logo

మమ అనిపించారు!

కడప జిల్లాపరిషత్తు కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్థాయి సంఘాల సమావేశాలు మమ అనిపించేలా ముగిశాయి. పూర్తిస్థాయిలో స్టాండింగ్‌ కమిటీ సభ్యులు హాజరు కాకపోవడం, హాజరైనవారిలో కొందరు మాత్రమే సమస్యలు ప్రస్తావించడం

Published : 25 Sep 2022 03:41 IST

పూర్తి స్థాయిలో హాజరు కాని సభ్యులు

సమస్యల పరిష్కారానికి కనిపించని చొరవ

ఇదీ జడ్పీ స్థాయి సంఘాల సమావేశం తీరు!

సభ్యులతో మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

కడప ఏడురోడ్లు, న్యూస్‌టుడే : కడప జిల్లాపరిషత్తు కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్థాయి సంఘాల సమావేశాలు మమ అనిపించేలా ముగిశాయి. పూర్తిస్థాయిలో స్టాండింగ్‌ కమిటీ సభ్యులు హాజరు కాకపోవడం, హాజరైనవారిలో కొందరు మాత్రమే సమస్యలు ప్రస్తావించడం గమనార్హం. సమావేశాలకు అధ్యక్షత వహించిన జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీసభ్యులందరూ తప్పని సరిగా మాట్లాడాలని, అందరికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని సీఈవో సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి ఆ శాఖ ప్రగతిని వివరించారు. ఉద్యోగమేళాలు జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో జరుగుతోందా..! ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో జరుగుతోందా అని జడ్పీ ఛైర్మన్‌ ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున మెగా, మినీ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నామన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను నిర్వహిస్తూ శిక్షణ పొందిన అనంతరం ఉపాధి కల్పిస్తున్నామన్నారు. గ్రామాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి అవకాశాలొచ్చేలా చూడాలని సభ్యులకు ఛైర్మన్‌ సూచించారు. అనంతరం వివిధ శాఖల ప్రగతిని అధికారులు వివరించారు. గ్రామాల్లో మట్టి, సిమెంటు రహదారులు ఎందుకు నిర్మించడంలేదని డ్వామా పీడీని ఛైర్మన్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాధాన్యం ప్రకారం పనులు చేస్తున్నామని పీడీ వివరించారు. గృహనిర్మాణశాఖకు సంబంధించి బిల్లులు రావడం లేదని ప్రశ్నించగా, లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా సమర్పించకపోవడంతో సమస్య తలెత్తుతోందని ,వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో దోమల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారని ఖాజీపేట జడ్పీటీసీసభ్యురాలు పుష్పలత ప్రశ్నించారు. మైదుకూరు కేంద్రంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న కోడిగుడ్లు బయట అంగడిలో లభిస్తున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోరుమామిళ్ల జడ్పీటీసీసభ్యుడు ప్రసాద్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్లు కొన్నిచోట్ల సరఫరా అవుతున్నాయని, తమ ప్రాంతానికి గైనకాలజిస్టును నియమించాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. బి.కోడూరు జడ్పీటీసీసభ్యుడు దావీద్‌ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ప్రభుత్వాసుపత్రిలో నర్సుల కొరత ఉందన్నారు.

కోర్టు కేసులున్నాయి

వేంపల్లె జడ్పీ స్థలంలో కాంప్లెక్స్‌లు కడితే జడ్పీకి ఆదాయం వస్తుంది కదాని వేంపల్లె జడ్పీటీసీసభ్యుడు రవికుమార్‌రెడ్డి సూచించారు. దీనిపై సీఈవో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంప్లెక్సులు కట్టలేమని.. కోర్టు కేసులు నడుస్తున్నాయని చెప్పగా, కోర్టు కేసులని చెప్పగానే జడ్పీటీసీలు మాట్లాడరని చెబుతున్నట్లుగా ఉందని, కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు. దీనిపై ఛైర్మన్‌ కల్పించుకుని ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాత్రి వేళల్లో సిబ్బంది ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశాల్లో జడ్పీ వైస్‌ ఛైర్మన్లు పిట్టు బాలయ్య, శారద, డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు