logo

మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు

అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు.

Updated : 26 Apr 2024 04:59 IST

ఊరూరా వైకాపా నాయకుల దందా
చెలరేగిపోతున్న జగన్‌ బ్యాచ్‌
యథేచ్ఛగా సహజ వనరుల  దోపిడీ
రహదారుల ఛిద్రం.. జీవితాలు చిన్నాభిన్నం

  • జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలోని విజ్జువారికుంటలో మీటరు లోతు అనుమతులు తీసుకుని ఇష్టారాజ్యంగా తవ్వేసి అమ్ముకున్నారు. ఉపసర్పంచి వెంకటరాముడు, కొందరు నాయకులు కలిసి కలెక్టర్‌తో పాటు గనుల శాఖకు ఫిర్యాదు చేశారు. గనులశాఖ చేసిన సర్వేలో రూ.20 లక్షలకు పైగా విలువైన మట్టిని అక్రమంగా తవ్వుకున్నట్లు గుర్తించినా చర్యలు లేవు.
  • జంగారెడ్డిగూడెం పరిధిలోని వెంకమ్మ చెరువుకు గండి పెట్టి నీరు తోడేసి మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. దీంతో నాగులగూడెం గ్రామస్థులు గొడవ చేశారు. జలవనరుల శాఖ ఏఈ భాస్కరరావు మే 24న లక్కవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • ఎర్రకాలువ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను చక్రదేవరపల్లిలో 2022లో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. రెండు గంటలపైగా జేసీబీ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అయినా తవ్వకాలు ఆగలేదు.

ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే, భీమవరం అర్బన్‌, జంగారెడ్డిగూడెం

అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. పచ్చని ప్రకృతిపై పంజా విసిరి..సహజ వనరుల వినాశనానికి ధ్వంస రచన చేస్తున్నారు. రూ.వందల కోట్లు స్వాహా చేస్తున్నారు. రహదారులను నాశనం చేస్తున్నారు. పదుల సంఖ్యలో అభాగ్యులను పొట్టన పెట్టుకున్నారు.

అయిదేళ్ల వైకాపా పాలనలో ఉమ్మడి పశ్చిమలో మట్టి తరలించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. వైకాపా ప్రజాప్రతినిధుల అండతో స్థానిక నాయకులు అడ్డగోలుగా మట్టిని మింగేశారు. చెరువులను అగాధాలుగా మార్చేశారు..కొండలను మాయం చేశారు.. పోలవరం కుడి కాలువ గట్టు ధ్వంసం చేసేశారు. ఆచంట లంకలను మట్టి మాఫియాకు స్థావరాలుగా మార్చేశారు. ఎర్రకాలువకు గర్భశోకం మిగిల్చారు. ఏలూరు, పెదవేగి, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు, మండవల్లి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, లింగపాలెం, కామవరపుకోట జంగారెడ్డిగూడెం ఇలా ప్రతి మండలంలోనూ వైకాపా నాయకులే మట్టి దందా చేస్తున్నారు. అయిదేళ్లలో దాదాపు 3 కోట్ల టన్నుల మట్టిని అక్రమంగా తరలించారు. ఈ మట్టి విలువ రూ.956 కోట్లు. ఇలా జగన్‌ అనుచరగణం భారీగా ఆర్జించింది.


నిరసనలన్నా లెక్కలేదు

ఎర్రకాలువలో తవ్వకాలు నిలిపివేయాలంటూ జేసీబీ ముందు బైఠాయించిన న్యూడెమోక్రసీ నాయకులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైకాపా నాయకులు కోట్ల టన్నుల మట్టిని మింగేస్తుంటే గనుల శాఖ నోరు మెదపలేదు. స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకున్నా.. కనీసం  ఫిర్యాదులపై కూడా చర్యలు లేవు.


రహదారులు ఛిద్రం

మట్టి వాహనాల రాకపోకలతో ధ్వంసమైన భీమవరం-అనాకోడేరు మార్గం

జగన్‌ పాలనలో కొత్తగా నిర్మించింది లేదు కానీ... తెదేపా హయాంలో వేసిన రహదారులను సైతం మట్టి మాఫియా ధ్వంసం చేసేసింది. మట్టి లోడుతో లారీలు, ట్రాక్టర్లు తిరగటంతో దారులు ఛిన్నాభిన్నమయ్యాయి. భీమవరం మండలం రాయలం నుంచి అనాకోడేరు రహదారిని తెదేపా ప్రభుత్వం రూ.5 కోట్లతో అభివృద్ధి చేసింది. నిరంతరం ఈ రోడ్డుపై మట్టి రవాణా చేయటంతో పూర్తిగా ధ్వంసమైంది. ఛిద్రమైన రహదారులు పెదవేగి, పెదపాడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, కైకలూరు, ఆచంట, పోడూరు.. ఇలా ప్రతి మండలంలో కనిపిస్తాయి.


మట్టి దాహంతో ప్రాణాలు తీస్తారా?

కొమరాడలో తరలిస్తున్న నల్లమట్టి

వైకాపా నాయకుల మట్టి దాహం అమాయకులైన ప్రయాణికుల ఉసురు తీస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రుళ్లు భారీ వాహనాలతో మట్టి తరలించే క్రమంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం భీమవరం మండలం నాగేంద్రపురం దగ్గర మట్టి లారీ తిరగబడి డ్రైవర్‌ చనిపోయారు. మూడేళ్ల క్రితం కాళ్లలో లంక కుంత రహదారిలో మట్టి ట్రాక్టర్‌ ఢీకొని ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు అక్కడికక్కడే చనిపోయారు. నాలుగేళ్ల క్రితం భీమవరం మండలం తుందుర్రు పరిధిలో మట్టి ట్రాక్టర్‌ ఆటోను ఢీకొనటంతో వీరవాసరం మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. కలిదిండి మండలం వెంకటాపురంలో మూడేళ్ల క్రితం మట్టి తవ్వకాలు జరిగే ప్రాంతంలో ట్రాక్టర్‌ ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఉమ్మడి జిల్లాలో గత అయిదేళ్లుగా మట్టి తరలించే వాహనాల వల్ల 55 ప్రమాదాలు జరిగాయి. 16 మంది మృతి చెందగా 48 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందులో 30 శాతం మంది మంచాన పడ్డారని తెలుస్తోంది.

గత అయిదేళ్లలో అక్రమంగా  తరలించిన మట్టి: 3 కోట్ల టన్నులు
ప్రభుత్వం కోల్పోయిన రాయల్టీ: రూ.39 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని