logo

సీఎం గారూ.. ‘పరకాల’ మొర వినరూ!

ఒకప్పుడు ఆరు మండలాలతో పాత తాలుకా కేంద్రంగా ఒక వెలుగు వెలిగా.. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా, వైద్యం వంటి ఆయా పనులకు ముఖ్య కూడలిగా నిలిచాను. అదే సమయంలో నియోజకవర్గ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి.

Published : 01 Oct 2022 06:16 IST

-పరకాల, న్యూస్‌టుడే

ఒకప్పుడు ఆరు మండలాలతో పాత తాలుకా కేంద్రంగా ఒక వెలుగు వెలిగా.. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా, వైద్యం వంటి ఆయా పనులకు ముఖ్య కూడలిగా నిలిచాను. అదే సమయంలో నియోజకవర్గ సమస్యలు కూడా వెంటాడుతున్నాయి.. నా మొర విని జర దృష్టి సారించాలని ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను  కోరుకుంటున్నా.  

* గీసుకొండ మండలం కొనాయమాకుల ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇది పూర్తయితే 15 వేల ఎకరాలు సేద్యంలోకి వస్తాయి. భూసేకరణ వల్ల పనులు జాప్యం అవుతున్నాయి. వెంటనే పూర్తి చేయాలి.
ప్రధాన సమస్యల నివేదన
* పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 2008లో ప్రారంభించారు. ఇప్పటి వరకు జూనియర్‌ కళాశాలలో షిఫ్టు పద్ధతిన నడుస్తోంది. ప్రభుత్వ స్థలం కేటాయించక సొంత భవనం కలగానే మారింది. సరైన వసతులు లేక ఇరుకు గదుల్లో విద్యార్థులు 14 ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నారు.

* పరకాల ప్రాంతం నుంచి హాకీ, క్రికెట్‌ ఆటల్లో రాణిస్తున్నారు. ఇక్కడ సరైన క్రీడా మైదానం లేదు. ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలంపైనే క్రీడాకారులు ఆధారపడుతుండగా ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రమైన పరకాలలో క్రీడా మైదానం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించి తీరా స్థల సమస్యతో వదిలివేశారు. ఏళ్ల నుంచి ఆ మైదానం లేకుండా పోయింది. అందరికి అనువైన క్రీడా మైదానం ఏర్పాటుచేయాలి.
* కొత్తగా ఏర్పడిన నడికూడ మండలంలో ఇప్పటి వరకు  ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనాలు నిర్మించలేదు. ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు మాత్రమే అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు కాలేదు.
* సంగెం మండలంలోని చింతలపల్లి రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్‌ను నిర్మించాలి.  ఎల్గూరు రంగంపేట వద్ద ఆర్‌యూబీని నిర్మించాలి. ఎల్గూరు రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు
* దామెర  మండలం ఏర్పడి వచ్చే దసరాకు ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నూతన మండలంలో పలు సమస్యలు ఉన్నాయి. తహసీల్దార్‌ కార్యాలయం నిర్మాణం మాత్రమే జరుగుతుండగా, మిగతా కార్యాలయాలన్నీ పీహెచ్‌సీలోని అరకొర గదుల్లో సాగుతున్నాయి.
* ఆత్మకూరు  మండలానికి మంజూరైన గురుకులాలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
* పరకాల దామెర చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని ప్రకటించి పనులు చేపట్టారు. ఆ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. దాన్ని సమ్మర్‌ స్టోరేజిగా మారిస్తే పర్యాటక ప్రాంతంగా పరకాల ఎంతో అభివృద్ధి చెందుతోంది.


పర్యటన ఇలా..
ఉదయం 9 గంటలు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరుతారు.
11:15:  ప్రతిమ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ను చేరుకుంటారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సభలో ప్చా్గొంటారు.
మధ్యాహ్నం ఒంటి గంట: మధ్యాహ్న భోజనం
2 గంటలు: తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని