logo

ఆందోళన వద్దు.. సౌకర్యాలు కల్పించాం..

కరోనాతో రెండేళ్లుగా విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేవు. వారు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. అన్ని సౌకర్యాలు కల్పించాం.

Updated : 23 May 2022 06:42 IST

ఇబ్బందులుంటే 98854 62305 నంబర్‌ను సంప్రదించండి

‘న్యూస్‌టుడే’తో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి

భూపాలపల్లి, న్యూస్‌టుడే

 

కరోనాతో రెండేళ్లుగా విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేవు. వారు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. అన్ని సౌకర్యాలు కల్పించాం. హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఫీజుల కోసం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తే అలాంటి విద్యార్థులు అంతర్జాలం నుంచి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్ఛు ఏమైనా ఇబ్బందులుంటే కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేయవచ్చు అని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డీఈవోతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది.

న్యూస్‌టుడే: పరీక్షల ఏర్పాట్లు ఎంత మేరకు వచ్చాయి ? ఎంత మంది పరీక్షలు రాస్తున్నారు?

డీఈవో: జిల్లాలో ఈసారి 3,772 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, ఇద్దరు ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు సమాయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడపాలని కూడా ఆర్టీసీ అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాల మాటేంటి ?

ప్రతి పరీక్ష కేంద్రంలో చల్లటినీరు, ప్యాన్లు, ఫర్నిచర్‌తో పాటు అనుకోని ఇబ్బందులు ఎదురైతే ప్రాథమిక చికిత్స చేసేలా ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉండే విధంగా కార్యచరణ రూపొందించాం. పరీక్ష కేంద్రాల ప్రాంతంలో పరీక్ష పూర్తి అయ్యే వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లు బంద్‌ చేసుకోవాలి.

పరీక్షల నిర్వహణకు ఎంతమందిని ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాలు ఎన్ని ?

జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, మరో డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌ను నియమించాం. మొత్తం 215 ఇన్విజిలేటర్లకు బాధ్యతలు అప్పగించాం. జిల్లా వ్యాప్తంగా చీఫ్‌ సూపరింటెండెంట్లు 20 మంది, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు 20 మందిని నియమించాం. అందరికీ ఉత్తర్వులు జారీచేసి, తగు చర్యలు తీసుకుంటాం.

విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటీ ?

పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు 45 నిముషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.ఎలాంటి ఆందోళన వద్ధు సిలబస్‌ కుదించి ఐచ్ఛికాలు పెంచారు. నిశ్చితంగా ప్రశాంతంగా పరీక్షలు రాయండి. మా తరపున అసౌకర్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రానికి వచ్చాక విద్యార్థులు ఏం చేయాలో ఇన్విజిలేటర్లు సూచనలిస్తారు. తొందరపడి ఎలాంటి తప్పులు చేయొద్ధు

ఫీజు చెల్లించకుంటే కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వటం లేదని కొందరు విద్యార్థుల తల్లితండ్రులు చెబుతున్నారు. వారి పరిస్థితి ఏంటీ ?

ఇప్పటి వరకు మాకూ అలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎవరైనా ఇబ్బందులు పెడితే యాజమాన్యాలతో మాట్లాడి హాల్‌టికెట్లు ఇప్పిస్తాం. లేదంటే విద్యార్థులు నేరుగా అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైబ్‌సైట్‌ని సందర్శించాలి.

సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్‌ రూ ఏర్పాటు చేశారా ?

అవును. ఏ సమస్య ఉన్నా పరిష్కరించేలా డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. విద్యార్థులు గానీ, వారి తల్లితండ్రులు గానీ 98854 62305 చరవాణి నంబరుకు డయల్‌ చేస్తే వెంటనే స్పందిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని