logo

మేడారంలో వడివడిగా ఏర్పాట్లు

వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్న జాతరకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది.

Published : 25 Jan 2023 05:56 IST

మహిళలు దుస్తులు మార్చుకునే గదులను సిద్ధం చేస్తున్న కూలీలు

తాడ్వాయి, న్యూస్‌టుడే: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్న జాతరకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎన్పీడీసీఎల్‌, జిల్లా పంచాయతీ, గిరిజన సంక్షేమ, దేవాదాయ, పోలీసుశాఖలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.


పుణ్యస్నానాలకు సిద్ధమవుతున్న స్నానఘట్టాలు

శుభ్రం చేయిస్తున్న డీపీవో వెంకయ్య

చిన్నజాతరకు వచ్చే భక్తులు జల్లు స్నానాలు చేసేందుకు 32 షవర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి నీటిని సరఫరా చేసేందుకు 2 ఊటబావుల్లో పూడిక తీయించారు. వాటిలో 5 హెచ్‌పీ విద్యుత్తు మోటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జంపన్నవాగుకు ఇరువైపులా 10 దుస్తులు మార్చుకొనే గదులు ఏర్పాటు చేసే పనులు పూర్తి దశలో ఉన్నాయి.


తాగునీరందించేందుకు చర్యలు

నల్లాలు ఏర్పాటు చేస్తున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగులు

భక్తులకు తాగునీరందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 60కి పైగా చేతిపంపులు సిద్ధం చేశారు. చిలకలగుట్ట, ఎల్బాక, రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో విడిది చేసే భక్తులకు భగీరథ జలాలు అందించేందుకు నల్లాలు అమర్చారు.

వినియోగంలోకి మరుగుదొడ్లు

మేడారంలో ఉన్న మరుగుదొడ్లన్నింటినీ వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పనులు చేపట్టారు. క్యూలైన్లు, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం, పోలీసు క్యాంపు, ఆర్టీసీ బస్టాండ్‌, దేవాదాయశాఖ సత్రాల వద్ద ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులను చేపట్టారు. బుధవారం నాటికి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు.


40 మందితో పారిశుద్ధ్య పనులు

దేవతల దర్శనానికి ముందస్తు భక్తుల తాకిడి పెరిగింది. దీనిపై దృష్టిసారించిన పంచాయతీ అధికారులు నిత్యం 40 మందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. ప్రధానంగా భక్తులు ఎక్కువమంది విడిది చేసే జంపన్నవాగు, చిలకలగుట్ట, శివరాంసాగర్‌చెరువు, నీడచెట్లు, ఆలయ పరిసరాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, పంచాయతీ కార్యదర్శి సతీష్‌కుమార్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని