logo

‘ఆతిథ్య’మివ్వని గృహం

లేని వనరుల కోసం పడరాని పాట్లు పడే అధికారులు.. కంటి ముందు కనిపించే వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను పట్టించుకోకపోవడంతో ప్రజాధనం వట్టిపోతోంది.

Published : 30 Nov 2022 03:53 IST

గోవిందరావుపేట(పస్రా), న్యూస్‌టుడే: లేని వనరుల కోసం పడరాని పాట్లు పడే అధికారులు.. కంటి ముందు కనిపించే వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను పట్టించుకోకపోవడంతో ప్రజాధనం వట్టిపోతోంది. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌ గ్రామంలోని నీటిపారుదలశాఖ అతిథిగృహం ఇందుకు నిదర్శనం. లక్నవరం జలాశయానికి వెళ్లే మార్గంలోని బుస్సాపూర్‌ గ్రామంలో నీటిపారుదలశాఖ అధికారులు బస చేసేందుకు కొన్ని దశాబ్దాల క్రితమే అతిథిగృహాన్ని నిర్మించారు. అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందువల్ల జలాశయం బాగోగులు, నీటి విడుదల ప్రక్రియ పరిశీలించేందుకు వచ్చే అధికారులకు ఉపయోగకరంగా ఉండేది. ఇందులో పెద్ద బావితో పాటు సహాయకులు ఉండేందుకు వీలుగా క్వార్టర్లను సైతం నిర్మించారు. కాలక్రమేణా రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో అతిథిగృహంతో అధికారులకు అంతగా అవసరం లేకపోయింది. నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు భారంగా పరిణమించాయి. దీంతో అతిథిగృహం శిథిలావస్థకు చేరుకుంది.

నిధులు.. సమయం వృథా..

2007లో అప్పటి కలెక్టర్‌ దమయంతి లక్నవరం జలాశయం సందర్శనకు వచ్చినప్పుడు సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న అతిథిగృహాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. అప్పటి వరకు నీటిపారుదలశాఖ అధీనంలో ఉండగా రెవెన్యూశాఖ పరిధిలోకి తీసుకోవాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. వెంటనే మరమ్మతులు చేయించాలంటూ ఐటీడీఏ అధికారులను ఆదేశించి రాష్ట్రీయ సమ వికాస్‌ యోజన పథకంలో భాగంగా సుమారు రూ. 12 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన జనార్దన్‌రెడ్డి మళ్లీ సుమారు రూ.5 లక్షలు మంజూరు చేశారు. చివరకు అతిథిగృహంలో చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి. గుత్తేదారుకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సువిశాలమైన ఆవరణలో నర్సరీని సైతం అభివృద్ధి చేసి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని దమయంతి భావించినా ఆమె ఆశయం నెరవేరలేదు. నిధులు వృథా అయ్యాయి.

అభివృద్ధి చేస్తే మేలు

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. వాటిల్లో భాగంగా అతిథిగృహం ఆవరణలో నర్సరీని అభివృద్ధి చేయొచ్చు. జలాశయానికి వచ్చే పర్యాటకులు ఈ మార్గంలో అతిథిగృహాలు కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా కూడా అభివృద్ధి చేయొచ్చు. విలువైన ప్రదేశాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని