logo

లారీల కొరత తీరుస్తాం..

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని.. లారీల కొరత రాకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి వాజీద్‌ అలీ అన్నారు.

Published : 31 May 2023 05:03 IST

పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి వాజీద్‌ అలీ
రైతులతో వీడియో ఫోన్‌ ఇన్‌లో మాట్లాడుతున్న వాజీద్‌ అలీ
ఈనాడు వీడియో కాల్‌
ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని.. లారీల కొరత రాకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి వాజీద్‌ అలీ అన్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వీడియో ఫోన్‌ఇన్‌ చేపట్టగా రైతుల నుంచి స్పందన వచ్చింది. దాదాపు 22 మంది రైతులు డీఎస్‌వోతో మాట్లాడారు. కల్లాల్లో పరిస్థితులను వీడియోలో ఆయనకు ప్రత్యక్షంగా చూపించారు. ప్రధానంగా లారీలు రాక ధాన్యం లోడింగ్‌ కావడం లేదని రైతులు డీఎస్‌వోకు వివరించారు. ధాన్యం కేంద్రాల్లో సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రైతులకు తెలిపారు. వీడియో ఫోన్‌ఇన్‌కు వచ్చిన వివరాలు ఇలా..

ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబెట్టాం, గోనె సంచులు ఇవ్వలేదు. పది లోడ్ల ధాన్యం కేంద్రంలో ఉంది.

పోచిరెడ్డి, గుమ్మల్లపల్లి, కాటారం మండలం

జిల్లాకు సరిపోయే గోనె సంచులు ఉన్నాయి. అక్కడి నిర్వాహకులతో మాట్లాడి సంచులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: హమాలీల కొరత ఉంది.. లారీలు రావడం లేదు. 15 నుంచి 20 రోజులుగా ధాన్యాన్ని తరలించడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

లింగమూర్తి, గారెపల్లి, కాటారం మండలం

డీఎస్‌ఓ: కొనుగోలు కేంద్రాల్లో వాస్తవాలు తెలుసుకునేందుకు ‘ఈనాడు’ వీడియో ఫోన్‌ఇన్‌ మాకు మేలు చేసింది. అక్కడి కేంద్రం నిర్వాహకులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను.

20 రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చాను. నేటికీ కాంటా వేయలేదు. మీరైనా మా బాధను చూడండి.

కూచన రాజమల్లు, జంగేడు, భూపాలపల్లి

అక్కడ ఎందుకు సమస్య తలెత్తిందో తెలుసుకుంటాను. ధాన్యం కాంటా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

పది రోజులుగా ధాన్యం కాంటాలు వేయడం లేదు.. హమాలీల కొరత ఉంది. రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి.

కుమార్‌, భాస్కర్‌గడ్డ, భూపాలపల్లి

రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. హమాలీలు, లారీల కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటున్నాం. తడిసిన ధాన్యం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.

తరుగు పేరిట కోతలు విధిస్తున్నారు. రోజుకు ఒక లారీ మాత్రమే లోడ్‌ అవుతోంది. ఇక్కడ కనీసం 20 లోడ్లకు పైగా బస్తాలున్నాయి.

మహదేవపూర్‌ రైతులు

మిల్లుల వద్ద దిగుమతి అవడంలో ఆలస్యం అవుతోంది. మరిన్ని లారీలు ఏర్పాటు చేసి ధాన్యం లోడింగ్‌ అయ్యేలా చూస్తాం. తరుగు పేరిట కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటాం.

ఐదు రోజులుగా కాంటాలు కావడం లేదు. రాత్రి వర్షం కురిసింది. లారీలు రావడం లేదు. ధాన్యం కేంద్రంలో పేరుకుపోతోంది. ఇబ్బందిగా ఉంది.

రమేశ్‌రెడ్డి, రేగులగూడెం, కాటారం

లారీల కొరతను తీర్చేందుకు కలెక్టర్‌, జేసీలతో మాట్లాడాం. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం. ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటాం.

ధాన్యం అమ్మి నెలరోజులవుతోంది. డబ్బులు ఇంకా రాలేదు.

రాములు, కొర్కిశాల, మొగుళ్లపల్లి మండలం

డబ్బులు ఖాతాలో జమయ్యేలా చూస్తాం. ఎక్కడ జాప్యం అవుతుందో తెలుసుకుంటాను.

కాంటాలు వేయడం లేదు.. వర్షం కురిసింది.. మొలకలు వస్తే పెట్టుబడి, శ్రమ వృథా అవుతుంది. రైతుల సమస్యలు పరిష్కరించాలి.

నాగేంద్ర చారి, రంగయ్యపల్లి, రేగొండ మండలం, కిరణ్‌, పండిగిపల్లి, టేకుమట్ల మండలం

అక్కడి నిర్వాహకులతో మాట్లాడి, ధాన్యం తూకం వేసేలా చూస్తాం.   

15 రోజులుగా కేంద్రానికి లారీలు రావడం లేదు. ధాన్యం తరలించాలి.

శంకర్‌, ధన్‌సింగ్‌, శ్రీనివాస్‌ నిమ్మగూడెం, మహాముత్తారం మండలం

లారీలు పంపించే ఏర్పాటు చేస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు.

ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. వర్షం వస్తోంది, పరదాలు కూడా ఇవ్వడం లేదు, ఇబ్బంది కరంగా ఉంది.

శ్రీనివాస్‌, భావుసింగ్‌పల్లి, చిట్యాల మండలం, ఉప్పల రవి, చిట్యాల, ఎల్లారెడ్డి, అంబట్‌పల్లి, మహదేవపూర్‌

పరదాలు పంపిస్తాం.. రెండ్రోజుల్లో ధాన్యం తరలిస్తాం.

ఆడ, మగ విత్తన వడ్లు సాగు చేశాను. కేంద్రంలో కొనుగోలు చేయడం లేదు.

రమేశ్‌, ఏలేటి రామయ్యపల్లి, శ్రీనివాస్‌, నవాబ్‌పేట, చిట్యాల మండలం

విత్తన వడ్లు కేంద్రంలో కొనుగోలు చేయడం లేదు. విత్తన వడ్లు మిల్లింగ్‌ చేసే సమయంలో నూకలు అవుతున్నాయని మిల్లర్లు తీసుకోవడం లేదు. వచ్చే ఏడాది చిరు ధాన్యాలు పండించండి. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది.

నాలుగైదు రోజులుగా కాంటాలు కావడం లేదు. ధాన్యం తరలింపులో ఆలస్యం అవుతోంది. మూడురోజులకో లారీ వస్తోంది.

లక్ష్మణ్‌, దినేశ్‌, విలాసాగర్‌, కాటారం మండలం, నరేందర్‌, బొమ్మాపూర్‌, మహదేవపూర్‌

లారీలు వచ్చేలా చూస్తాం, అక్కడి నిర్వాహకులతో మాట్లాడుతాం. ధాన్యం తరలింపును వేగవంతం చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని