logo

ఆసుపత్రుల్లో మొక్కుబడిగా తనిఖీలు!

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ తంతు మొక్కుబడిగా సాగుతుండడంతో పలు విమర్శలకు తావిస్తోంది.

Published : 29 Sep 2022 02:03 IST

జనగామలోని  ప్రైవేటు ఆసుపత్రిలో వివరాలు తెలుసుకుంటున్న వైద్యాధికారుల బృందం ( పాతచిత్రం)

జనగామ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ తంతు మొక్కుబడిగా సాగుతుండడంతో పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించకున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇరుకు భవనాల్లో నిర్వహణ
జనగామ పట్టణం తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్‌, దంత విభాగం, ఆయుష్‌, ఫిజియోథెరపి తదితర ఆసుపత్రులున్నాయి. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత  మరిన్ని కొత్తవి పుట్టుకొచ్చాయి. వీటిలో చాలా వాటికి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఇటీవల తనిఖీలు చేపడుతున్న అధికారులు.. లైసెన్సులు లేని ఆసుపత్రులకు లైసెన్సులు తీసుకోవాలని సూచించి వదిలేస్తున్నారు. పలు దవాఖానాలను గాలి, వెలుతురు సరిగ్గా లేని ఇరుకు భవనాల్లో నిర్వహిస్తున్నారు. జనగామ పట్టణంలో కేవలం రెండు, మూడు ఆసుపత్రులు మాత్రమే 50 పడకలు, విశాలమైన భవనాలు కలిగి ఉన్నాయి.

నిబంధనలకు పాతర
జిల్లా కేంద్రంలోని ఓ మెటర్నిటీ, పిల్లల ఆసుపత్రి నిత్యం వందల సంఖ్యలో బాలింతలు, గర్భిణులు, నవజాత శిశువులతో రద్దీగా ఉంటుంది. భవనం సెల్లార్‌లోని ఒక విభాగంలో మెటర్నిటీ, మరో విభాగంలో పిల్లల ఓపీ నిర్వహిస్తున్నారు. కాన్పు అయిన మహిళలకు పక్కనే ఉన్న మరో భవనం కేటాయించారు. బాలింతలు పై అంతస్తు భవనంపైకి వెళ్లి వచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. ఒకే చోట పిల్లల, మెటర్నిటీ ఆసుపత్రులు నిర్వహిస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు దవాఖానాల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలు కూడా పాటించడం లేదు. విశాలమైన భవనాలు, పార్కింగ్‌ స్థలం ఉంటేనే అనుమతులు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. చాలా ఆసుపత్రుల్లో అర్హత లేని వైద్యులే ఉన్నారు.  ల్యాబ్‌, మందుల దుకాణాల్లో పని చేసే వారికి సైతం తగిన అర్హతలు ఉండడం లేదు. ఒకరిద్దరు వైద్యాధికారులు.. తమకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల మెప్పు ఉందని ప్రచారం చేసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాల నుంచి ముడుపులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అర్హత లేని సిబ్బంది, ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఎవరినీ ఉపేక్షించేది లేదు
- డాక్టర్‌ మహేందర్‌, జిల్లా వైద్యాధికారి

జిలా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 30 ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టాం. మరో నాలుగైదు రోజులు కొనసాగుతాయి. ఆసుపత్రులన్నీ నిబంధనలు పాటించాల్సిందే. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించబోం. నిబంధనలు పాటించని వాటిని సీజ్‌ చేయడానికి వెనకాడబోం. అన్ని రకాల అనుమతులు కలిగి ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని