logo

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి మృతి

కడప రైల్వేస్టేషన్‌ పరిధిలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై రారాజు తెలిపారు.

Published : 30 Mar 2023 04:25 IST

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప రైల్వేస్టేషన్‌ పరిధిలో బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై రారాజు తెలిపారు. కడప శివానందపురానికి చెందిన హరి (36) ఎర్రగుంట్లలోని ఆర్టీపీపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో హెల్‌ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. రోజూ రైల్లో ఎర్రగుంట్లకు వెళ్లేవారు. బుధవారం మూడో ప్లాట్‌ఫాంపై సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఉంది. రైలు వెళ్లిపోతుందని పట్టాల మీదుగా అవతలికి దాటుకునే సమయంలో రైలు వచ్చి ఢీకొంది. ప్రమాదంలో హరి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హరికి 40 రోజుల కిందట వివాహమైంది. భార్య ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. భర్త మృతదేహాన్ని చూసి భార్య విలపించారు. బీ కడప శివారులోని చౌటుపల్లె సమీపంలో దిగువ రైలు పట్టాలపై బుధవారం గుర్తు తెలియని వివాహిత రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. మృతిచెందిన మహిళకు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందన్నారు.


సింగనపల్లి అడవుల్లో ఒకరు...

మర్రిపాడు, న్యూస్‌టుడే: మండలంలోని సింగనపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఓ వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు వైయస్సార్‌(కడప) జిల్లా బద్వేలు మండలం నందిపల్లికి చెందిన మన్యం బలరామిరెడ్డి(74)గా గుర్తించారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. అటవీశాఖ అధికారులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా సింగనపల్లిలోని అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మర్రిపాడు ఎస్సై విశ్వనాథ్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడై మిస్సింగ్‌ కేసు నమోదైందా? అని ఆరా తీశారు. బద్వేలులో మిస్సింగ్‌ కేసు నమోదైందని తెలియడంతో మృతుని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు బలరామిరెడ్డిగా గుర్తించారు. మృతుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ.. నొప్పిని భరించలేక శీతల పానీయంలో గుళికలు కలుపుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బంధువులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.


చికిత్స పొందుతూ మరొకరు...

పెద్ద తిరుపాల్‌ (పాత చిత్రం)

వెలిదండ్ల (లింగాల), న్యూస్‌టుడే : రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెలిదండ్లకు చెందిన పెద్ద తిరుపాల్‌ (62) కడప నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారని ఇన్‌ఛార్జి ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తిరుపాల్‌ తన కుమారుడుతో కలిసి ఈ నెల 16న పులివెందుల నుంచి వెలిదండ్లకు వస్తుండగా కర్ణపాపాయపల్లె సమీపంలో గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ తిరుపాల్‌ చికిత్స పొందుతూ మృతిచెందారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య

ముద్దనూరు, న్యూస్‌టుడే: రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ముద్దనూరు రైల్వే నిలయం శివారు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే ఎస్సైకె.ఎస్‌.వర్మ బుధవారం తెలిపిన వివరాల మేరకు.. ముద్దనూరు మండలం కాండ్రోపల్లె గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి (63)కి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పాటు మద్యానికి బానిసై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు వైద్యశాలకు తరలించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని