logo

ఓ మిస్డ్‌ కాల్‌తో పరిచయం.. ప్రేమించాక వ్యక్తి అంధుడని తెలిసి..

ప్రేమకు ఎందరు ఎన్నో నిర్వచనాలు చెప్పారు. దీనికి మనసుతో తప్ప రూపంతో సంబంధం లేదని కొందరు చెబితే... ప్రేమ గుడ్డిదని మరికొందరు అభిప్రాయపడ్డారు. వీటికి కొంత దగ్గరగా జరిగిందే బొలంగీర్‌ జిల్లాలోని ఒక ఘటన. ఒక మిస్డ్‌ కాల్‌... ఒక అంధుడ్ని, ఒక

Updated : 27 Jan 2022 09:57 IST


కోర్టు వద్ద దండలు మార్చుకుంటున్న వధూవరులు

కటక్, న్యూస్‌టుడే  ప్రేమకు ఎందరు ఎన్నో నిర్వచనాలు చెప్పారు. దీనికి మనసుతో తప్ప రూపంతో సంబంధం లేదని కొందరు చెబితే... ప్రేమ గుడ్డిదని మరికొందరు అభిప్రాయపడ్డారు. వీటికి కొంత దగ్గరగా జరిగిందే బొలంగీర్‌ జిల్లాలోని ఒక ఘటన. ఒక మిస్డ్‌ కాల్‌... ఒక అంధుడ్ని, ఒక యువతిని ప్రేమికులుగా మార్చింది. తర్వాత వారు జీవిత భాగస్వాములయ్యారు. వివరాల్లోకి వెళితే... బొలంగీర్‌ జిల్లాలోని పాట్నాగడ్‌ సమితి మండమాహోళి గ్రామానికి చెందిన యువకుడు దిలీప్‌ తండి పుట్టుకతో అంధుడు. కొన్నాళ్ల కిత్రం ఆయన తన స్నేహితునికి ఫోన్‌ చేయడానికి బదులు మరో నెంబర్‌కి ఫోన్‌ చేశాడు. ఎవరూ ప్రతిస్పందించలేదు. కొంతసేపటి తర్వాత చాందిని అనే యువతి తిరిగి ఫోన్‌ చేసి ఆయనను ఎవరని? ఎందుకు మిస్డ్‌కాల్‌ ఇచ్చారని అడిగింది. పొరపాటున ఫోన్‌ చేశానని ఆయన సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫోన్‌లో సంభాషణలు పెరిగాయి. చివరికి అది ప్రేమగా మారింది.  ఒకరోజు ఆమె ఆయనను చూసేందుకు పిలిచింది. దీంతో దిలీప్‌ తన స్నేహితులతో కలిసి చాందిని వద్దకు వెళ్లాడు. ఆయనకు చూపులేదనే విషయం ఆమెకు అప్పుడు తెలిసింది. అయినా వారి ప్రేమలో మార్పు రాలేదు. తర్వాత ఆయనను పెళ్లి చేసుకునేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసింది. ఇరు కుటుంబాలకు విషయం తెలియడంతో వారు కూడా అంగీకరించారు. మంగళవారం పాట్నాగఢ్‌ న్యాయస్థానంలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత బయట ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా చాందిని మీడియాతో మాట్లాడుతూ దిలీప్‌కు కళ్లు లేకపోయినా తన కళ్లతో ఆయనకు ప్రపంచం చూపిస్తానని చెప్పింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని