logo

వాహన రిజిస్ట్రేషన్‌లో జాప్యం

దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వటం లేదనే చందంగా మారింది రవాణాశాఖ కార్యాలయం పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా వాహనాలు పొందిన లబ్ధిదారులు వాటి రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఉపాధి

Published : 26 Sep 2022 04:53 IST

లబోదిబోమంటున్న దళితబంధు లబ్ధిదారులు

హనుమకొండ జిల్లా ఆర్టీఏ కార్యాలయం  ద్వారం వద్ద వేచి చూస్తున్న లబ్ధిదారులు

రంగశాయిపేట, న్యూస్‌టుడే: దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వటం లేదనే చందంగా మారింది రవాణాశాఖ కార్యాలయం పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా వాహనాలు పొందిన లబ్ధిదారులు వాటి రిజిస్ట్రేషన్‌ కోసం ఆర్టీఏ కార్యాలయంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇస్తున్న వాహనాలతో అధికారులకు, దళారులకు ఉపాధి మాత్రం చేతి నిండా దొరుకుతోంది. నిబంధనల ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకొని ధ్రువీకరించుకున్నా..రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారు. రెండు నెలల క్రితం ధ్రువీకరించుకున్నా ఆర్సీ  లు ఇవ్వడం లేదని ఓ లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ లబ్ధిదారుడు నేరుగా జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆర్టీఏ కార్యాలయంలో ఆర్సీల జారీలో జాప్యంపై ఫిర్యాదు చేశారు.

తప్పని దళారుల బెడద

ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన వాహనాల రిజిస్ట్రేషన్‌ పూర్తి కావాలంటే దళారులను ఆశ్రయించాల్సిందే. ఏ వాహనదారుడైనా నేరుగా వెళ్లాడో అంతే దరఖాస్తు పత్రాల్లో ఇది.. అది.. లేదంటూ అధికారులు కొర్రీలు పెట్టి ధ్రువీకరించకుండా జాప్యం ప్రదర్శిస్తున్నారు. ఈ తలనొప్పి ఎందుకంటూ లబ్ధిదారులు నేరుగా దళారులతో పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఇదే అదనుగా అధికారులు, దళారులు కుమ్మక్కై అందినంత దండుకుంటున్నారు.

సిబ్బంది చేతివాటం: అధికారులు జారీ చేసిన వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలను లబ్ధిదారుడి చేతికివ్వడానికి కింది స్థాయి సిబ్బంది చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. డీబీఏ, హోంగార్డ్‌ స్థాయిలో రూ.500 ఇస్తే తప్ప పత్రాలు చేతిలో పెట్టడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.


పూర్తి స్థాయిలో అందజేస్తాం:

- పురుషోత్తం, రవాణాశాఖ ఉప కమిషనర్‌

జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు హాజరు కావడం వల్ల ఆర్సీ పత్రాల్లో జాప్యం జరిగింది. శుక్రవారం 20-25 మందికి జారీ చేశాం. సోమవారం నుంచి నిరంతరంగా లబ్ధిదారులకు అందజేస్తాం. దళారుల ద్వారా కాకుండా నేరుగా పనులు పూర్తి చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని