logo

ఉపాధి పనుల్లో మగువలదే హవా!

నిరుపేదలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ఓ వరం. గ్రామీణ ప్రజలు ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు.

Published : 01 Apr 2023 04:11 IST

జిల్లాలో మొత్తం గ్రామాలు : 281
పని చేసిన వారు
పురుషులు : 41,383
మహిళలు : 54,418

రఘునాథపల్లి మండలం నారాయణపురంలో పనులు చేస్తున్న మహిళలు (పాతచిత్రం)

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: నిరుపేదలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ఓ వరం. గ్రామీణ ప్రజలు ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. పురుషుల కంటే మహిళలే అధికంగా ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటున్నారు. మగవారికి  దీటుగా పని చేస్తూ సంపాదనలోనూ పైచేయి సాధిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో చేపట్టిన ఇంకుడుగుంతలు, భూ అభివృద్ధి పనులు, హరితహారం, మట్టి రహదారుల నిర్మాణం, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, కంపోస్టు షెడ్ల నిర్మాణం.. తదితర పనుల్లో భాగస్వాములవుతున్నారు.

రూ.20 కోట్లకు పైగా కూలీ ఆర్జన

ఉపాధి హామీ పనులకు మహిళలే అధికంగా హాజరవుతున్నారు. జిల్లాలో 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో మహిళా కూలీలు రూ.20 కోట్లకు పైగా ఆర్జించారు. మొత్తం 95,801 మంది కూలీలు పని చేయగా వారిలో మహిళలు 54,418 మంది, పురుషులు 41,383 మంది ఉన్నారు. పురుషులు రూ.1,297 లక్షల వేతనం ఆర్జించగా, మహిళలు రూ.2,077 లక్షల వేతనం సంపాదించారు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేకపోవడం, పనివేళలు అనువుగా ఉండటం, స్థానికంగానే పనులు కల్పిస్తుండటం, పనులు సులభంగా ఉండడంతో ఉపాధి పనులు చేసేందుకు అతివలు ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు.

వసతులు కల్పిస్తే ఇంకా పెరిగే అవకాశం

ఉపాధిహామీ పథకం ప్రారంభమైన మొదట్లో కూలీలకు అన్ని వసతులు కల్పించేవారు. క్రమ క్రమంగా వసతుల లేమితో కొంత మేర కూలీలు తగ్గారు. రోజుకు రెండు లేదా మూడు గంటల వ్యవధిలో రూ.150 నుంచి రూ.300 వరకు సంపాదించుకునే ఆస్కారం ఉండడంతో వ్యవసాయ ఆధారిత కూలీలు సైతం ఉపాధిపనుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే కూలీల సంఖ్య తగ్గడంతో.. రైతులు గుత్తా లెక్కన కూలీలను మాట్లాడుకొని పనులు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో మందికి జీవనాధారమైంది. ప్రైవేటు కంపెనీల్లో సాధారణ జీతంతో పనిచేసిన మహిళలు, నిరుద్యోగులు సైతం కొవిడ్‌ దెబ్బతో ఉద్యోగాలు పోవడంతో  ఉపాధి పనులకు వెళ్తున్నారు.

కోరిన వారికి జాబ్‌కార్డులు ఇస్తున్నాం..

ఉపాధి పనులు చేసేందుకు ముందుకొచ్చే వారికి జాబ్‌కార్డులు ఇస్తున్నాం. పురుషులతో కంటే మహిళలే ఎక్కువగా ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఇంకా ఎవరైనా ఉపాధి పని చేయాలనుకుంటే సంబంధిత క్షేత్ర సహాయకులను సంప్రదించి జాబ్‌కార్డును పొందవచ్చు.

డీఆర్డీవో రాంరెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని