logo

ఆటుపోట్లు దాటి.. విజేతగా నిలిచి

ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు..  రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు.

Published : 28 Mar 2024 04:29 IST

రాయపర్తి(వరంగల్‌), న్యూస్‌టుడే

ఆయన పుట్టుకతోనే దివ్యాంగుడు..  రెండు కాళ్లూ పనిచేయవు. చిన్నతనం నుంచే బతుకుపోరాటం సాగించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రికెట్పై ఉన్న మక్కువతో ఆ దిశగా సన్నద్ధమయ్యారు. అవకాశాలను అందిపుచ్చుకొని దివ్యాంగ వీల్‌ఛైర్‌ క్రికెట్ పోటీల్లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లి(తండా) గ్రామానికి చెందిన రాంజీనాయక్‌.

గుగులోతు కీరి- వాలు దంపతుల నలుగురి సంతానంలో రాంజీనాయక్‌ ఒకరు. కుమార్తె తర్వాత కుమారుడు పుట్టాడని ఆనందించాలో.. వైకల్యం ఉందని బాధపడాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రులది. అందరిలా చదువు చెప్పించారు. తనకు ఇష్టమైన రంగంలో ప్రోత్సహించారు. పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్నారు. రాంజీనాయక్‌.. ఇది గ్రహించిన తండ్రి వాలు.. కావాల్సిన ఆట వస్తువులను సమకూరుస్తూ ప్రోత్సహించారు. 2021లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి దివ్యాంగ వీల్‌ఛైర్‌ క్రికెట్ అసోసియేషన్‌లో అవకాశం దక్కించుకున్నారు. విశాఖపట్టణం, రాజస్థాన్‌లోని హరిద్వార్‌, రాజమహేంద్రవరం, హైదరాబాద్‌, గోవాలో జరిగిన జాతీయస్థాయి, వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. వైకల్యం ఉన్నా.. ఆసక్తికి సంకల్పబలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఈక్రమంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా వెరవలేదు. ప్రస్తుతం డీసీసీఐ(డిఫరెంట్లీ ఎబ్‌ల్డ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా) బోర్డు సభ్యుడు, తెలంగాణ టీం కోర్‌ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

దివ్యాంగులను గెలిపించడమే లక్ష్యం

వైకల్యం ఉన్నా.. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న యువతలో మనోధైర్యం నింపుతూ.. వారిని జీవితంలో గెలిపించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. డీసీసీఐ బోర్డును బీసీసీఐ పరిధిలోకి తీసుకొని దివ్యాంగ క్రీడాకారులకు ఉత్తమ అవకాశాలను కల్పించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని