logo

Konda Surekha: కొండా సురేఖ రాజీనామా వెనుక రాజకీయ కారణాలెన్నో!

కొండా సురేఖ పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పదవికి రాజీనామా చేయడం వెనుక పలు కారణాలున్నాయని తెలిసింది.

Updated : 12 Dec 2022 07:49 IST

న్యూస్‌టుడే, రంగంపేట: కొండా సురేఖ పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పదవికి రాజీనామా చేయడం వెనుక పలు కారణాలున్నాయని తెలిసింది. తనకంటే జూనియర్లను, పార్టీల మారిన వారికి రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించి, తనను ఎగ్జిక్యూటివ్‌ కమిటీకే పరిమిత చేయడం బాధ కలిగించిందని పైకి చెప్పినా, రాజీనామా వెనుక స్థానిక రాజకీయ ప్రాధాన్యాంశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. వరంగల్‌ డీసీసీ అధ్యక్ష పదవి తన ముఖ్య అనుచరునికి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను కోరారని తెలిసింది. కనీసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ ప్రకటించిన పదవుల జాబితాపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

వరంగల్‌ డీసీసీ అధ్యక్ష పదవిపై కొండా మురళి, దొంతి మాధవరెడ్డి మధ్య పోటీ నెలకొంది. వరంగల్‌ తూర్పులో ముఖ్యమైన నాయకుడు పేరు సిఫారసు చేసినట్లుగా తెలిసింది. జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం జంగా, కొమ్మూరి మధ్య పోటీ నెలకొంది. జంగా రాఘవరెడ్డికి పదవి వచ్చేలా కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ప్రకటించిన పదవుల జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి ఆమె లేఖ రాశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని, నా భర్త కొండా మురళి రెండుసార్లు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారని, వరంగల్‌ తూర్పు, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, పాలకుర్తి నియోజకవర్గాల కాకుండా వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలున్నారని, ఏఐసీసీ శనివారం ప్రకటించిన పదవులపై అసంతృప్తి కలిగిందని మాజీ మంత్రి కొండా సురేఖ తన లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని