logo

అమ్మకానికి పారిశుద్ధ్య పోస్టులు

బల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు.

Updated : 28 Mar 2024 05:30 IST

పేర్లు మార్చి.. అడ్డదారుల్లో నియామకాలు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

ల్దియా ప్రజారోగ్య విభాగంలో ఉద్యోగులే పైరవీకారులుగా మారుతున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను కొనడం.. అమ్మడం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పోస్టును రూ.3-4 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్యం, ఇతర కారణాలతో విధులకు గైర్హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లలోకి వెళ్లి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెప్తున్నారు. తర్వాత ఆ పోస్టు అమ్మకానికి పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పారిశుద్ధ్య కార్మికుల పేర్లు మార్చేస్తున్నారు. పదిరోజుల క్రితం 32 మందిని కొత్తగా తీసుకున్నారు. పేరుకు మాత్రం అధికారుల కమిటీలో తీర్మానం ప్రకారం చేశామంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒప్పంద ఉద్యోగుల కారుణ్య నియామకాల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కొనడం, అమ్మడం వెనుక కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్ల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది.

నిబంధనలు ఇవి..

  • అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర కారణాలతో పనులు చేయలేని ఒప్పంద కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించేందుకు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ వరంగల్‌లో నియామకాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. అదనపు కమిషనర్‌, ఎస్‌ఈ, ఇద్దరు ఉప కమిషనర్లు, సీఎంహెచ్‌ఓ, పర్యావరణ ఇంజినీర్‌ తదితర వింగ్‌ అధికారులు కమిటీలో ఉన్నారు.
  • పని చేయలేనని కార్మికుడు అర్జీ పెట్టుకోవాలి. స్థానిక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పరిశీలన చేసి సరే అంటే కమిటీ ముందుకు దరఖాస్తు వెళ్తుంది. ఆ స్థానంలో కుటుంబ సభ్యులకే అవకాశం ఇవ్వాలి. ఇతరులకు ఇవ్వకూడదు. అధికారుల కమిటీ అన్ని పరిశీలించిన తర్వాతే ఓకే చెప్పాలి.

ఉల్లంఘన ఇలా..

  • కుటుంబ సభ్యులకు కాకుండా ఇతరులకు అవకాశం కల్పిస్తున్నారు. కమిటీలో ఉన్న అధికారులు పైరవీలకు తలొగ్గుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన నుంచి కమిటీలో తీర్మానం చేసే వరకు పైరవీల దందా కొనసాగుతోంది. దీని వెనుక కొంత మంది క్షేత్రస్థాయి ఉద్యోగులు ఉన్నారని తెలిసింది.
  • నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులను నియమించేందుకు పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. రూ.లక్షన్నర వరకు ఖర్చవుతోంది. వాటాల వారీగా అందరికీ డబ్బులు ముడుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇవిగో ఉదాహరణలు

  • 2021లో ప్రజారోగ్య విభాగంలో పారిశుద్ధ్య పనుల కోసం 452 మంది తాత్కాలిక కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో సగం మంది విధులకు గైర్హాజరవుతున్నారు. మూడేళ్లలో 80-90 మంది పేర్లు మార్చేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని తెలిసింది.
  • కాజీపేట ప్రాంతంలో ఇద్దరు కార్మికులను నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారని తెలిసింది. దీని వెనుక ప్రజారోగ్య విభాగం ఉద్యోగుల పాత్ర ఉందంటున్నారు.
  • హనుమకొండ ప్రాంతం ఓ క్షేత్రస్థాయి ఉద్యోగి నాలుగు నుంచి ఆరుగురు కార్మికుల పేర్లు మార్పించినట్లు తెలిసింది.
  • వరంగల్‌, పాతబస్తీ ప్రాంతం, విలీన గ్రామాల్లో ఆరుగురు కార్మికుల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని సమాచారం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని