logo

పొదుపు సంఘాలపై బకాయిల భారం

జిల్లాలోని పలు పొదుపు సంఘాల మహిళలు రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడంతో రూ.కోట్ల బకాయిలు పేరుకుపోతున్నాయి.

Published : 28 Nov 2022 05:04 IST

సమావేశం నిర్వహిస్తున్న అధికారులు (పాత చిత్రం)

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: జిల్లాలోని పలు పొదుపు సంఘాల మహిళలు రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడంతో రూ.కోట్ల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇది సెర్ప్‌ అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. తీసుకున్న రుణాన్ని సరిగ్గా చెల్లించకపోతే నిరర్థక ఆస్తులు (ఎన్‌ పీఏ)గా పరిగణించి బకాయిలను వెంటనే వసూలు చేసి నూరుశాతం తగ్గించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తారు. తాజాగా నిరర్థక ఆస్తుల వివరాలను సెర్ప్‌ విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి నెలతో పోలిస్తే జనగామ సహా పలు జిల్లాల్లో బకాయిలు మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

మార్చి వరకు ఎలా సాగిందంటే..

ఎన్‌పీఏను కనీస స్థాయికి తీసుకొచ్చేందుకు పొదుపు సంఘాల మండల సమాఖ్య అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఎంపిక చేసిన గ్రామాల్లో సమావేశాలు నిర్వహించేవారు. మహిళలు వ్యవసాయ పనులకు వెళ్లకముందే వారి ఇళ్ల వద్దకు వెళ్తారు. వారి ఇళ్ల ముందే సమావేశాలు పెట్టి వాయిదాలు చెల్లించాలని,  ఎవరెవరు ఎంత బకాయి ఉన్నారో వివరించే వారు. పది మందిలో పరువుపోతుందనో లేదా చేతిలో డబ్బులు ఉన్నాయనో వెంటనే వాయిదాలు చెల్లించేవారు. మహిళలు కూడా వ్యవసాయ పనుల హడావుడిలో వాయిదాలు చెల్లించకలేకపోతున్నారు.

కారణాలివి..

పొదుపు సంఘాల మహిళలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి. పొదుపు సంఘాల మహిళలు తమ వ్యాపార అవసరాలకు లేదా చిన్నాచితక ఖర్చుల కోసం తీసుకున్న రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తే వారికి రుణభారం తగ్గడంతో పాటు మరోసారి అధిక రుణం లభిస్తుంది. పలు కారణాలతో మహిళలు తీసుకున్న రుణాన్ని తాము అనుకున్న ప్రయోజనానికి  ఖర్చు చేయకుండా ఇతర ఖర్చులకు మళ్లించడంతో వాయిదాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బంది.. రుణ వాయిదాలను చెల్లించాలంటూ తరచూ మహిళలను సంప్రదిస్తుంటారు. ఇటీవలి కాలంలో అనుకోని ఖర్చులతో పాటు సిబ్బంది తరచూ అనుశీలన చేయకపోవడంతో మహిళలు వాయిదాలను చెల్లించడం లేదని ఉన్నతాధికారులు గమనించారు.


అవగాహన కల్పిస్తున్నాం

నూరొద్దీన్‌, అదనపు అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ

బకాయిలు పెరగడం సంఘ ఆర్థిక స్థితికి ఆరోగ్యకరం కాదు. మహిళలను చైతన్యపరిచి వారంతట వారే చొరవగా వాయిదాలు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాం.   ఇంటింటికీ తిరిగి గ్రామైక్య సంఘాల బాధ్యులను వ్యక్తిగతంగా కలిసి వాయిదాలు చెల్లించాలని చెబుతున్నాం. సంఘాలు నెలకు రెండుసార్లు నిర్వహించే సమావేశాలకు వీరి హాజరు తప్పనిసరి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని