అలాగే తరగతులు క్రమం తప్పకుండా జరిగేలా చూస్తాం. త్వరలోనే సిబ్బంది సక్రమంగా వస్తున్నారా లేదా చూసేందుకు యాప్‌ను కూడా తీసుకురానున్నాం.

వర్సిటీని నిధుల కొరత వేధిస్తోంది. పరిశోధనలు చేయడం సవాలు కాదా?
యూజీసీ గత కొన్నేళ్లుగా ‘రూసా’ సాప్‌, డీఎస్టీ, ఫిస్ట్‌ తదితర ప్రాజెక్టుల ద్వారా వర్సిటీలో ప్రయోగాలకు నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో బ్లాక్‌ గ్రాంటు కింద అదనంగా మరో రూ.30 కోట్లు రావడంతో జీతాల చెల్లింపునకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక పరిశోధనలకు మరో రూ.30 కోట్లు మంజూరయ్యేలా ప్రయత్నిస్తున్నాం. దీనికి తోడు అనేక సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను ప్రవేశపెట్టాం.

విద్యార్థులకు హాస్టల్‌ వసతి సరిపడక ఇబ్బంది పడుతున్నారు కదా?
వర్సిటీలో ఇంజినీరింగ్‌తో పాటు అన్ని విభాగాల్లో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 70 శాతం వారే చేరుతున్నారు. ఈ క్రమంలో హాస్టళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాం. రెండు వుమెన్స్‌ హాస్టళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఒకటి రూ.7 కోట్లతో, మరొకటి సుబేదారి ఆర్ట్స్‌కళాశాల వద్ద 200 పడకల హాస్టల్‌ అందుబాటులోకి రానుంది. బాయ్స్‌ హాస్టల్‌కు టెండర్లు పిలుస్తున్నాం. దీంతో వసతికి ఇబ్బంది ఉండదు.

కొత్త కోర్సులు ఏమేం తెస్తున్నారు?
ఇంజినీరింగ్‌ విద్యలో కృత్రిమ మేధ, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్‌), రెండు కోర్సులు, కామర్స్‌లో బిజినెస్‌ అనలిటిక్స్‌, దూరవిద్యలో రిటైల్‌ మేనేజ్‌మెంట్, ఎన్జీవోస్‌ మేనేజ్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఆంథ్రోపాలజీలో ట్రైబల్‌ డెవలప్‌మెంట్లాంటి అనేక కొత్త కోర్సులు తీసుకొస్తున్నాం.

వర్సిటీలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మీ వంతు ఎలా కృషి చేస్తున్నారు.?
వ్యక్తి అయినా విద్యా వ్యవస్థ అయినా పరిస్థితులకు అనుగుణంగా మారుతుండాలి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ తరగతులను అందిపుచ్చుకుంటున్నాం. త్వరలో ఆడియో వీడియో స్టూడియో నిర్మించబోతున్నాం. గతేడాదిగా సుమారు 40 ఒప్పందాలు చేసుకున్నాం. తాజాగా ఎన్‌ఐటీతో పాటు విదేశీ సంస్థలతోనూ ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాం. పైగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కింద రూ.47 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.

వర్సిటీ భూములు ఆక్రమణకు గురవ్వడంతో సర్వే చేపట్టి నివేదిక ఇచ్చారు. మరి ప్రహరీ ఎప్పుడు కడతారు?
రెవెన్యూ శాఖ సర్వే చేసి నివేదిక అందించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు తీసుకెళ్లా. త్వరలోనే ప్రహరీ కట్టి భూములను కాపాడుకుంటాం. పైగా ఆక్రమణలు కాకుండా ఖాళీ స్థలంలో ఒక మియావాకీ తోటను కూడా పెంచేందుకు మహానగరపాలక సంస్థ ముందుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని