logo

ఎర్రకోటలో ఓరుగల్లు!

ఓరుగల్లు పతాకం మరోసారి దేశ రాజధాని దిల్లీలో రెపరెపలాడనుంది.  ఎర్రకోట కర్తవ్యపథ్‌ వద్ద జరిగే గణతంత్ర వేడుకల్లో ఉమ్మడి వరంగల్‌ నుంచి పలువురు తమ ప్రదర్శనల్లో అలరించనున్నారు.

Updated : 26 Jan 2023 05:42 IST

కళ్ల ముందు కదలాడే నృత్యం

న్యూస్‌టుడే, శివనగర్‌

ఓరుగల్లు పతాకం మరోసారి దేశ రాజధాని దిల్లీలో రెపరెపలాడనుంది.  ఎర్రకోట కర్తవ్యపథ్‌ వద్ద జరిగే గణతంత్ర వేడుకల్లో ఉమ్మడి వరంగల్‌ నుంచి పలువురు తమ ప్రదర్శనల్లో అలరించనున్నారు.  సాంస్కృతిక, సైనిక విభాగాల్లో జరిగే వేడుకలు, కవాతులో వీరికి అవకాశం దక్కింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చెప్పడానికి వీరే నిదర్శనం. అకుంఠిత దీక్షతో సాధన చేసి  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర దేశ ప్రముఖుల ముందు ప్రదర్శనలు ఇచ్చే  గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. అదే సమయంలో ఓరుగల్లు కీర్తిని చాటుతున్నారు.

దిల్లీ ఎర్రకోట వేదికగా మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే గొప్ప అవకాశం హనుమకొండకు చెందిన కూచిపూడి నృత్యకారిణి కాట్రగడ్డ హిమాన్సిచౌదరికి దక్కింది. ఉన్నత విద్య పూర్తి చేసినా ఆమె నృత్యాన్ని మరచిపోలేదు. తన లక్ష్యం చేరుకునేందుకు వ్యయప్రయాసలు ఎదుర్కొన్నారు. తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు (వ్యాపారి) ప్రోత్సాహంతో టెంపుల్‌ డ్యాన్స్‌ కార్యక్రమాన్ని రూపొందించారు. నిర్జీవమవుతున్న పురాతన ఆలయాలకు జీవం పోసేందుకు నడుం బిగించారు. ఆలయాల వద్ద ప్రదర్శనలు ఇస్తూ వాటిని వెలుగులోకి తెచ్చారు. తాజాగా గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోట కర్తవ్యపథ్‌లో నిర్వహించే కవాతులో  కూచిపూడి శాస్త్రీయనృత్యం సోలో విభాగంలో ఎంపికయ్యారు.  
* దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో కూచిపూడి శాస్త్రీయ నృత్యం సోలో విభాగంలో అవకాశం రావడం ఆనందం ఉంది.. మూడు అంచెల వడపోతలో తానొక్కరే ఎంపికైనట్లు హిమాన్సిచౌదరి తెలిపారు.  

కవాతులో మనోళ్లు

రంగంపేట, న్యూస్‌టుడే: ఎర్రకోటలో జరిగే కవాతు (పరేడ్‌)లో వరంగల్‌ నగరానికి చెందిన లాల్‌బహదూర్‌ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ కెడెట్లు మహేందర్‌, రాకేష్‌ పాల్గొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 మంది ఎంపికైతే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ డైరెక్టరేటు నుంచి ఇద్దరు ఓరుగల్లు నగరానికి చెందిన వారున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటి దిల్లీ ఎర్రకోట పరేడ్‌కు ఎంపికయ్యారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ అరుణ, ఎన్‌సీసీ కెప్టెన్‌ డాక్టర్‌ సదానందం తెలిపారు.  

సైన్యంలో చేరాలనే లక్ష్యం..  

ఈ విద్యార్థి పేరు జి.మహేందర్‌. డీగ్రీ బీబీఏ చదువుతున్నారు. స్వస్థలం హనుమకొండ నగరం జులైవాడ. తండ్రి చనిపోయారు. పేదరికం వేధిస్తున్నా తల్లి సంరక్షణలో ఎన్‌సీసీలో అంచెలంచెలుగా ఎదిగారు. సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ఎన్‌సీసీ 10వ తెలంగాణ బెటాలియన్‌ కెడెట్‌గా ఎంపికయ్యారు. మూడేళ్లుగా ఎన్‌సీసీలో ప్రతిభ కనబర్చారు. క్రమశిక్షణ, కఠోరమైన శ్రమతో గణతంత్ర వేడుకల పరేడ్‌కు ఎంపికయ్యారు.
నీ ఎల్బీ కళాశాల అధ్యాపకులు, ఎన్‌సీసీ అధికారి సహకారంతో కవాతులో పాల్గొంటున్నానని.. ఇదే స్ఫూర్తితో భారత సైన్యంలో చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని మహేందర్‌ తెలిపారు.

ఎయిర్‌ఫోర్స్‌లో స్థిరపడాలని..

ఈ విద్యార్థి పేరు టి.రాకేష్‌. డిగ్రీ బీకాం చివరి సంవత్సరం చదువుతున్నారు. స్వస్థలం ఎల్కతుర్తి మండలం కేశపూర్‌ గ్రామం.  పట్టుదల, క్రమశిక్షణతో ఎన్‌సీసీ 10వ తెలంగాణ బెటాలియన్‌, 4వ ఎయిర్‌ వింగ్‌ బెటాలియన్‌ కెడెటుగా ఎంపికయ్యారు. ఫ్లయింగ్‌ లెఫ్టినెంటు బి.ప్రభాకర్‌ ప్రత్యేక శిక్షణలో ప్రతిభ కనబర్చి రెండు తెలుగు రాష్ట్రాల పోటీని తట్టుకొని  గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొంటున్నారు.

* ఎయిర్‌ ఫోర్స్‌లో మంచి అధికారిగా స్థిరపడి దేశ సేవ కోసం, దేశరక్షణలో పాల్గొనడమే చిరకాల స్వప్నమని రాకేష్‌ తెలిపారు.


‘నారీశక్తి’ చాటనున్న కోమల్‌ ప్రీత్‌కౌర్‌  

దిల్లీలో శిక్షణలో భాగంగా మహిళా జవాన్లకు సూచనలిస్తున్న సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ కోమల్‌ ప్రీత్‌కౌర్‌

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కాటారం, న్యూస్‌టుడే:  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం సీఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ కోమల్‌ ప్రీత్‌కౌర్‌ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. శకటాల ప్రదర్శనలో సీఆర్పీఎఫ్‌ ‘నారీశక్తి’ శకటానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

యోగా శిక్షకురాలి నుంచి: హరియాణా రాష్ట్రం ఫతేబాద్‌ జిల్లా రతియా పట్టణంలో జన్మించిన కోమల్‌ ప్రీత్‌కౌర్‌ చండీగఢ్‌లో ఎంటెక్‌ పూర్తి చేశారు. ఆసక్తితో యోగా సాధన చేస్తూనే శిక్షణ ఇచ్చేవారు. 2017లో గ్రూప్‌-1 హోదా అయిన సీఏపీఎఫ్‌ అసిస్టెంటు కమాండెంట్‌ ఉద్యోగం సాధించారు. హరియాణాలోని కాదర్‌పూర్‌ సీఆర్పీఎఫ్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలోనూ బెస్ట్‌ ఇన్‌ ఇండోర్‌ సాధించారు. 2020లో హనుమకొండ జిల్లా భీమారంలో వరంగల్‌ 58 బెటాలియన్‌ హెడ్‌ క్వార్టర్‌లో పోస్టింగ్‌ వచ్చింది. ఆ తర్వాత మహాముత్తారం మండలం సీఆర్పీఎఫ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా వ్యవహరించారు. గతేడాది 22 ఫిబ్రవరి నుంచి కాటారం, మహాదేవపూర్‌ ఆఫీసర్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021లో మధ్యప్రదేశ్‌లోని శివ్‌పూరి కమాండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో సీఐఏటీ (కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీ అండ్‌ యాంటీ టెర్రరిజమ్‌) కోర్సు పూర్తి చేశారు. అంకితభావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.

* కేంద్ర పారా మిలటరీ బలగాల్లో మహిళల పాత్ర, ప్రాధాన్యం తదితర అంశాలను నారీశక్తి శకటంలో ప్రదర్శించనున్నారు. నారీశక్తి శకటం రూపకల్పనలోనూ కోమల్‌ భాగస్వామ్యం అయ్యారు. కవాతులో దీన్ని ముందుండి నడిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని