logo

కరెంటు బిల్లుకూ కష్టమై

విద్యుత్తు బిల్లుల బకాయిల సెగ ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను తాకింది. దాదాపు ఏడాది నుంచి బిల్లులు చెల్లింపులు జరక్కపోవడంతో ఆ శాఖ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

Published : 26 Nov 2022 06:14 IST

చెల్లించలేకపోతున్న  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు
సరఫరా నిలిపివేత

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లుల బకాయిల సెగ ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను తాకింది. దాదాపు ఏడాది నుంచి బిల్లులు చెల్లింపులు జరక్కపోవడంతో ఆ శాఖ కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని సంబంధిత అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి గురువారం సరఫరా నిలిపివేశారు. ఆ రోజు ఇన్వర్టర్‌ ద్వారా కార్యకలాపాలు కొనసాగించిన అక్కడి ఉద్యోగులు శుక్రవారం చేతులెత్తేయడంతో రోజంతా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. స్థానిక రాజకీయ నాయకులతో చెప్పించడంతో పాటు అధికారులు సొంతంగా రూ.15 వేలు చెల్లించడంతో శుక్రవారం రాత్రికి సరఫరాను పునరుద్ధరించారు. ఈ కార్యాలయానికి సంబంధించి విద్యుత్తు బిల్లుల బకాయి రూ.68 వేల వరకు ఉంది.

ఏమిటీ దుస్థితి

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే వాటిలో రిజిస్ట్రేషన్ల శాఖ కీలకమైంది. ఏడాది కాలంగా కార్యాలయాల నిర్వహణకు బడ్జెట్‌ కేటాయించకపోవడంతో విద్యుత్తు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో ఆ శాఖ కార్యాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొందరు అధికారులు సొంత సొమ్ముతో బిల్లులు చెల్లించినా ఆ మొత్తం తిరిగి రాలేదని సమాచారం. దీంతో ఎవరూ బిల్లులు చెల్లించే పరిస్థితి లేకుండాపోయింది. క్రమంగా విద్యుత్తు బిల్లుల బకాయిలు రూ. లక్షల్లో పేరుకుపోయి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అత్తిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రూ.1.59 లక్షల వరకు బిల్లు బకాయిలు ఉంది. కనెక్షన్‌ తొలగిస్తామంటూ వచ్చిన విద్యుత్తు శాఖాధికారులను అక్కడి సిబ్బంది బతిమాలుకుని నెలాఖరుకు చెల్లిస్తామని చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఈ కార్యాలయం ద్వారా నెలకు రూ.కోటి వరకు ఆదాయం లభిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరిలోనే అత్యధిక ఆదాయాన్నిచ్చే భీమవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి విద్యుత్తు బకాయిలు సుమారు రూ.3 లక్షల వరకు, వీరవాసరం కార్యాలయానికి రూ.1.20 లక్షల మేర విద్యుత్తు బకాయిలున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

భీమవరం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో 15 సబ్ర్‌ిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటన్నింటికి కలిపి రూ.31.44 లక్షల మేర విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కార్యాలయాల్లో ఏడాదికి సుమారు 90 వేల దస్త్రాలకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.340 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలో 12 కార్యాలయాలుండగా వాటి ద్వారా ఏడాదికి సుమారు రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది. ఏలూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొన్ని కార్యాలయాలకు ఏడాది కిందట విద్యుత్తు బిల్లుల కోసం రూ.5వేల చొప్పున విడుదల చేశారు. కొన్నింటికి మాత్రం 2020 ఏప్రిల్‌ తర్వాత  ఇవ్వలేదని సమాచారం.

బిల్లులు చెల్లిస్తాం..

విద్యుత్తు బిల్లుల కోసం ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. భీమవరం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సంబంధించి రూ.30.22 లక్షల బడ్జెట్‌ ఇచ్చారు. ఈ నిధులు త్వరలోనే విడుదలవుతాయి. అన్నిచోట్లా బిల్లులు చెల్లిస్తాం. ప్రజలకు సేవలందించే కార్యాలయాలు కాబట్టి విద్యుత్తు సరఫరా నిలిపివేయొద్దంటూ మా శాఖ ఉన్నతాధికారులు విద్యుత్తు శాఖకు లేఖ ఇచ్చారు.

సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్‌, భీమవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని