logo

జలకళ వెలవెల

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ జలకళ వెలవెలబోతోంది. మెట్ట రైతులకు వరంలా మారుతుందనుకున్న పథకం లక్ష్యం ప్రారంభంలోనే గతి తప్పింది. బోర్లు తవ్విన గుత్తేదారులకు బిల్లులు అందకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి

Published : 07 Dec 2021 04:37 IST

రైతులకు తప్పని ఎదురు చూపులు


చింతలపూడి మండలంలో బోరు డ్రిల్లింగ్‌ (పాత చిత్రం)

చింతలపూడి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ జలకళ వెలవెలబోతోంది. మెట్ట రైతులకు వరంలా మారుతుందనుకున్న పథకం లక్ష్యం ప్రారంభంలోనే గతి తప్పింది. బోర్లు తవ్విన గుత్తేదారులకు బిల్లులు అందకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉచితంగా బోర్లు వేస్తామని ప్రకటించడంతో రైతులు ఉత్సాహం చూపారు. తవ్వకాలు జరగకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.

పథకం ప్రారంభించినప్పుడు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. 20 సెంట్లున్న రైతులూ దరఖాస్తు చేశారు. అనంతరం అర్హుల ఎంపికకు సంబంధించి నిబంధనలు మార్చారు. తాజా నిబంధనల మేరకు రైతుకు కనీసం 2.50 ఎకరాల భూమి ఉండాలి. లేదంటే 2.50 ఎకరాలు కలిగిన రైతులు బృందంగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవచ్ఛు అయిదు ఎకరాల్లోపు చిన్న, సన్న కారు రైతులకు బోరుతో పాటు ఉచితంగా మోటారు, విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వనున్నారు.

నియోజకవర్గానికి ఒక రిగ్గు అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నెలనెలా వెయ్యి చొప్పున బోర్లు తవ్వాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. జిల్లాలో ఐదు ఏజెన్సీలకు బోర్ల తవ్వకాల బాధ్యత అప్పగించారు. పెండింగ్‌ బిల్లుల కారణంగా ఏజెన్సీలకు బోర్లు తవ్వడం భారంగా మారింది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బోర్ల తవ్వకాలు సాగడం లేదు. బోర్లు ఎప్పుడు తవ్వుతారా అని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. ‘జలకళ పథకంలో రైతుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. బోర్ల తవ్వకాలకు సంబంధించి గుత్తేదారులకు కొంత బకాయి విడుదల కావాల్సి ఉంది. త్వరలోనే బిల్లులు చెల్లిస్తాం. అనంతరం పనుల ప్రక్రియ వేగిరం చేస్తాం’ అని డ్వామా ఏపీడీ జి.ప్రపుల్లా అన్నారు.

చేతులెత్తేసిన గుత్తేదారులు.. సీఎఫ్‌ఎంఎస్‌ ఐడీల కేటాయింపులో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బోర్లు తవ్వే ఏజెన్సీలకు ఇంతకుముందు రాష్ట్రస్థాయిలో చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు జిల్లాస్థాయిలో చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుత్తేదారులకు రూ.5 కోట్లకు పైగా బిల్లుల చెల్లింపులు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే రోజురోజుకు బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో గుత్తేదారులు బోర్ల తవ్వకాలను నిలిపివేశారు.

జిల్లాలో దరఖాస్తులు 7,052

తవ్వకానికి అనుమతిచ్చిన

బోర్లు 2,958

ఇప్పటివరకు తవ్వినవి 483

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని