logo

అగ్నిమాపకశాఖ... సిబ్బంది కానరాక!

Updated : 23 Mar 2023 06:20 IST

కష్టమవుతున్న ప్రమాదాల అదుపు చర్యలు
ఉద్యోగుల కొరతతో పూర్తిస్థాయిలో అందని సేవలు
మౌలిక సదుపాయాలకూ నోచుకోని కార్యాలయాలు!

లక్కిరెడ్డిపల్లెలోని అగ్నిమాపకశాఖ కేంద్రం

వేసవి వచ్చిందంటే తొలుత  గుర్తొచ్చేది అగ్ని ప్రమాదాలే. ప్రమాదాల నివారణకు విపత్తులశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్నిమాపకశాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం ఉద్యోగుల సర్దు బాటుపై ప్రత్యేక దృష్టిసారించకపోవడం గమనార్హం. ఉమ్మడి కడప జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు సిబ్బంది వచ్చేందుకు ఇష్టపడకపోవడం, విధులు కేటాయించినా సిఫార్సులతో వారు కోరుకున్న ప్రాంతాల్లో ఉండిపోయారు. ఫలితంగా ఏడాది కిందట ఏర్పడిన నూతన జిల్లాలోని అగ్నిమాపకశాఖ కార్యాలయాలు సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి.

న్యూస్‌టుడే, రాయచోటి

ఏడాది కిందట జరిగిన జిల్లాల పునర్విభజన అనంతరం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని పీలేరు, ములకలచెరువు, మదనపల్లె, వాల్మీకిపురం, ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, రైల్వేకోడూరు అగ్నిమాప కేంద్రాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటైన కార్యాలయానికి కనీసం పది మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, కేవలం జిల్లా అధికారితో పాటు మరొక ఆపరేటర్‌ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని అన్ని కేంద్రాల నిర్వహణ బాధ్యతలు చూడాలంటే ఇబ్బందిగా మారింది. జిల్లాలోని అన్ని కార్యాలయాల పరిధిలో 150 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా 96 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 72 ఫైర్‌మెన్లు ఉండాల్సి ఉండగా, 33 మంది మాత్రమే ఉన్నారు. ఈ శాఖకు హోంగార్డులను కేటాయించాల్సి ఉన్నా జిల్లా ఏర్పాటు అనంతరం వారి నియామకం జరగలేదు. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే విధులు నిర్వహిస్తూ విపత్తుల నివారణలో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం జిల్లాల విభజన చేసేందుకు చూపిన ఉత్సుకతను సిబ్బంది నియామకంపై చూపకపోవడంతో జిల్లాలో అగ్నిమాపకశాఖ సమస్యలతో సతమతమవుతోంది.

కానరాని మౌలిక వసతులు: జిల్లాలోని అగ్నిమాపకశాఖ కేంద్రాల్లో కనీస మౌలిక వసతుల్లేక సిబ్బంది ఇరుకు గదుల్లోనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. కొత్త భవనాలు నిర్మించినచోట మరుగుదొడ్లు, తాగు నీరు, విద్యుత్తు కల్పన సమస్యలు తలెత్తుతున్నాయి. కార్యాలయం, సిబ్బంది వసతి గదులు, వాహనాలుండేందుకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. చాలా కేంద్రాలలో వసతుల్లేక అగ్నిమాపక యంత్రాలు ఆరుబయటే ఉంటున్నాయి.

* జిల్లా కేంద్రమైన రాయచోటిలోని అగ్నిమాపకశాఖ కేంద్రానికి ప్రహరీ నిర్మించకపోవడంతో స్థలం ఆక్రమణలకు గురవుతోంది. వర్షాల సమయంలో వరదనీరు కార్యాలయ ఆవరణలోకి పారుతుండడంతో మడుగును తలపిస్తోంది. ఇక్కడ ఇరుకు గదుల్లోనే సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది. పీలేరు, ములకలచెరువు, వాల్మీకిపురం కేంద్రాల్లో మౌలిక సదుపాయాల్లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు.

* లక్కిరెడ్డిపల్లెలోని అగ్నిమాపకశాఖ కేంద్రానికి మూడేళ్ల కిందట రూ.కోటికిపైగా నిధులు వెచ్చించి కొత్త భవనాలు నిర్మించారు. ఇక్కడ పనులు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి బోరు వేసినా మోటారు కనెక్షను ఇవ్వలేదు. మరుగుదొడ్లు నిర్మించారే తప్ప నీటి కనెక్షన్లు, విద్యుత్తు సరఫరా ఇవ్వకపోవడంతో వాడకం అటకెక్కింది. అత్యవసర పరిస్థితి ఎదురైతే యంత్రాన్ని బయట ప్రాంతాలకు తీసుకెళ్లి నీటిని నింపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రహరీ లేకపోవడంతో రాత్రివేళలో విషపురుగుల బెడదతో భయాందోళనకు గురవుతున్నారు.

* రాజంపేట అగ్నిమాపకశాఖ కేంద్రంలో ఇరుకు గదులే ఉన్నాయి. ఇక్కడ రెండున్నరేళ్ల కిందట కొత్త భవనం నిర్మించారు. యంత్రం నిలిపేందుకు దిగువ ఫ్లోర్‌ ఉండగా పైఅంతస్తులో కార్యాలయం నిర్వహిస్తున్నారు. సంపు ఏర్పాటు చేసినా నీటి కుళాయి ద్వారా నీరు అందులో నింపుకొని యంత్రానికి నింపుకోవాల్సి వస్తోంది. కేంద్రం జాతీయ రహదారిపై ఉండగా, పూర్తిస్థాయిలో ప్రహరీ నిర్మించలేదు.

చర్యలు తీసుకుంటాం

జిల్లాలోని అగ్నిమాపకశాఖ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. భవన నిర్మాణ విభాగం అధికారులు గదులు, ప్రహరీల నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది కొరత ఉన్నా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహిస్తూ విపత్తులను సకాలంలో నివారిస్తున్నాం. నీటి సమస్యల్లేకుండా పురపాలక, పంచాయతీల నీటి పథకాల నుంచి నీటిని యంత్రాలతో నింపుకొంటున్నాం.

అనిల్‌కుమార్‌, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని