logo

మొదలైన నామినేషన్ల సందడి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్‌ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు.

Published : 19 Apr 2024 03:18 IST

తెదేపా ఎంపీ అభ్యర్థిగా భూపేష్‌రెడ్డి బోణీ

కలెక్టరుకు నామపత్రం అందిస్తున్న తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలైంది. కలెక్టర్‌ విజయ రామరాజు ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో నామపత్రాల స్వీకరణను ఆయన ప్రారంభించారు. తొలిరోజు తెదేపా తరఫున కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్‌ సుబ్బరామిరెడ్డి నామినేషన్‌ సమర్పించారు. తన చిన్నాన్న, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి తోడురాగా కలెక్టరుకు నామపత్రాన్ని అందించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కడప ఎంపీ అభ్యర్థిగా తనకు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయంతో ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ నెల 20న అన్ని నియోజకవర్గాల నాయకులతో కలిసి రెండో సెట్‌ నామినేషన్‌ వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జమ్మలమడుగు పార్టీ నేతలు పాల్గొన్నారు. ః అన్నా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున కడప నగరానికి చెందిన షేక్‌ చాన్‌బాషా నామినేషన్‌ దాఖలు చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ప్రత్యేక భద్రత : కడప ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు కానున్న నేపథ్యంలో కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్‌ బయట ప్రధాన రహదారిలో ఒకవైపు పూర్తిగా మూసేశారు. ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను కలెక్టరేట్‌లోకి అనుమతించకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలను వెనక్కు పంపారు.

తెదేపా ఎంపీ అభ్యర్థి వివరాలివి... : కడప పార్లమెంటుకు తెదేపా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన భూపేష్‌రెడ్డి తనపై ఉన్న కేసులను ప్రస్తావించారు. జమ్మలమడుగు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎస్టీ, ఎస్టీ కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ వేయలేదని పేర్కొన్నారు. జమ్మలమడుగు కోర్టులో నడుస్తున్న మరో రెండు కేసులకు సంబంధించి ఛార్జిషీట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. శిక్షపడిన కేసులు లేవని తెలిపారు. రూ.9.60 లక్షల జీవిత బీమా, రూ.2 లక్షల బ్యాంకు డిపాజిట్లను చూపించారు. రూ.62.17 లక్షల స్థిరాస్తులు ఉండగా.. రూ.9 లక్షల బ్యాంకు రుణాలున్నట్లు వివరించారు.

రఘురామిరెడ్డికి రెండు కార్లు

మైదుకూరు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురామిరెడ్డి అఫిడవిట్‌లో కేసులను ప్రస్తావించారు. మైదుకూరు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులు, కోర్టులో విచారణ దశలో ఉన్నవాటిని ప్రస్తావించారు. రైల్వే కేసు నమోదవగా.. దాన్ని కొట్టివేసినట్లు వివరించారు. రూ.55 లక్షలు విలువైన రెండు కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కడప సమీపంలో పుల్లంపల్లె దగ్గర తన పేరిట రూ.2.04 కోట్లు, భార్య పేరిట రూ.22.95 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు వివరించారు.

ఆకేపాటికి రూ.3.35 కోట్ల ఆస్తులు

ఈనాడు, కడప: రాజంపేట అసెంబ్లీ స్థానానికి వైకాపా తరపున పోటీ చేస్తున్న ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఆయన సతీమణికి రూ.3.35 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు నామినేషన్‌ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆకేపాడు, మందపల్లె, శేషమాంబపురం, నూనేవారిపల్లె, రాజంపేట పట్టణం తదితర ఆస్తులను పేర్కొంటూ తన పేరిట రూ.2.60 కోట్లు, భార్య అమరజ్యోతి పేరిట రూ.75 లక్షల ఆస్తున్నట్లు వివరించారు. భూముల సర్వే నంబర్లు, నివాసాలు వివరించారు. రూ.19 లక్షలు విలువైన ఇన్నోవా కారు, బ్యాంకులో డిపాజిట్లు కలిపి రూ.24.42 లక్షలు వరకు ఉన్నట్లు వివరించారు. కేసులేమీ తన పేరిట లేవని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని