logo

మంత్రులూ.. ఎప్పుడిస్తారు బిల్లులు?

కడప నగరంలోని జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం జరిగింది.

Updated : 31 Jan 2023 04:18 IST

గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం
జడ్పీ సమావేశంలో సభ్యుల నిలదీత
ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, జిల్లా పరిషత్తు

‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపట్టిన సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టాలంటూ అధికారులు మాపై ఒత్తిడి తెచ్చారు. గుత్తేదారులను బతిమాలి పనులు చేయించాం. పనులు పూర్తయి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు మాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గ్రామాల్లో తిరగాలంటే ఇబ్బందిగా ఉంది. జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఉన్నారు. ఏం ప్రయోజనం? గత మూడేళ్లుగా పాత ఎస్‌ఎస్‌ఆర్‌ ధరలే అమలు చేస్తున్నారు’ అని వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, చక్రాయపేట, వేంపల్లె, కమలాపురం జడ్పీటీసీ సభ్యులు శివప్రసాద్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి, సుమిత్ర ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లవుతున్నా ఇంకా తెదేపా పేరు చెప్పి బిల్లుల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలాగని ప్రశ్నించారు. గ్రామీణ రహదారుల విషయంలో ప్రజల్లో తలెత్తుకునే పరిస్థితి లేదని వాపోయారు.

డప నగరంలోని జిల్లా పరిషత్తు కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, రాయచోటి, బద్వేలు ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, సుధ, వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు విజయరామరాజు, గిరీష, జేసీ సాయికాంత్‌వర్మ, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ వైయస్‌ఆర్‌ పశు బీమా పథకం కింద 15 రోజుల్లో నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు వారి ఇబ్బందులు తమ దృష్టికి తీసుకొచ్చారని, గత ప్రభుత్వం నీరు-చెట్టు పనులకు సంబంధించి రూ.2,200 కోట్ల బకాయిలను ప్రభుత్వంపై ఉంచిందన్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడం, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి చోటుచేసుకోరాదని, వారిని తప్పనిసరిగా గౌరవించాలన్నారు. అనంతరం జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 2023-24కుగానూ సీపీడబ్ల్యూఎస్‌ పథకాల నిర్వహణ నిమిత్తం టెండర్లను నిర్వహించి తక్కువ కోడ్‌ చేసిన గుత్తేదారునికి పనులు అప్పగించడానికి ఆమోదాన్ని కోరారు. రాజంపేట డివిజన్‌లో 9 పనులకు రూ.8.35 కోట్లు, పులివెందుల డివిజన్‌లో 7 పనులకు రూ.11.3 కోట్లు, కడప డివిజన్‌లో 6 పనులకు రూ.7.51 కోట్లకు ఆమోదించామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, జడ్పీ వైస్‌ ఛైర్మన్లు బాలయ్య, శారద, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.


బాధిత రైతులను ఆదుకోండి

వ్యవసాయ, ఉద్యాన శాఖలపై చక్రాయపేట జడ్పీటీసీ సభ్యుడు శివప్రసాద్‌ మాట్లాడుతూ మామిడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి దళారుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. దీనిపై ఉద్యాన శాఖ అధికారులు మాట్లాడుతూ కొనుగోలుదారులు, అమ్మకందారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

కమలాపురం జడ్పీటీసీసభ్యురాలు సుమిత్ర మాట్లాడుతూ జిల్లాలో మినుము, శనగ పంటలు కోతకొచ్చాయని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మార్క్‌ఫెడ్‌ అధికారులు స్పందిస్తూ శనగల కొనుగోలుకు 26 కేంద్రాలను గుర్తించామని, మినుముల కొనుగోలు కూడా ఈ కేంద్రాల్లోనే చేపడతామని వివరించారు.

వీఎన్‌పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి మాట్లాడుతూ వీఎన్‌పల్లె మండలంలో 10 వేల ఎకరాలు పత్తి పంట సాగైందని, ఇందులో 9,465 ఎకరాల్లో ఎర్రతెగులు సోకి పూర్తిగా దెబ్బతిందని, బాధిత రైతులను ఆదుకోవాలని విన్నవించారు. దీనిపై వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33 శాతం పంట దెబ్బతింటే నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.

కాశినాయన జడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో మూడేళ్లుగా బిందు, తుంపర సేద్యం పరికరాలివ్వలేదన్నారు.


పశువులకు మందులేవి?

జిల్లాలో పశువులకు మందుల్లేవని, అంబులెన్స్‌లు అందుబాటులోకి రావడంలేదని సభ్యులు ధ్వజమెత్తారు. చక్రాయపేట, వేంపల్లె జడ్పీటీసీ సభ్యులు శివప్రసాద్‌రెడ్డి, రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆవులు చనిపోతే రెండేళ్లుగా బీమా రావడం లేదని నిలదీశారు. చక్రాయపేట, నాగులగుట్టపల్లెలో ఆసుపత్రుల్లో రెండు నూతన భవనాలు ప్రారంభించారని, అక్కడ పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని కోరారు. దీనిపై జేసీ సాయికాంత్‌వర్మ స్పందించి హెడ్‌డీఎస్‌ ఫండ్‌ కింద నిర్వహణ ఖర్చులు వినియోగించుకోవాలని సూచించారు.

బద్వేలు ఎమ్మెల్యే సుధ మాట్లాడుతూ పోరుమామిళ్ల ఆసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంకు స్టోరేజి యూనిట్‌ను డ్రగ్‌ ఇన్‌స్పెక్టరు వచ్చి పరిశీలించి ప్రారంభించాలని కోరారు.

వీఎన్‌పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి మాట్లాడుతూ వీఎన్‌పల్లెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సాయంత్రం 5 గంటల అనంతరం అందుబాటులో ఉండడం లేదన్నారు.

కో-ఆప్షన్‌ సభ్యుడు కరీముల్లా మాట్లాడుతూ ఖాజీపేట మండలంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు స్థానికంగా ఉండడంలేదని తెలిపారు.

ప్రభుత్వ పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ సలహాదారు నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వాములయ్యేటట్లు చూడాలని, వారికి తగిన గౌరవమివ్వాలని కోరారు.  పోరుమామిళ్లలో 9 మంది వైద్యులు ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే విధులను నిర్వర్తిస్తున్నారని, అక్కడ పూర్తిస్థాయిలో వైద్యుల నియమించాలని కోరారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు సక్రమంగా అందడంలేదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు