logo

చెరువు కనుమరుగైంది.. కాలువలా మారింది

హనుమకొండ 56వ డివిజన్‌లోని గోపాలపూర్‌ చెరువు పూడ్చివేత సమాప్తమైంది. భవిష్యత్తులో ఈ చెరువు కనిపించకపోవచ్చు. వందేళ్ల కిందట సర్వే నెంబరు.89లో 21.01 ఎకరాల భూమిలో చెరువు తవ్వినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది.

Published : 11 Aug 2022 03:48 IST

 

హనుమకొండ 56వ డివిజన్‌లోని గోపాలపూర్‌ చెరువు పూడ్చివేత సమాప్తమైంది. భవిష్యత్తులో ఈ చెరువు కనిపించకపోవచ్చు. వందేళ్ల కిందట సర్వే నెంబరు.89లో 21.01 ఎకరాల భూమిలో చెరువు తవ్వినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీని కింద గోపాలపూర్‌, భీమారం, కోమటిపల్లి గ్రామాల పరిధిలో ఆయకట్టు ఉండేది. నాలుగేళ్ల కిందట మిషన్‌ కాకతీయ కింద చెరువులోని పూడికతీసి కట్ట పటిష్ఠం చేశారు. కానీ కాపాడేందుకు మాత్రం అధికారులు చర్యలు తీసుకోలేదు. నగర విస్తీరణలో భాగంగా చెరువు ఆయకట్టు పొలాలు ప్లాట్లుగా మారి క్రమేణా కాలనీలు వెలిశాయి. ఇక్కడి భూమి విలువ గజానికి రూ.వందల నుంచి వేలకు చేరింది. ప్రస్తుతం రూ.30 వేలకు పైగా ఉంది. ఇదే అదునుగా ఆక్రమణదారులు, రియల్టర్లు, కొందరు రాజకీయ నేతలు ఎవరికి తోచినంత వారు భూమిని ఆక్రమించుకున్నారు. కొందరు కట్టను సైతం ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నారు. చెరువు తూములు కనుమరగయ్యాయి. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌) నిబంధనల ప్రకారం చెరువు శిఖం ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దు. అయినా బల్దియా అధికారులు రియల్టర్లు, కొందరు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి అనుమతులిచ్చుకుంటూ పోయారనే ఆరోపణలున్నాయి. ఇదే క్రమంలో కాలనీల ప్రజలు సుమారు రెండెకరాల్లో సమాధులు నిర్మించుకోగా మరో అయిదెకరాల్లో అండర్‌డ్రైనేజీ పనులు చేస్తున్న గుత్తేదారు చెరువులో మట్టిపోసి పూడ్చివేశారు. మిగిలిన స్థలాన్ని పేదలు చదును చేసి గుడిసెలు వేసుకున్నారు. దీంతో లోతైన చెరువు పూర్తిగా చదనుగా మారి కాలువ మాత్రమే మిగిలింది. వరద కాలువ ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ప్రస్తుతం చుక్కనీరు నిలువ లేకుండా చెరువును నీటిపారుదలశాఖ, రెవెన్యూ శాఖల అధికారుల ముందే పూడ్చివేశారు. ఆక్రమణలు బహిరంగంగానే జరిగిపోయినా స్పందించేవారు లేకుండా పోయారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- న్యూస్‌టుడే, గోపాలపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని