logo

తనయులున్నా.. తప్పని భిక్షాటన!

తన జీవితమంతా ధారపోసి  కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఆస్తి కూడబెట్టారు..  కూతుళ్లకు పెళ్లిచేశారు. కుమారులకు భూమిని పంచారు. ఆ తండ్రి ప్రస్తుతం ఊళ్లోనే భిక్షాటన చేస్తున్న

Updated : 01 Jul 2022 11:55 IST

సింగారంలో భిక్షాటన చేస్తున్న వృద్ధుడు నాగయ్య

బయ్యారం (మహబూబాబాద్‌), న్యూస్‌టుడే: తన జీవితమంతా ధారపోసి  కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఆస్తి కూడబెట్టారు..  కూతుళ్లకు పెళ్లిచేశారు. కుమారులకు భూమిని పంచారు. ఆ తండ్రి ప్రస్తుతం ఊళ్లోనే భిక్షాటన చేస్తున్న దయనీయగాథ ఇది.  బయ్యారం మండలం రామచంద్రాపురం పంచాయతీ సింగారం గ్రామానికి చెందిన సూర్నపాక నాగయ్య, ముసలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాగయ్య కష్టపడి 25 ఎకరాల సాగు భూమిని సంపాదించారు. ముగ్గురు కూతుళ్ల పెళ్లి చేశారు. తన ఇద్దరు కొడుకులు రాందొర, అర్జున్‌బాబులకు చెరో 10 ఎకరాల సాగు భూమి ఇచ్చారు.  నాగయ్య అతని భార్య ముసలమ్మ పోషణ కోసం 5 ఎకరాలు ఉంచుకున్నారు. గత ఏడాది భార్య ముసలమ్మ కొవిడ్‌తో మృతి చెందారు. ముసలమ్మకు చెందిన బంగారం పంపకాల విషయాల్లో వివాదం నెలకొంది. నాగయ్య జీవనభృతి కోసం కేటాయించిన భూమిని సైతం అతడి ఇద్దరు కుమారులే సాగు చేస్తున్నారు. కొంత పోడు భూమి కావడంతో నాగయ్యకు రైతుబంధు సైతం రావడంలేదు. ముసలమ్మ బంగారం తమకు రావాలని ఆడబిడ్డలు పంచాయితీ పెట్టారు. బ్యాంకులో తనఖా పెట్టడంతో అప్పు చెల్లించి బంగారం తీసుకోవాలని కొడుకులు చెప్పారు. తండ్రి పోషణ కోసం కేటాయించిన భూమిలో కొంత అమ్మి బంగారం విడిపించాలని పెద్దమనుషులు చెప్పినా కుమారులు అంగీకరించలేదు. ఈ వివాదం నేపథ్యంలో నాగయ్య కొడుకుల నుంచి వెళ్లిపోయి అదే గ్రామంలో ఉంటున్న కూతురు ఇంటికి చేరారు. పేదరికంలో ఉన్న కూతురికి తాను భారం కాకూడదని భావించారు. ప్రభుత్వం ఇచ్చే పింఛను సరిపోక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడంలేదని నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బ్యాంకులో రూ.4 లక్షల అప్పు కోసం నాలుగు తులాల బంగారం తనఖా పెట్టారని.. అంత సొమ్ము చెల్లించి ఆడబిడ్డలకు బంగారం ఎలా ఇవ్వగలమని నాగయ్య కుమారులు పేర్కొంటున్నారు. పెద్దమనుషులు తమ తీర్పు అంగీకరించలేదంటూ తమను కులబహిష్కరణ చేశారని వారు ఆరోపించారు. ఐదు గ్రామాల పెద్దలను తిరస్కరించడంతో ఆ వివాదాన్ని వారి ఇష్టానికి వదిలేశామని పెద్దమనుషులు పేర్కొంటున్నారు. ఎస్సై రమాదేవిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా నాగయ్య కుటుంబ ఆస్తి వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. పెద్ద మనుషుల్లో పరిష్కరించుకుంటామని చెప్పారన్నారు. నాగయ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని