logo

గణతంత్ర సందేశం.. సంక్షేమ పథం

అందరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని కలెక్టర్‌ కె.శశాంక అన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో గణతంత్ర వేడుకలు జరిగాయి.

Published : 27 Jan 2023 06:23 IST

ఉత్సాహంగా వేడుకలు

అందరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని కలెక్టర్‌ కె.శశాంక అన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం ఆవరణలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు. అధికారులు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి జిల్లా ప్రగతి నివేదికను విడుదల చేశారు.

కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరిస్తున్న  పాలనాధికారి శశాంక. చిత్రంలో  అధికారులు, ప్రజాప్రతినిధులు

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 18,398 మందిని పరీక్షించి 3,550 మందికి కంటి అద్దాలు ఇచ్చారు. తొర్రూరు, మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 100 పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలు పంపించారు. 139 పల్లె దవఖానాలకు వైద్యాధికారులను నియమించారు. 74 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి.

మన ఊరు-మన బడి: జిల్లాలో 898 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలున్నాయి. మొదటి దశగా 316 బడులను ఈ పథకానికి ఎంపిక చేశాం. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. విద్యార్థుల్లో సామర్థ్యాల, సాధనకు సర్కారు అమలు చేసిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా 1927 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.

రెండు పడక గదుల ఇళ్లు: జిల్లాలో 5,571 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందుకు రూ.295 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 1658 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 896 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు జరిగింది. మిగతావి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
విద్యుత్తు సరఫరా: ప్రస్తుతం ప్రతి రోజూ 3.1 మిలియన్ల విద్యుత్‌ వినియోగం ఉంది. జిల్లాలో 87,846 వ్యవసాయ బావులుండగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1251 ఉచిత విద్యుత్తు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు.

వ్యవసాయానికి పెద్దపీట: రైతుబంధు పథకం ద్వారా 1,79,780 మంది రైతులకు ఎకరానికి రూ.ఎకరానికి రూ.5 వేల చొప్పున 2022-23 సంవత్సరం యాసంగిలో రూ. 171.99 కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమచేశారు. 1,37,098 మంది రైతులకు సామూహిక రైతు బీమా చేశారు. ఈ ఏడాది మృతి చెందిన 224కి చెందిన రైతుల కుటుంబ సభ్యుల రూ. 5 లక్షల చొప్పున రూ.11.20 కోట్లు జమ చేశారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి అర్హులైన 90,561 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.54.33 కోట్లు వేశారు. ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటల విస్తరణ, అభివృద్ధికి రూ.672 లక్షలతో 4250 ఎకరాల లక్ష్యానికి ఇప్పటి వరకు 5564 ఎకరాల విస్తీర్ణాన్ని గుర్తించారు.

ప్రగతి బాటలో పల్లెలు: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఇప్పటి రూ.7 లక్షల విలువ గల ఎరువును విక్రయించారు. గ్రామాలు, శివారు పల్లెల్లో 702 పల్లె పకృతి వనాలు నెలకొల్పారు. 702 క్రీడా ప్రాంగణాలకు 355 నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవనంలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు సామాజిక సందేశాలను అందించడంతో పాటు ఆహుతులను అలరించాయి. ఆదివాసీ, లంబాడీల సంప్రదాయ నృత్య ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకమైన వేషధారణలో చిన్నారులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. దేశభక్తి, తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో ఆకర్శించారు. కలెక్టర్‌ కె.శశాంక జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ చిన్నారులకు బహుమతులు అందించి వారిని అభినందించారు. స్వాతంత్ర సమరయోధులను,  వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు.  వేడుకల్లో జడ్పీ అధ్యక్షురాలు ఆంగోత్‌ బిందు, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, అదనపు కలెక్టర్‌ ఎం.డెవిడ్‌, శిక్షణ కలెక్టర్‌ పరమర్‌ పింకేశ్‌ కుమార్‌ లలిత్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి తదితరులున్నారు.

స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

స్వాగతం పలుకుతూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని