logo

రాములోరి కల్యాణం.. పులకించిన భక్తజనం

పట్టు వస్త్రాలు.. ముత్యాల తలంబ్రాలు.. వేద మంత్రాల నడుమ.. మాంగళ్యం తంతునానేనా.. అంటూ సీతారాముల కల్యాణాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Published : 31 Mar 2023 04:59 IST

కాళేశ్వరంలోని రామాలయంలో..

కాళేశ్వరం, న్యూస్‌టుడే : పట్టు వస్త్రాలు.. ముత్యాల తలంబ్రాలు.. వేద మంత్రాల నడుమ.. మాంగళ్యం తంతునానేనా.. అంటూ సీతారాముల కల్యాణాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాళేశ్వర క్షేత్రం అనుబంధ రామాలయలోని కల్యాణ మండపంలో ఉత్సవ దేవతామూర్తులను అర్చకులు ఆసీనులను గావించారు. ప్రధాన ఆలయం నుంచి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను ఆలయ ధర్మకర్తల మండలి, కార్యనిర్వహణాధికారి మహేశ్‌ తీసుకురాగా మంగళవాయిద్యాల నడుమ అర్చకుల వేదమంత్రాలతో సీతారాముల కల్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భారీగా భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఛైర్మన్‌ లింగంపల్లి శ్రీనివాసరావు, ధర్మకర్తలు అడుప సమ్మయ్య, కె.రాంరెడ్డి, పద్మ, రాజయ్య, ప్రశాంత్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, శ్యాంసుందర్‌, దేవేందర్‌, సత్యనారాయణగౌడ్‌, సర్పంచి వసంత, ఎంపీటీసీ మమత, ఆలయ మాజీ ఛైర్మన్‌ రాంనారాయణగౌడ్‌ పాల్గొన్నారు. కాళేశ్వరం వాస్తవ్యులు గందెసరి కుటుంబాలు ఆనవాయితీగా తలంబ్రాలను సమర్పించారు. కాళేశ్వరంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో సుమారు 600 మందికి అన్నదానం నిర్వహించారు. రూ.25 వేల కానుకలు వచ్చినట్లు ఆలయ ఈవో మహేశ్‌ తెలిపారు. కల్యాణం అనంతరం ఆలయ ఆవరణలో సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ ఛైర్మన్‌, ధర్మకర్తలకు ఈవో మహేశ్‌, కల్యాణ దాతలకు అర్చకులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో కండువాలు కప్పి సన్మానించారు.
భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో గురువారం వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు జరిగాయి. పట్టణంలోని సుభాష్‌కాలనీలోని రామాలయంలో రాములోరి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి పలు కార్మిక కాలనీల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర దంపతులు స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పురపాలక ఛైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, సింగరేణి అధికారులు, టీబీజీకేఎస్‌ నాయకులు పాల్గొన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం, కృష్ణాకాలనీలోని అయ్యప్ప స్వామి, గీతామందిర్‌లో సీతారాముల కల్యాణం వైభవంగా వేద పడింతులు దెబ్బట వరప్రసాద్‌, రాధాకృష్ణాచార్యలు, మురళీకృష్ణాచార్యులు ఘనంగా నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని